సినిమా రివ్యూ : ‘వరుడు కావలెను’

ABN , First Publish Date - 2021-10-29T21:04:42+05:30 IST

తెలుగు ఇండస్ట్రీలో మహిళా దర్శకుల సంఖ్య చాలా తక్కువ. నేటితరం అమ్మాయిలు దర్శకత్వ శాఖపై చాలా ఆసక్తి చూపిస్తున్నారు. 15 ఏళ్లుగా తెలుగు పరిశ్రమలో పలువురు దర్శకుల దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేసి ‘వరుడు కావలెను’ చిత్రంతో దర్శకురాలిగా పరిచయమయ్యారు లక్ష్మీ సౌజన్య. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మాణంలో నాగశౌర్య, రీతువర్మ జంటగా నటించిన ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. పాటలు, ట్రైలర్‌లో ప్రేక్షకుల్లో ఆసక్తి రేపిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఏ మేరకు చేరువయిందో చూద్దాం.

సినిమా రివ్యూ : ‘వరుడు కావలెను’

సినిమా రివ్యూ

చిత్రం: ‘వరుడు కావలెను’

నటీనటులు: నాగశౌర్య, రీతూవర్మ, మురళీశర్మ, నదియా, జయప్రకాశ్‌, వెన్నెల కిశోర్‌, ప్రవీణ్‌, హిమజ, సప్తగిరి, హర్షవర్ధన్‌. 

మాటలు: గణేష్‌ రావూరి

కెమెరా: వంశీ పచ్చిపులుసు

ఎడిటింగ్‌: నవీన్‌ నూలి

సంగీతం: విశాల్‌ చంద్రశేఖర్‌, తమన్‌, 

నిర్మాణ సంస్థ: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌

సమర్పణ: పి.డి.వి. ప్రసాద్‌

దర్శకత్వం: లక్ష్మీ సౌజన్య. 


తెలుగు ఇండస్ట్రీలో మహిళా దర్శకుల సంఖ్య చాలా తక్కువ. నేటితరం అమ్మాయిలు దర్శకత్వ శాఖపై చాలా ఆసక్తి చూపిస్తున్నారు. 15 ఏళ్లుగా తెలుగు పరిశ్రమలో పలువురు దర్శకుల దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేసి ‘వరుడు కావలెను’ చిత్రంతో దర్శకురాలిగా పరిచయమయ్యారు లక్ష్మీ సౌజన్య. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మాణంలో నాగశౌర్య, రీతువర్మ జంటగా నటించిన ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. పాటలు, ట్రైలర్‌లో ప్రేక్షకుల్లో ఆసక్తి రేపిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఏ మేరకు చేరువయిందో చూద్దాం. 


కథ:

ఆకాశ్‌(నాగశౌర్య) పారిస్‌లో ఆర్కిటెక్ట్‌. భూమిక (రీతూవర్మ) హైదరాబాద్‌లో ఓ స్టార్టప్‌ కంపెనీ నిర్వహించే మహిళ. వ్యక్తిగతంగానూ, వృత్తిపరంగానూ చాలా టిపికల్‌  అమ్మాయి. పెళ్లంటే పెద్దగా ఆసక్తి ఉండదు. తన తల్లి ప్రభ (నదియా) రోజుకో సంబంధం చూస్తుంది. ఏదీ అంగీకరించదు భూమి. అదే సమయంలో భూమి కంపెనీలో ఓ ప్రాజెక్ట్‌ పని మీద పారిస్‌ నుంచి హైదరాబాద్‌కు వస్తాడు ఆకాశ్‌. కొన్నాళ్లకు ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. ప్రేమలో పడతారు. ప్రేమ, పెళ్లి గిట్టని భూమి ఓ దార్లోకి వస్తున్న సమయంలో ఇద్దరూ కలిసి చదువుకున్న రోజులు, అప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి. అసలు వీళ్లిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి. ఎనిమిదేళ్లు దూరంగా ఉండటానికి కారణమేంటి? ఆకాశ్‌–భూమి ఒకటయ్యారా? అన్నది కథ. 
విశ్లేషణ...

