‘ఎస్.ఆర్.కళ్యాణ మండపం’ రివ్యూ

ABN , First Publish Date - 2021-08-06T21:01:09+05:30 IST

కిర‌ణ్ అబ్బ‌రం, ప్రియాంక జ‌వాల్క‌ర్ జంట‌గా న‌టించిన ఈ చిత్రంలో తండ్రీ కొడుకుల పాత్ర‌ధారులెవ‌రు? వీరికీ ‘ఎస్‌.ఆర్‌.క‌ళ్యాణ మండ‌పం’కు ఉండే బంధ‌మేంటి? అనే విష‌యాలు తెలియాంటే సినిమా క‌థేంటో ముందుగా తెలుసుకుందాం...

‘ఎస్.ఆర్.కళ్యాణ మండపం’ రివ్యూ

చిత్రం: ఎస్‌.ఆర్‌.క‌ళ్యాణ మండ‌పం

సెన్సార్‌:  యు/ఎ

బ్యాన‌ర్‌:  ఎలైట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌

న‌టీన‌టులు:  కిర‌ణ్ అబ్బ‌వ‌రం, ప్రియాంక జ‌వాల్క‌ర్‌, సాయికుమార్‌, తుల‌సి, శ్రీకాంత్ అయ్యర్ తదితరులు

సంగీతం:  చేత‌న్ భ‌ర‌ద్వాజ్‌

సినిమాటోగ్ర‌ఫీ:  విశ్వాస్ డేనియల్‌

ఆర్ట్‌:  సుధీర్‌

ఎక్స్ క్యూటివ్ ప్రొడ్యూస‌ర్ - భ‌ర‌త్

క‌థ‌, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ - కిర‌ణ్ అబ్బ‌వరం

నిర్మాత‌లు - ప్ర‌మోద్, రాజు

ద‌ర్శ‌కుడు - శ్రీధ‌ర్ గాదే


సాధార‌ణంగా పిల్ల‌ల‌కు త‌ల్లిదండ్రుల‌పై ఉండే ప్రేమాభిమానాల్లో త‌ల్లి ప్రేమే ఎక్కువ‌గా ఎలివేట్ అవుతుంటుంది. తండ్రి పిల్ల‌ల‌పై త‌న ప్రేమ‌ను బాహాటంగా చూపించుకోడు కానీ.. కుటుంబం కోసం తండ్రి ప‌డే క‌ష్టం అంతా ఇంతా కాదు. అలాంటి తండ్రిపై ఉండే ప్రేమ‌ను బ‌య‌ట‌కు చూపించుకోని ఓ కొడుకు.. కొడుకు త‌న‌తో కార‌ణం లేకుండా మాట్లాడ‌టం మానేశాడే అని త‌పించే తండ్రి.. మ‌ధ్య న‌డిచే క‌థాంశంతో రూపొందిన చిత్రం ‘ఎస్‌.ఆర్‌.క‌ళ్యాణ మండ‌పం’. కిర‌ణ్ అబ్బ‌రం, ప్రియాంక జ‌వాల్క‌ర్ జంట‌గా న‌టించిన ఈ చిత్రంలో తండ్రీ కొడుకుల పాత్ర‌ధారులెవ‌రు?  వీరికీ ‘ఎస్‌.ఆర్‌.క‌ళ్యాణ మండ‌పం’కు ఉండే బంధ‌మేంటి?  అనే విష‌యాలు తెలియాంటే సినిమా క‌థేంటో ముందుగా తెలుసుకుందాం...


క‌థ‌:

