చిరంజీవి ముందు నిలబడగలడా..! అని ప్రచారం చేశారు: గిరిబాబు (పార్ట్ 13)

ABN , First Publish Date - 2021-05-15T01:41:21+05:30 IST

‘చిరంజీవిలాంటి మెగాస్టార్‌ తొలిసారిగా ఒక కౌబాయ్‌ చిత్రంలో నటిస్తుంటే, ఆయనకు పోటీగా గిరిబాబు వాళ్ల అబ్బాయిని హీరోగా పెట్టి ‘ఇంద్రజిత్‌’ చిత్రం తీస్తున్నాడు. ఎంత సాహసం! అటువంటి భారీ చిత్రంతో పోటీపడి సినిమా పూర్తి చేయగలడా, నిలబడగలడా’ అని. ఈ ప్రచారం పరిశ్రమలోనే కాదు

చిరంజీవి ముందు నిలబడగలడా..! అని ప్రచారం చేశారు: గిరిబాబు (పార్ట్ 13)

‘దేవతలారా దీవించండి’ చిత్రంతో నిర్మాతగా మారిన నేను హీరో కృష్ణగారితో జానపద చిత్రం ‘సింహగర్జన’ నిర్మించాను. విభిన్నంగా రూపుదిద్దుకున్న ఈ రెండు చిత్రాలూ విజయం సాధించడంతో మా సంస్థకు ఒక గుర్తింపు వచ్చింది. ‘యాక్షన్‌ చిత్రాలు నిర్మించే నిర్మాత’గా నాకొక ఇమేజ్‌ ఏర్పడింది. ఆ తర్వాత ‘ముద్దు ముచ్చట’ సినిమాని మా గ్రామంలో నిర్మించాను. అది కూడా బాగా ఆడింది. అయితే రామచంద్రరావుని దర్శకునిగా పరిచయం చేసిన ‘సంధ్యారాగం’ సినిమా మాత్రం పెద్దగా ఆడలేదు. దాంతో ప్రేక్షకులు నా నుంచి ఆశించేవి ఫ్యామిలీ సెంటిమెంట్‌ చిత్రాలు కాదనీ, యాక్షన్‌ చిత్రాలనీ అర్థమైంది. అందుకే మా సంస్థకు, నిర్మాతగా నాకు ఉన్న ఇమేజ్‌కి అనుగుణంగా యాక్షన్‌ కథాంశంతో ‘మెరుపుదాడి’ తీశాను. ఆ చిత్రం ఘనవిజయం సాధించింది. దాంతో నా ఇమేజ్‌ రెట్టింపు అయింది. అనంతరం ‘రణరంగం’ సినిమా తీశాను. దర్శకునిగా నా పేరు తెరపై చూపించిన తొలి సినిమా ఇది. భానుచందర్‌, నేను హీరోలుగా నటించాం. సుమలత కథానాయిక. రామారావుగారు, నాగేశ్వరరావుగారు తొలిసారి కలసి నటించిన ‘పల్లెటూరి పిల్ల’ చిత్రం ప్రేరణతో ఆ సినిమా నిర్మించాను. బి.ఎ.సుబ్బారావుగారు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అంజలీదేవిగారు టైటిల్‌ రోల్‌ పోషించారు. ఆ కథని తీసుకుని కొన్ని మార్పులు చేర్పులు చేసి, ‘వైకింగ్స్‌’ ఆంగ్ల చిత్రంలోని వార్‌ సీన్‌ తీసుకుని పతాక సన్నివేశాల రూపకల్పన చేశాం. సినిమా పెద్దగా ఆడలేదు కానీ వార్‌ సీన్స్‌ అద్భుతంగా ఉన్నాయని పేరు వచ్చింది. ఇప్పటిలా ఆ రోజుల్లో కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ మాకు లేవు కనుక ఉన్న సాంకేతిక సదుపాయాలతోనే పదిహేను రోజుల పాటు కష్టపడి పతాక సన్నివేశాలను తీయగలిగాను.


