చిరంజీవి ఆ సినిమా చూసి చాలా బాధపడ్డాడు: గిరిబాబు (పార్ట్ 8)
ABN , First Publish Date - 2021-05-08T22:17:58+05:30 IST
మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో నటుడు గిరిబాబు ‘మెరుపుదాడి’ చిత్రాన్ని చేయాలని సంకల్పించిన విషయం తెలిసిందే. కానీ మోహన్ బాబుకి పాట సెట్ చేయడం కుదరదని చెప్పడంతో.. ఆయన కూడా ఈ సినిమా చేయడం కుదరదని ఖరాఖండీగా చెప్పేశారు. ఆ తర్వాత

మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో నటుడు గిరిబాబు ‘మెరుపుదాడి’ చిత్రాన్ని చేయాలని సంకల్పించిన విషయం తెలిసిందే. కానీ మోహన్ బాబుకి పాట సెట్ చేయడం కుదరదని చెప్పడంతో.. ఆయన కూడా ఈ సినిమా చేయడం కుదరదని ఖరాఖండీగా చెప్పేశారు. ఆ తర్వాత ఈ చిత్రాన్ని సుమన్, భానుచందర్‌లతో తెరకెక్కించడానికి గిరిబాబు సిద్ధమయ్యారు. ఆ తర్వాత ఏం జరిగిందో.. గిరిబాబు మాటల్లోనే..
ఆ తర్వాత చిరంజీవి దగ్గరకు వెళ్లి జరిగిన విషయాలేమీ చెప్పకుండా కొన్ని కారణాల వల్ల ఈ కాంబినేషన్ కుదరడం లేదని చెప్పాను. ‘ఫరవాలేదు అన్నయ్యా.. ఇంకో సినిమాకి కలసి పని చేద్దాం’ అని అన్నాడు చిరంజీవి. తర్వాత మోహన్‌బాబు దగ్గరకి వెళ్లి చెప్పాను. ‘ఒరేయ్.. నువ్వు నాతో సినిమా తీయకపోయినా నేను బాధపడను. ఎందుకంటే నువ్వు నా మిత్రుడివి. శ్రేయోభిలాషివి. అందుకే నువ్వు తీసే సినిమా హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అన్నాడు. ఇలా రకరకాల అవరోధాలను అధిగమించి చివరకు ఎలాగైతేనేం ‘మెరుపుదాడి’ షూటింగ్‌కు శ్రీకారం చుట్టాం.
‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రం తర్వాత మళ్లీ ఆ కౌబాయ్ ఫ్లేవర్ మిస్ కాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకొని నిర్మించిన సినిమా ఇది. కౌబాయ్ సినిమా కనుక ఆ వాతావరణం కనిపించడం కోసం ప్రత్యేక శ్రద్ధ వహించాం. యూరోపియన్ బిల్డింగ్స్‌లో షూటింగ్ చేయాలని చెన్నై, పాండిచ్చేరిలో ఉన్న బ్రిటీషర్స్ కాలనీలో చాలా ఏళ్ల క్రితం కట్టిన బిల్డింగ్స్ వెతికి పట్టుకుని వాటిల్లో సిటీకి సంబంధించిన సీన్లు తీశాం. మద్రాసులో ఒక షెడ్యూల్ చేసిన తర్వాత తలకోన వెళ్లాం. అదంతా అటవీ ప్రాంతం. అక్కడ ఎలాంటి వసతులు ఉండవు. తిరుపతికి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెరబైలు ప్రాంతంలో మేమంతా బస చేశాం. ఆర్టిస్ట్ టెలిఫోన్ సత్యనారాయణ ఆ ప్రాంతం వాడే. ఆయనకు అక్కడ బాగా పలుకుబడి ఉండేది. యూనిట్ సభ్యులందరూ ఉండటానికి ఆయన వసతి సౌకర్యాలు కల్పించారు. అక్కడికి తలకోన పదికిలోమీటర్లు ఉంటుంది.
1984 ఫిబ్రవరి 17న తలకోనలో షూటింగ్ ప్రారంభించి మార్చి 10 వరకూ అక్కడే షూటింగ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. ముందే పక్కాగా అంతా ప్లాన్ చేయడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా షూటింగ్ సవ్యంగా సాగుతోంది. కొత్త హీరోలు సుమన్, భానుచందర్ బాగా చేస్తున్నారు. వాళ్లకి మంచి భవిష్యత్ ఉందని షూటింగ్‌లో సీనియర్ ఆర్టిస్టులు మెచ్చుకుంటూ చెప్పేవారు.
