‘రిపబ్లిక్’ మూవీ రివ్యూ

ABN , First Publish Date - 2021-10-01T21:17:32+05:30 IST

కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలై.. సినీ ఇండస్ట్రీకి ఊపిరిపోసింది సాయిధరమ్ తేజ్‌ నటించిన చిత్రమే. ఇప్పుడు సెకండ్ వేవ్ తర్వాత తెరుచుకున్న థియేటర్లలోకి సినిమాలైతే విడుదలవుతున్నాయి.. కానీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేకపోతున్నాయి. రీసెంట్‌గా విడుదలైన..

‘రిపబ్లిక్’ మూవీ రివ్యూ

చిత్రం: ‘రిపబ్లిక్’

విడుదల తేదీ: 01, అక్టోబర్ 2021

నటీనటులు: సాయిధరమ్ తేజ్, ఐశ్వర్య రాజేష్, జగపతిబాబు, రమ్యకృష్ణ, ఆమని, సుబ్బరాజు, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు

కెమెరా: ఎం.సుకుమార్‌

స్క్రీన్‌ప్లే: దేవ్ క‌ట్టా‌, కిర‌ణ్ జ‌య్ కుమార్‌

ఎడిటింగ్: కె.ఎల్‌. ప్ర‌వీణ్ 

సంగీతం: మణిశర్మ

నిర్మాతలు: జె.భగవాన్, జె.పుల్లారావు

రచన-దర్శకత్వం: దేవ్ క‌ట్టా


కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలై.. సినీ ఇండస్ట్రీకి ఊపిరిపోసింది సాయిధరమ్ తేజ్‌ నటించిన చిత్రమే. ఇప్పుడు సెకండ్ వేవ్ తర్వాత తెరుచుకున్న థియేటర్లలోకి సినిమాలైతే విడుదలవుతున్నాయి.. కానీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేకపోతున్నాయి. రీసెంట్‌గా విడుదలైన ‘లవ్ స్టోరి’ చిత్రం సెకండ్ వేవ్ తర్వాత ప్రేక్షకాదరణను అందుకుంటుంది. ఇప్పుడిప్పుడే ప్రేక్షకులు థియేటర్లకి రావడం మొదలెట్టారు. ఇక మెగా హీరో సినిమా అనగానే.. ఈ ఇంపాక్ట్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. అందులోనూ సాయిధరమ్ తేజ్ ఇటీవల యాక్సిడెంట్‌కి గురవడం, సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు రాలేకపోవడంతో మెగాస్టార్, పవర్‌స్టార్‌లు కలగజేసుకోవడంతో.. సినిమాపై క్రేజ్ తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కల్యాణ్ ‘రిపబ్లిక్’ గురించి చెప్పిన విషయాలు, ఇండస్ట్రీ సమస్యలకి దీనిని ముడిపెట్టిన తీరు.. ఈ చిత్రం గురించి మాట్లాడుకునేలా చేశాయి. అలాగే సామాజిక స్పృహతో సినిమాలు చేస్తాడనే పేరు తెచ్చుకున్న దర్శకుడు దేవ్ కట్టా.. ఓ పొలిటికల్ థ్రిల్లర్ చిత్రం చేస్తున్నాడనగానే.. ఈ చిత్రంలో ఏదో విషయం చెప్పబోతున్నాడనేలా ప్రేక్షకుల మైండ్‌లోకి వెళ్లిపోయింది. మూడు గుర్రాలతో ఆయన చూపిన డెమోక్రసీ లుక్, ట్రైలర్ వంటివి దేవ్ కట్టా మార్క్‌తో సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. మరి ఇన్ని అంచనాల నడుమ నేడు థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.