హీరోగా బోసుబాబు

ఆ సినిమా తర్వాత ఏ చిత్రం తీయాలనే ఆలోచన మొదలైంది. అప్పటికి మా రెండో అబ్బాయి బోసుబాబు యుక్త వయసుకి వచ్చాడు. నాలాగే తను కూడా సినీరంగంలోకి ప్రవేశించి, నటుడిగా పేరు తెచ్చుకోవాలనే కోరిక వాడికి ఉండేది. మా పెద్దవాడు రఘుబాబు మాత్రం నటన అంటే దూరంగా ఉండేవాడు. మా సినిమాలకు సంబంధించిన ప్రొడక్షన్‌ వ్యవహారాలు చూసేవాడు. తనకు కూడా నటించాలనే కోరిక ఉన్నట్లు ఎప్పుడూ నాతో చెప్పలేదు కూడా. బోసుబాబుకి నటించాలనే ఆసక్తి ఉందని నాతో చెప్పడంతో ‘మెరుపుదాడి’ చిత్రం తరహాలో ఒక కౌబాయ్‌ చిత్రాన్ని నిర్మించి అతన్ని హీరోగా పరిచయం చేయాలని నిర్ణయించుకున్నాను. ఆ సినిమాకి ‘ఇంద్రజిత్‌’ అని పేరు పెట్టాను. పకడ్బందీగా స్ర్కిప్ట్‌ తయారు చేసుకుని, షూటింగ్‌ మొదలుపెట్టాను. అప్పట్లో ఈ చిత్రనిర్మాణం నా తలకు మించిన భారం అయినా వెనుకాడకుండా భారీ ఎత్తున తీయాలనుకున్నాను. కొత్త హీరో కనుక ప్యాడింగ్‌ ఆర్టిస్టులు ఉండాలని నిర్మాణపరంగా ఎక్కడా రాజీపడకుండా పెద్దవారినే బుక్‌ చేశాను. కొత్త హీరోతో సినిమా అనగానే వ్యాపారపరంగా అన్నీ ఇబ్బందులే. అదే పెద్ద హీరోతో తీస్తే బయ్యర్లు పోటీలు పడి అడ్వాన్సులు ఇచ్చి సినిమా కొంటారు. ఆ విషయం నాకు తెలుసు కనుక నిర్మాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా మొండి ధైర్యంతో ముందుకు వెళ్లాను. అనుకున్న ప్రకారం సినిమాని పూర్తి చేశాను.


సరిగ్గా అదే సమయంలో చిరంజీవిగారు నటించిన కౌబాయ్‌ చిత్రం ‘కొదమసింహం’ నిర్మాణంలో ఉంది. ‘జగదేకవీరుడు-అతిలోకసుందరి’ సంచలన విజయం తర్వాత ఆయన నటించే సినిమా ఇదే కావడంతో నిర్మాణదశలోనే క్రేజ్‌ మొదలైంది. నెంబర్‌వన్‌ హీరో పొజిషన్‌లో చిరంజీవిగారు ఉన్నారప్పుడు. తొలిసారిగా ఆయన కౌబాయ్‌ పాత్ర పోషిస్తున్నారు. మాది కూడా కౌబాయ్‌ చిత్రమే. దాదాపు రెండు చిత్రాల షూటింగ్స్‌ ఒకే సమయంలో జరుగుతుండేవి. ఇదంతా చూసి పరిశ్రమలో ఒక ప్రచారం మొదలైంది. ‘చిరంజీవిలాంటి మెగాస్టార్‌ తొలిసారిగా ఒక కౌబాయ్‌ చిత్రంలో నటిస్తుంటే, ఆయనకు పోటీగా గిరిబాబు వాళ్ల అబ్బాయిని హీరోగా పెట్టి ‘ఇంద్రజిత్‌’ చిత్రం తీస్తున్నాడు. ఎంత సాహసం! అటువంటి భారీ చిత్రంతో పోటీపడి సినిమా పూర్తి చేయగలడా, నిలబడగలడా’ అని. ఈ ప్రచారం పరిశ్రమలోనే కాదు ప్రేక్షకలోకంలో కూడా వ్యాపించింది. ఇది నా దృష్టికీ వచ్చింది. ఆ సినిమాకు నేను పోటీగా ‘ఇంద్రజిత్‌’ తీయడం లేదు కనుక ఆ ప్రచారం గురించి పట్టించుకోకుండా నా పద్దతిలో సినిమాని పూర్తి చేశాను. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసి తొలి కాపీ సిద్ధం చేశాను. నా చిత్రాలు రెగ్యులర్‌గా కొనే బయ్యర్లు ఉన్నారు కనుక సినిమా విడుదల గురించి బెంగ లేదు. సినిమా అంతా ఒకసారి వేసి చూసుకుని సంతృప్తి చెందిన తర్వాత ఆగస్ట్‌ 9, 1990న సినిమాను విడుదల చేయాలని నిర్ణయించాను. ‘త్వరలో విడుదల’ అని పేపర్‌ యాడ్‌ కూడా ఇచ్చాను.

 

అప్పటికి ‘కొదమసింహం’ చిత్రం కూడా దాదాపుగా పూర్తి కావొచ్చింది. ఆ సినిమా ఆగస్ట్‌ నెలాఖరున విడుదల కావచ్చని తెలిసింది. అది చాలా భారీ చిత్రం. పైగా అందులో హీరో చిరంజీవి. అటువంటి సినిమాతో పోటీపడటం నిజంగా సాహసమే. అందుకే అది విడుదలయ్యేలోపు నా సినిమాని విడుదల చేయాలనుకున్నాను. ఆ సినిమా విడుదల కావడానికి రెండు వారాల వ్యవధి ఉంది కనుక ఈ రెండు వారాలూ ‘ఇంద్రజిత్‌’కు ఢోకా ఉండదనుకున్నాను. ఈ లోపు సెన్సార్‌ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని హైదరాబాద్‌ సెన్సార్‌ ఆఫీసులో అప్లయి చేశాం. మా రఘుబాబు దగ్గరుండి సెన్సార్‌ చేయించాడు.

(ఇంకా ఉంది)

-వినాయకరావు

Updated Date - 2021-05-15T01:41:21+05:30 IST