ఆ అడవిలో సెట్స్ వేశాం
ఫైట్ మాస్టర్ రాజుని ‘సింహగర్జన’ చిత్రంతో నేనే పరిచయం చేశాను. ఆ కృతజ్ఞతతో ‘మెరుపుదాడి’ మొదలుపెట్టగానే నాలుగు పెద్ద సినిమాలను కూడా వదులుకొని ఈ సినిమాకి అంకితభావంతో పనిచేశాడు. అతను చిత్రీకరించిన యాక్షన్ సీన్లు సినిమాకి ప్రాణం పోశాయి. రంగనాథ్, ప్రభాకరరెడ్డి, గొల్లపూడి మారుతీరావు, సారథి, చలపతిరావు.. ఒకరనేమిటీ సినిమాలో ఉన్న ఆర్టిస్టులు అందరూ కోపరేట్ చేస్తుండటంతో షూటింగ్ శరవేగంతో సాగుతోంది.
ఆ రోజుల్లో తలకోనలో పెద్ద సదుపాయాలు ఉండేవి కావు. మాదే తొలి సినిమా అవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని వర్క్ చేసేవాళ్లం. వాహనాలు వెళ్లలేని ఆ అడవుల్లో, కాలినడకన వాగులు దాటుకుంటూ అడవి లోపలికి వెళ్లి అక్కడ నాలుగు పెద్ద సెట్లు వేశామంటే మీరు నమ్మగలరా? కానీ అది నిజం. మా కళాదర్శకుడు రంగారావు ప్రతిభకు నిదర్శనం. ఆ సినిమాకి విజయ్ ఛాయాగ్రాహకుడైనా, నిర్మాణసమయంలో వాళ్ల అన్నయ్య దేవరాజ్ ఎంతో సపోర్ట్‌గా ఉండేవాడు. స్ర్కిప్ట్ తయారైన తర్వాత షాట్ డివిజన్ చేసి షూటింగ్‌కు ప్రిపేర్ అయ్యాం. ఒక్కో సీన్‌ని ఎన్ని షాట్లలో తీయాలి, ఆ సీన్‌ని ఏ లొకేషన్‌లో తీయాలి, ఏ షాట్ లెంగ్త్ ఎంత ఉండాలి, అందులో క్లోజ్ షాట్ ఏది, లాంగ్ షాట్ ఏది.. ఇలా అన్ని వివరాలతో స్ర్కీన్‌ప్లే రెడీ అయింది. సాయంత్రం షూటింగ్ పూర్తికాగానే ఆ మర్నాడు ఏ సీన్ ఎక్కడ తీయాలన్నది నేనే డిసైడ్ చేసేవాణ్ణి. నాకు షూటింగ్ లేని సమయంలో అడవిలోకి వెళ్లి లొకేషన్లు చూసి సెలెక్ట్ చేసేవాణ్ణి.

దర్శకుడితో పేచీ
ఇదిలా ఉంటే ఒక రోజు జయమాలినికి జ్వరం వస్తే షూటింగ్ కొనసాగించమని దర్శకుడు రామచంద్రరావుకి చెప్పి నేను ఆమెని ఆస్పత్రికి తీసుకెళ్లాను. ఆ చుట్టపక్కల వైద్య సదుపాయాలు లేకపోవడంతో తిరుపతి వెళ్లాల్సి వచ్చింది. తిరిగి వచ్చేసరికి మధ్యాహ్నామైంది. షూటింగ్ జరుగుతోంది కానీ మేం డిస్కస్ చేసి నిర్ణయించిన ప్రకారం కాకుండా వేరే రకంగా షాట్ పెట్టాడు రామచంద్రరావు. ఆ షాట్ తీస్తున్నప్పుడు ‘ఈ సీన్ గురించి గిరిబాబుతో కూర్చుని ఏఏ షాట్స్ ఎలా తీయాలో డిస్కస్ చేశాం కదా. ఇప్పుడు దానికి భిన్నంగా ఈ షాట్ ఎందుకు తీస్తున్నావు’ అని దేవరాజ్ అన్నప్పటికీ అతను వినిపించుకోలేదట. ఆ షాట్ ఏమిటంటే.. రంగనాథ్, సుమన్, భానుచందర్ ‘ఇక మనం నిధి వేటకు బయలుదేరుతున్నాం’ అనుకుని ఆనందంగా చేతులు కలుపుతారు. దూరం నుంచి క్రేన్‌షాట్‌లో వాళ్లని కవర్ చేసుకుంటూ వచ్చి వాళ్ల చేతులు మీద పోస్ట్ చేసి షాట్ ఎండ్ చేయాలి. కట్ చేస్తే ఆటవిక గూడెంలో మళ్లీ చేతుల మీదే షాట్ ఓపెన్ అవుతుంది. ‘నాకు తెలియకుండా చింతపండు, ఇతర సరుకులు దోచుకుని, అమ్ముకుంటార్రా’ అని గూడెం దొర కొరడాతో కొంతమందిని కొడుతుంటాడు. అతని చేతుల మీద ఆ షాట్ ఓపెన్ అవుతుంది. థియేటర్‌లో ఆడియన్స్ చూస్తున్నప్పుడు టేకింగ్ కొత్తగా ఉండాలని ఆ రకంగా ఆ షాట్ ప్లాన్ చేశాను.