రాయ‌ల‌సీమ క‌డ‌ప జిల్లాలోని ఓ ఊళ్లో ఎస్‌.ఆర్‌.క‌ళ్యాణ మండ‌పంకు ఓ చ‌రిత్ర ఉంటుంది. తండ్రి మ‌ర‌ణం త‌ర్వాత ధ‌ర్మ‌(సాయికుమార్‌) ఆ క‌ళ్యాణ మండ‌ప బాధ్య‌త‌ల‌ను చూసుకోవాల్సి వ‌స్తుంది. అయితే మంచిత‌నం, త‌న చుట్టూ ఏం జ‌రుగుతుందో తెలుసుకోక‌పోవ‌డంతో ధ‌ర్మ అప్పుల పాల‌వుతాడు. ఊళ్లోని వాళ్లు, ఇంట్లోని వాళ్లు అంద‌రూ ఆయ‌న్ని త‌క్కువ చేసి మాట్లాడుతుంటారు. చివ‌ర‌కు ధ‌ర్మ ఎంతో ప్రేమ‌గా పెంచుకున్న కొడుకు క‌ళ్యాణ్‌(కిర‌ణ్ అబ్బ‌వ‌రం) కూడా మాట్లాడ‌టం మానేస్తాడు. ధ‌ర్మాకు అదింకా బాధ‌ను క‌లిగిస్తుంటుంది. తాగుడుకి బానిస‌వుతాడు. పెరిగి పెద్ద‌యిన క‌ళ్యాణ్ ఇంజ‌నీరింగ్ పూర్తి చేసే క్ర‌మంలో త‌న ఊరికి చెందిన పాపారావు(శ్రీకాంత్ అయ్య‌ర్‌) కుమార్తె సింధు(ప్రియాంక జ‌వాల్క‌ర్‌)ను ప్రేమిస్తాడు. అంద‌రి ముందు క‌ళ్యాణ్‌ను సింధు త‌క్కువ చేసి మాట్లాడినా, అత‌నంటే ప్రేమే. అయితే క‌ళ్యాణ్ తండ్రి ‘ఎస్‌.ఆర్‌.క‌ళ్యాణ మండ‌పం’ను పాపారావుకు తాక‌ట్టు పెట్టేస్తాడు. ఆ విష‌యంలో పాపారావుకి, కళ్యాణ్‌కు గొడ‌వ కూడా జ‌రుగుతుంది. క‌ళ్యాణ్ త‌ల్లి శాంతి(తుల‌సి)..‘ఎస్‌.ఆర్‌.క‌ళ్యాణ మండ‌పం’కు ఉన్న చ‌రిత్ర‌ను కొడుక్కి చెప్పి, మండ‌పాన్ని కాపాడ‌మ‌ని కోరుతుంది. దాంతో క‌ళ్యాణ్ రంగంలోకి దిగుతాడు. ‘ఎస్‌.ఆర్‌.క‌ళ్యాణ మండ‌పం’ను కాపాడుకునే క్ర‌మంలో క‌ళ్యాణ్ ఎలాంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటాడు?  పాపారావు, క‌ళ్యాణ్ మ‌ధ్య గొడ‌వ స‌మ‌సి పోతుందా?  అస‌లు ధ‌ర్మాతో క‌ళ్యాణ్ మాట్లాడ‌క‌పోవ‌డానికి కార‌ణ‌మేంటి?  అనే విష‌యాల‌ను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..


స‌మీక్ష‌:

తండ్రీ కొడుకుల మ‌ధ్య అనుబంధంతో తెలుగులో నాన్న‌కు ప్రేమ‌తో, బొమ్మ‌రిల్లు స‌హా చాలా సినిమాలు వ‌చ్చాయి. అలాంటి కోవ‌లో వ‌చ్చిన సినిమాయే ఈ ‘ఎస్‌.ఆర్‌.క‌ళ్యాణ మండ‌పం’. ఇందులో తండ్రి పాత్ర‌లో సాయికుమార్‌, కొడుకు పాత్ర‌లో కిర‌ణ్ అబ్బ‌వ‌రం న‌టించారు. స‌రైన పెంప‌కం లేకుండా, డ‌బ్బు విలువ తెలియ‌ని తండ్రీ పాత్ర‌లో సాయికుమార్ డిఫ‌రెంట్ బాడీ లాంగ్వేజ్‌తో ఈ సినిమాను చేశాడు. చాలా రోజుల త‌ర్వాత ఆయ‌న పాత్ర‌లో ఓ కొత్త‌దనాన్ని చూడొచ్చు. కిర‌ణ్ అబ్బవ‌రం గ‌త చిత్రాల‌తో పోల్చితే ఈ సినిమాలో ఇంకా బాగా యాక్ట్ చేశాడు. కేవ‌లం న‌ట‌నే కాకుండా.. క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు కూడా ఈ హీరో రాయ‌డం విశేషం. ప్రియాంక జ‌వాల్క‌ర్ పాత్ర‌కు నిడివి కూడా పెద్ద‌దే. ఆమె గ‌త చిత్రాల‌కంటే ఈ సినిమాలో ఆమెకు ప్ల‌స్ అయ్యే అంశ‌మ‌దే. ఆమె త‌న పాత్ర‌కు న్యాయం చేసింది. శ్రీకాంత్ అయ్య‌ర్ నెగ‌టివ్ ట‌చ్ ఉంటూ చివ‌ర‌లో మంచివాడుగా మారిపోయే వ్య‌క్తి పాత్ర‌లో చ‌క్క‌గా యాప్ట్ అయ్యాడు. ఇక హీరో స్నేహితులు, సినిమాలో క‌నిపించే మ‌రికొన్ని పాత్ర‌లు కొత్త ముఖాలే అయినా, న‌ట‌న ప‌రంగా అంద‌రూ పాత్ర‌ల్లో ఒదిగారు. సినిమా ఫ‌స్టాఫ్ అంతా కాలేజ్ వాతావ‌ర‌ణం.. హీరో-హీరోయిన్ మ‌ధ్య ల‌వ్‌ట్రాక్‌తో సాగుతుంది. ఇది కాస్త రొటీన్‌గానే అనిపిస్తుంది. ఇక అస‌లు క‌థ ఇంట‌ర్వెల్ ముందే స్టార్ట్ అవుతుంది. హీరోయిన్ పెళ్లి మ‌రొక‌రితో త‌న క‌ళ్యాణ మండ‌పంలో జ‌రిగబోతుంద‌ని తెలియ‌డం అప్పుడు హీరో ఏం చేశాడ‌నే కోణంలో సెకండాఫ్ అంతా సాగుతుంది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ వ‌ర‌కు క‌థ ఇలాగే సాగుతుంది. ఇక చివ‌రి ఇరవై నిమిషాలే తండ్రీ కొడుకుల మ‌ధ్య అనుబంధాన్ని ఎలివేట్ చేసే ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. అస‌లు హీరో త‌న తండ్రితో ఎందుకు మాట్లాడ‌డు.. చివ‌ర‌కు కొడుక్కి త‌నపై ఉన్న ప్రేమ‌ను తెలుసుకున్న తండ్రి ఏం చేశాడు? అనే పాయింట్‌తో సినిమా పూర్త‌వుతుంది. ప్రీ క్లైమాక్స్ వ‌ర‌కు సినిమాలో ఏం జ‌రుగుతుంద‌నే విష‌యాల‌ను ప్రేక్ష‌కులు ఊహిస్తార‌న‌డంలో సందేహం లేదు. ఇలాంటి పాయింట్‌తో ఇప్ప‌టికే చాలా సినిమాలు వ‌చ్చాయి. ఇక ల‌వ్ ట్రాక్ ఆస‌క్తిక‌రంగా అనిపించ‌దు. అలాగ‌ని తీసి పార‌య‌లేం. జ‌స్ట్ ఓకే అనేలా ఉంటుంది. అమెరికా వెళ్లాల‌నుకునే కుర్రాడైన హీరో బార్‌లో తాగుతూ క‌న‌ప‌డ‌తాడు. స‌రే! దానికి ఆయ‌నిచ్చే జిస్టిఫికేష‌న్ ఏమైనా సూట్ అవుతుందా అంటే లేదు.  ఇక ఎమోష‌న‌ల్ పాయింట్స్ విష‌యాని వ‌స్తే.. 90ల్లో పెళ్లిళ్లు ఎలా ఉండాల‌ని హీరో చెప్పే సంద‌ర్భం.. క్లైమాక్స్‌లో తండ్రిపై ఉన్న ప్రేమ‌ను చెప్పే సంద‌ర్భాలు ఆక‌ట్టుకుంటాయి. చేత‌న్ భ‌రద్వాజ్ సంగీతంలో ‘చుక్క‌ల చున్ని..’ , ‘ఈ నేల త‌డ‌బ‌డే..’ రెండు పాట‌లు బావున్నాయి. నేప‌థ్యం సంగీతం బావుంది. సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. మా నాయన పదిరూపాయలు పెట్టినోడే కానీ, అద్దురూపాయి కూడా ఎవరిదీ తిన్నోడు కాదు.. వంటి సందర్భానుసారం వచ్చే డైలాగులు బావున్నాయి. కథను ఎటెటో తిప్పారనే విషయం తెలుస్తుంది. దర్శకుడు శ్రీధర్ ఈ విషయంలో కాస్త శ్రద్ధ తీసుకుని ఉంటే బావుండేది...


బోటమ్ లైన్:  క‌ళ త‌ప్పిన ‘ఎస్‌.ఆర్‌.క‌ళ్యాణ మండ‌పం’

Updated Date - 2021-08-06T21:01:09+05:30 IST