‘తెలుగు మీడియం’లో బాలయ్య

ABN , First Publish Date - 2021-02-21T00:47:43+05:30 IST

తెలుగు భాష అంటే గుర్తొచ్చే పేర్లలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు పేరు ఉంటుంది. తెలుగువాడిగా, తెలుగు జాతి గౌరవం నిలబెట్టేలా

‘తెలుగు మీడియం’లో బాలయ్య

తెలుగు భాష అంటే గుర్తొచ్చే పేర్లలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు పేరు ఉంటుంది. తెలుగువాడిగా, తెలుగు జాతి గౌరవం నిలబెట్టేలా ఆయన పోరాటం తెలియని తెలుగువాడు లేడంటే అతిశయోక్తి ఉండదేమో. అలాంటి నందమూరి ఫ్యామిలీ నుంచి ఇప్పుడు 'తెలుగు మీడియం' అనే టైటిల్‌తో ఓ చిత్రం రాబోతున్నట్లుగా చిత్ర వర్గాలు వెల్లడిస్తున్నాయి. బాలీవుడ్‌లో తెరకెక్కిన 'అంగ్రేజీ మీడియం‌' (ఇంగ్లీష్‌ మీడియం) మూవీ తరహాలో, అదే సినిమాని తెలుగులో 'తెలుగు మీడియం' పేరుతో రీమేక్‌ చేయాలని నిర్మాతలు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. మరి వారికి తెలుగులో ఈ సినిమా చేయాలంటే ఉన్న ఏకైక ఆప్షన్‌ కేవలం నందమూరి నటసింహ బాలయ్యే. 


ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వంటి వారు కూడా తెలుగు భాష గొప్పతనం గురించి పలు సందర్భాలలో చెప్పి ఉన్నారు. అలాగే ఈ మధ్య ఏపీలో మాతృభాష అయిన తెలుగు మీడియంలోనే విద్యాబోధన ఉండాలనేలా ఉద్యమాలు కూడా జరిగాయి. ఇవన్నీ వెరసీ.. బాలయ్య ఇప్పుడు కనుక 'తెలుగు మీడియం' అంటూ సినిమా చేస్తే.. నిజంగా అది చరిత్రే అవుతుంది. ఎలా అంటే తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు పోరాడిన నందమూరి తారక రామారావు పేరు ఎలా అయితే చరిత్రలో లిఖించబడిందో.. ఇప్పుడు ఈ టైటిల్‌తో బాలయ్య సినిమా చేసి తెలుగు భాష విశిష్టతను చెప్పే ప్రయత్నం చేస్తే.. తండ్రి గుణగణాలే కాదు, పోరాట పటిమ కూడా అలవడిందనేలా బాలయ్య పేరు మారుమోగడం ఖాయం. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడికావచ్చు.


ఇక బాలయ్య విషయానికి వస్తే.. ఇప్పుడున్న నటీనటుల్లో స్పష్టమైన తెలుగు మాట్లాడే నటులలో బాలయ్యది ప్రథమస్థానం. నందమూరి తారక రామారావు బిడ్డగా.. ఆ తెలుగుదనాన్ని, తెలుగు తరాన్ని ముందుకు తీసుకువెళుతున్న బాలయ్య.. ఇప్పటికీ ఏ స్టేజ్‌ ఎక్కినా తెలుగు భాష గురించి, తండ్రి తారకరాముడి గురించి మాట్లాడకుండా దిగరు. ఆయన అలా మాట్లాడుతుంటే మాతృభాషను వీరు ఇంతగొప్పగా ప్రేమిస్తారా? మాతృభాష కోసం ఇంతగా తపిస్తారా? అని అనిపించకమానదు. చక్కని సంస్కృత శ్లోకాలతో.. స్వచ్చమైన తెలుగు పదాలతో బాలయ్య మాట్లాడే తీరు చూసిన వారు ఎవరైనా సరే.. 'తెలుగు మీడియం' టైటిల్‌తో తెరకెక్కే చిత్రానికి బాలయ్యే కావాలని, బాలయ్యే ఆ చిత్రం చేయాలని అనుకుంటారు. సదరు నిర్మాతలు కూడా అదే అనుకుంటున్నారు.


ఇర్ఫాన్‌ ఖాన్‌, రాధిక మదన్‌, కరీనా కపూర్‌ వంటి వారు నటించిన 'అంగ్రేజీ మీడియం‌' చిత్రం మంచి సక్సెస్‌నే అందుకుంది. అయితే కాన్సెప్ట్ అదే అయినప్పటికీ.. తెలుగు భాష గౌరవం ప్రపంచానికి చాటి చెప్పేలా కథను తయారు చేసి.. బాలయ్యతో సినిమా చేయాలనేది సదరు నిర్మాతల ప్లాన్‌గా తెలుస్తోంది. కేవలం బాలయ్యే ఎందుకంటే.. వేరే ఏ హీరో అయినా.. 'తీర్థానికి తీర్థం.. ప్రసాదానికి ప్రసాదం' అనేలా ఉంటుంది కానీ.. సరైన్‌ పవర్‌ మాత్రం చిత్రానికి రాదనేది వారి అభిప్రాయం. కేవలం బాలయ్య అయితేనే ఈ చిత్రం టైలర్‌మేడ్‌గా ఉంటుందని.. అందుకే పక్కా స్ర్కిప్ట్ రెడీ చేసి.. బాలయ్యను సంప్రదించాలని సదరు నిర్మాతలు అనుకుంటున్నట్లుగా సమాచారం.

Updated Date - 2021-02-21T00:47:43+05:30 IST