అయితే ఇలా కాకుండా దాన్ని వేరే రకంగా తీయాలని రామచంద్రరావు ప్రయత్నించాడు. నేను వచ్చేటప్పటికి ఆ షాట్ తీస్తున్నాడు కూడా. నన్ను చూడగానే దేవరాజ్ ‘బాబూ ఇదే లాస్ట్ షాట్’ అన్నాడు. ‘ఇది లాస్ట్ షాటా.. కాదు కదా.. ట్రాలీ వేసి క్రేన్ షాట్‌లో వీళ్ల చేతుల మీద పోస్ట్ చేసి, ఎండ్ చేయాలి. మనం అనుకున్నది అదే కదా రామచంద్రరావ్. మరి ఇలా ఎందుకు తీస్తున్నావు?’ అని అడిగాను. దాంతో అతను కొంచెం ఇరిటేట్ అయి ‘ఏమిటండీ.. ప్రతిదానికీ అడ్డం చెబుతున్నారు.. అన్నీ మీరు చెప్పినట్లే తియ్యాలా’ అన్నాడు మొహం అదోలా పెట్టి.
అతనలా అంటాడని నేను ఊహించకపోవడంతో హతాశుడయ్యాను. మిగిలిన వాళ్లంతా మా ఇద్దరి వంకే చూస్తున్నారు. ఆ షాక్ నుంచి నేను నిముషంలోనే తేరుకున్నాను. రామచంద్రరావు ట్రాక్ తప్పుతున్నాడని గ్రహించాను. అతన్ని దారిలో పెట్టకపోతే వ్యవహారం ముదురుతుందనిపించింది. అందుకే నేను స్పాట్‌లో ఏమీ మాట్లాడకుండా షూటింగ్‌కు ప్యాకప్ చెప్పాను. అప్పుడు మధ్యాహ్నం మూడవుతోంది. నిజానికి సాయంత్రం వరకూ షూటింగ్ చేయాలి. జయమాలిని కాంబినేషన్ సీన్లు కొన్ని ఉన్నాయి. అవన్నీ తీసిన తర్వాతే షూటింగ్‌కు ప్యాకప్ చెప్పాలి. అయితే ఆమెకి ఒంట్లో బాగోలేదనే వంకతో ‘ప్యాకప్’ చెప్పేశాను. అందరూ షాక్. వారికి కూడా విషయం కొంత అర్థమైంది కానీ ఎవరూ మాట్లాడలేదు. రూమ్‌కి చేరుకున్న వెంటనే మా అకౌంటెంట్ అప్పారావుని పిలిచాను. రామచంద్రరావుకి ఇంతవరకూ ఎంత ఇచ్చాం, ఇంకా ఎంత ఇవ్వాలో అడిగి తెలుసుకుని, మిగిలిన డబ్బు ఇచ్చేసి వెంటనే అతన్ని మద్రాసు పంపించేయమని చెప్పాను. అప్పారావు తెల్లబోయి ‘అదేమిటి సార్’ అన్నాడు. ‘అదంతే. నేను చెప్పినట్టు చెయ్యి’ అన్నాను కొంచెం కఠినంగా. అప్పారావు వెళ్లి రామచంద్రరావుకి ఇదే మాట చెప్పాడు. అతనూ షాక్. ఈలోగా యూనిట్ సభ్యులందరికీ ఈ విషయం తెలిసింది. గుసగుసలు మొదలయ్యాయి.