చదువుకునే రోజుల్లో ప్రేమలో పడి వ్యక్తపరుచుకోకుండా దూరమైన ఓ జంట కథ ఇది.  మన ఇళ్లల్లో ప్రతి రోజు చూసే కథే కూడా మిళితమై ఉంది. 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరని వేధించే ప్రశ్న పెళ్లి. ఇక్కడ హీరోయిన్‌కి అదే సమస్య. తనకు నచ్చిన పని చేస్తూ, ఆఫీస్‌లో బాసిజం చూపిస్తూ ఎప్పుడూ సీరియస్‌గా ఉండే పాత్ర భూమిది. ఫస్టాఫ్‌ చాలా వరకూ భూమి పాత్ర కీలకంగా సాగుతుంది. ఒక టిపికల్‌ అమ్మాయిని ప్రేమలో దించడానికి హీరో చేసిన ప్రయత్నం బాగానే ఉన్నా.. సన్నివేశాల్లో కొత్తదనం లేదు. ఆకాశ్‌ పాత్ర పరిచయం నుంచి చూసుకుంటే ఇంటర్వెల్‌కి ముందు వరకూ కథలో వేగం లేదు. భూమి ప్రేమ విషయాన్ని తెలియజేసినప్పటి నుంచే వేగం పెరిగింది. ఆ సందర్భంలో భూమి చెప్పిన మాటలు ఆసక్తి కలిగించాయి. అయితే ఆ తర్వాత ఫ్లాష్‌బ్యాక్‌ సన్నివేశాల్లో కొత్తదనమేమీ కనిపించలేదు. రొటీన్‌గానే సాగింది. ఆ సన్నివేశాలు కాస్త ల్యాగ్‌ అనిపించాయి. తన బిడ్డకు పెళ్లి చేసి సెటిల్‌ చేయాలనే తపన పడే తల్లిదండ్రులుగా మురళీశర్మ, నదియా జీవించారు. ఆ సన్నివేశాల్లో ఎమోషన్స్‌ ఆకట్టుకున్నాయి. అరకులో పెళ్లి సన్నివేశం ఆకట్టుకుంది. క్లైమాక్స్‌ రొటీన్‌గానే ఉన్నా... కుటుంబ ప్రేక్షకులు ఆ సన్నివేశాలకు బాగా కనెక్ట్‌ అవుతారు. సినీ విమర్శకుడు గణేష్‌ రావూరి అందించిన మాటలు కొంతవరకూ సినిమాకు ఎసెట్‌ అనే చెప్పాలి. పేలిన డైలాగ్‌లు పెద్దగా లేకపోయినా ఎమోషన్‌గా టచ్‌ చేసిన డైలాగ్‌లు కొన్ని ఉన్నాయి. ఇక పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు బలం. ఇక ఆరిస్ట్‌ల పెర్‌ఫార్మెన్‌ విషయానికి వస్తే ఆకాశ్‌, భూమి పాత్రలకు నాగశౌర్య, రీతూ న్యాయం చేశారు. ఈ మధ్యకాలంలో ఏ సినిమాలోనూ హీరోయిన్‌ పూర్తిగా చీరలో కనిపించడం చూడలేదు. రీతూవర్మ చీర కట్టులో ఆకట్టుకుంది. ఎప్పటిలానే తను నటనలో ఫెయిల్‌ కాలేదు. తెరపై ఈ జంట చాలా క్యూట్‌గా ఉంది. సినిమాలో మరో కీలక పాత్ర పోషించిన నదియా ఆ పాత్రకు అసెట్‌ అనొచ్చు. సీరియస్‌ పాత్రలు, అందమైన అమ్మగా, అత్తగా మెప్పించిన ఆమెకు ఇది కొత్త తరహా పాత్ర. కూతురి ప్రైవసీ గురించి ఆలోచించి తన ఆనందం కోరుకునే తండ్రిగా మురళీశర్మ  మెప్పించారు. సెకెండాఫ్‌లో సప్తగిరి వినోదం ఇరికించినట్లు అనిపించినా ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించింది. హర్షవర్ధన్‌, వెన్నెల కిశోర్‌, హిమజ పాత్రలు అలరించాయి. ఊహకు అందేలా ఉన్న కథ, అక్కడక్కడా ల్యాగ్‌ సన్నివేశాలు సినిమాకు బలహీనతలు కాగా, కొన్ని సన్నివేశాల్లో మాటలు, పాటలు కెమెరా పనితనం గ్రాండ్‌గా ఉంది. దర్శకురాలిగా తొలి చిత్రమైనప్పటికీ బాగానే డీల్‌ చేసినట్లు అనిపించింది. తన 15 ఏళ్ల అనుభవం ఉపయోగపడింది. సెకెండాఫ్‌పై కాస్త దృష్టి పెట్టి ఉంటే సినిమా ఇంకొంచెం షార్ప్‌గా ఉండేది. సితార బ్యానర్‌ ఖర్చు చేసిన విలువ తెరపై కనిపించింది. ఓవరాల్‌ కుటుంబ ప్రేక్షకులను అలరించే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. 

ట్యాగ్‌లైన్‌ : వరుడు అలరించినట్లే!Updated Date - 2021-10-29T21:04:42+05:30 IST