రామచంద్రరావుని మద్రాసుకు పంపించేయాలని నిర్ణయించుకున్నానని తెలియగానే రంగనాథ్, ప్రభాకరరెడ్డి, గొల్లపూడి, సారథి నా దగ్గరకి రాయబారానికి వచ్చారు. ‘ఏమిటి గిరిబాబూ.. ఇదంతా’ అని అడిగారు. ‘గిరిబాబు చెప్పింది నేనెందుకు చేయాలి అనే ఈగోయిజం రామచంద్రరావులో మొదలైనప్పుడు ఆదిలోనే దాన్ని కట్ చేయకపోతే అది నా సినిమాకి ఎఫెక్ట్ అవుతుంది. కె.ఎస్.ఆర్.దాస్‌ని దర్శకుడిగా పెట్టండి అని కేశవరావుగారు ఎంతో కోరినా వినకుండా రామచంద్రరావే ఉండాలి అని నేను పోరాడాను. అందుకోసం సినిమా వదులుకోవడానికి కూడా సిద్ధమయ్యాను. అతని భవిష్యత్ కోసం నేను అంతలా పోరాడి ఒప్పిస్తే నాకే ఎదురుతిరుగుతాడా.. అటువంటి వ్యక్తి నాకు అక్కర్లేదు’ అని నిష్కర్షగా వాళ్లకి చెప్పేశాను.
తెలియని ఆవేశంలో మాట తూలడం సహజమేననీ, ఆ కుర్రాడి మాటలు పట్టించుకోవద్దనీ, విషయాన్ని పెద్దది చేసి అతని భవిష్యత్ దెబ్బతీయవద్దనీ వాళ్లంతా బతిమాలడంతో నేను అంగీకరించాను. రామచంద్రరావు కూడా తన తప్పు గ్రహించి నాకు సారీ చెప్పడంతో కథ సుఖాంతమై ఆ మర్నాటి నుంచి షూటింగ్ యథాతథంగా కొనసాగింది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే రామచంద్రరావు ఆ రోజు ఆవేశంలో అలా అన్నా, దానికి నేను కౌంటర్ ఇచ్చినా.. ఆ తర్వాత మా మధ్య ఉన్న స్నేహం చెక్కు చెదరలేదు. ‘మెరుపుదాడి’ సినిమా తర్వాత రామచంద్రరావు చాలా సినిమాలకు దర్శకత్వం వహించాడు. దాదాపు వాటన్నింటిలో నేను వేషాలు వేశాను. ఇప్పటికీ మా రెండు కుటుంబాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. రాకపోకలు మామూలే. మనం మనుషులం కాబట్టి ఒక్కో సమయంలో ఆవేశాలకు లోను కావడం సహజం. అలాగే అతను కూడా ఆ రోజు క్షణికావేశంలో అలా మాట్లాడి ఉండవచ్చు. దాని వల్ల మా మధ్య మనస్పర్థలు వచ్చినా అవి తాత్కాలికమే. దీని వల్ల వ్యక్తుల మధ్య అనుబంధాలు, ఆత్మీయతలు మారవు కదా.

ఇళయరాజా సంగీతం
నేను అంతకుముందు నిర్మించిన మూడు చిత్రాలకు చక్రవర్తి సంగీత దర్శకత్వం వహించాడు. నేను సంగీతప్రియుణ్ణి. పాటలంటే నాకు చాలా ఇష్టం. అందుకే నా సినిమాలో పాటలు కూడా బాగుండాలనీ, అవి జనాదరణ పొందాలనీ ఆశించడంతో తప్పులేదుగా. అయితే ‘సింహగర్జన’లో కానీ, ‘ముద్దు-ముచ్చట’లో కానీ చక్రవర్తి నా టేస్ట్‌కి సరిపడా మంచి పాటలు ఇవ్వలేదు. దాంతో కొంచెం ఇబ్బంది పడి ‘సంధ్యారాగం’లో చక్రవర్తిని మార్చి రమేశ్‌నాయుడుగారిని పెట్టాను. ఇక ‘మెరుపుదాడి’ చిత్రానికి రీరికార్డింగ్ ప్రాణం. ఇళయరాజాగారైతేనే న్యాయం జరుగుతుందని ఆయన్ని సంప్రదించాను. అందులో నాలుగు పాటలే ఉన్నాయి. వాటికి అద్భుతమైన ట్యూన్లు ఇచ్చారు. అంతేకాదు వేటూరిగారు రాసిన ‘చందమామ గంథమందుకో’ అనే పాటను ఇళయరాజాగారే పాడారు. తెలుగులో ఆయన పాడిన తొలి పాట ఇదే.
రీరికార్డింగ్ మొదలుపెట్టేముందు ఆయన, నేను రికార్డింగ్ థియేటర్‌లో కూర్చున్నాం. ‘గిరిబాబుగారూ నాకు చాలా పెద్ద పని పెట్టారు. ఒకరకంగా ఇది నాకు ఛాలెంజింగ్ జాబ్. అయినా ఈ సినిమా చేస్తున్నందుకు చాలా ఆనందిస్తున్నాను’ అన్నారాయన మనస్ఫూర్తిగా. ‘మెరుపుదాడి’ జంగిల్ అడ్వెంచర్ కనుక నేపథ్య సంగీతం విభిన్నంగా ఉండాలని ‘గాంగ్స్’ అని వెదురుతో చేసిన వాద్యపరికరాలను ఇండోనేషియా నుంచి ప్రత్యేకంగా తెప్పించి, ఉపయోగించారు. తన కెరీర్‌లో చేసిన బెస్ట్ రీరికార్డింగ్ అని ఆయన ఇప్పటికీ చెబుతుంటారు. ఈ సినిమా ఎంటైర్ రీ రికార్డింగ్ మ్యూజిక్‌ను ఓ ఆడియో కేసెట్ రూపంలో ఇళయరాజాగారు విడుదల చేశారు. ఇలా ఓ సినిమా నేపథ్య సంగీతం ఆడియో క్యాసెట్ రూపంలో రావడం దక్షిణ భారతదేశంలో అదే తొలిసారి.
రికార్డ్ కలెక్షన్లు
‘మెరుపుదాడి’ చిత్రం రూ. 29 లక్షల వ్యయంతో తయారైంది. 1984 జూన్ 9న విడుదల చేశాం. సినిమా పెద్ద హిట్. ఆ సమయంలోనే విజయవాడలోని రాజ్ థియేటర్‌ని కొత్తగా కట్టారు. అందులో ‘మెరుపుదాడి’ విడుదలైంది. అంతకుముందు అదే థియేటర్‌లో కేశవరావుగారు నిర్మించిన ‘ధర్మాత్ముడు’(కృష్ణంరాజు హీరో) చిత్రం విడుదలై.. 17 రోజులో, 18 రోజులో హౌస్‌ఫుల్ అయింది. అది థియేటర్ రికార్డ్. అయితే కొత్త హీరోలతో తీసిన మా సినిమా ఆ రికార్డ్‌ను బ్రేక్ చేసి 25 రోజులు... రోజుకి నాలుగు ఆటలతో హౌస్‌ఫుల్ అయింది. కృష్ణగారి ‘సింహాసనం’ చిత్రం వచ్చేవరకూ అదే రికార్డ్ కొనసాగింది. ‘సింహాసనం’ చిత్రం ఆ థియేటర్‌లో 26 రోజులు హౌస్‌ఫుల్ అయింది. ఈ సినిమా విడుదలయ్యాక హైదరాబాద్‌లోని సంగం థియేటర్‌లో కేశవరావుగారితో కలిసి చిరంజీవి చిత్రాన్ని చూసి ‘ఒక మంచి చిత్రంలో నటించే అవకాశం కోల్పోయాను’ అని బాధపడ్డాడు. అలాగే నా మిత్రుడు మోహన్‌బాబు కూడా ఈ చిత్రంలో నటించనందుకు బాధపడి, సినిమాని హిట్ చేసినందుకు నన్ను అభినందించాడు. తెలుగులో ఘనవిజయం సాధించిన ‘మెరుపుదాడి’ చిత్రాన్ని ‘తునిచ్చన్’ పేరుతో తమిళంలోకి డబ్ చేశాం. అక్కడ కూడా విజయం సాధించింది.
(ఇంకా ఉంది)
-వినాయకరావు