కథ:

తండ్రి దశరథ్(జగపతిబాబు) అవినీతిపరుడని తెలుసుకున్న పంజా అభిరామ్(సాయిధరమ్ తేజ్).. చిన్నప్పటి నుంచి తండ్రి భావాలను వ్యతిరేకిస్తూ పెరుగుతాడు. ఐదువందల మంది ఎగ్జామ్ రాస్తే.. అందులో టాప్ 1గా నిలిచేంత పట్టు, తెలివి ఉన్న అభిరామ్.. తన కళ్ల ముందు జరిగే అన్యాయాలను, అక్రమాలను చూస్తూ చలించిపోతాడు. అమెరికా వెళ్లే అవకాశాలు వచ్చినా కాదని ఐపీఎస్ పూర్తి చేస్తాడు. ఒక ప్రాంతీయ పార్టీ అధినేత్రి అయిన విశాఖవాణి(రమ్యకృష్ణ).. తన తండ్రి సాధించలేని అధికారాన్ని సాధించి, తన కుమారుడిని సీఎంగా చేస్తుంది. ఈ అధికారం కోసం ఆమె గుణ అనే గూండా గ్యాంగ్‌తో పాటు, కరెప్టెడ్ బ్యూరోక్రాట్స్‌తో కలిసి అనేక దౌర్జన్యాలకు, కబ్జాలకు పాల్పడుతుంది. అడ్డొచ్చిన వారిని అడ్డు లేకుండా చేస్తుంటుంది. ఓటు రాజకీయాల కోసం ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఆ ప్రాంతానికి చెందిన తెల్లేరు సరస్సుని కబ్జా చేసి మత్స్యగ్రంథ పేరుతో చేపల చెరువులుగా మార్చేస్తుంది. ఆ చేపలకు వాడే రసాయనాలతో ఆ ప్రాంతంలో ఓ సమస్య ఏర్పడుతుంది. ఆ సమస్యపై ప్రశ్నించిన వారిని విశాఖవాణి చంపిస్తుంటుంది. అలాంటి ప్రాంతానికి ఓ స్పెషల్ పవర్‌తో కలెక్టర్‌గా వచ్చిన అభిరామ్.. విశాఖవాణిని ఎలా ఎదుర్కొన్నాడు? తెల్లేరు సరస్సుకు తిరిగి వైభవం తీసుకొచ్చేందుకు అభిరామ్ ఏం చేశాడు? అస్తవ్యస్తంగా మారిన వ్యవస్థపై అభిరామ్ ఎలా పోరాటం చేశాడు? అమెరికా వెళ్లిపోవాల్సిన ఎన్నారై మైరా(ఐశ్వర్య రాజేష్).. ఇండియాలోనే ఉండిపోవడానికి కారణం ఏంటి? విశాఖవాణి, దశరథ్‌ల కారణంగా మైరా ఎటువంటి పరిస్థితులను ఫేస్ చేయాల్సి వస్తుంది? వంటి విషయాలను తెలుసుకోవాలంటే థియేటర్‌లో ఈ సినిమా చూడాల్సిందే.


విశ్లేషణ:

యువ హీరోలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇటువంటి సినిమాలు చేయడానికి సాహసించరు. కానీ సాయిధరమ్ తేజ్ ఈ సినిమాతో సాహసం చేసినట్లే. కథ మీద ఉన్న నమ్మకంతో ఈ సినిమా నేనే చేస్తానని తన దగ్గర ప్రామిస్ తీసుకున్నట్లుగా ఇటీవల దేవ్ కట్టా తెలిపారు. వ్యవస్థపై విసిగిపోయిన యువకుడిగా, అలాగే బాధ్యత కలిగిన ఐఏఎస్ ఆఫీసర్‌గా తేజ్ నటన.. ఇప్పటి వరకు అతను చేసిన సినిమాల్లో బెస్ట్ అని చెప్పవచ్చు. తేజ్ ప్రదర్శించిన ఎమోషన్స్‌కి, ఎక్స్‌ప్రెషన్స్‌కి ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. ఎన్నారై‌గా ఐశ్వర్యా రాజేష్‌కు మంచి పాత్ర లభించింది. హీరోతో డ్యూయట్స్ వంటివి ఏమీ ఉండవు. న్యాచురల్ నటనతో మరోసారి న్యాచురల్ నటినని అనిపించుకుంది. రమ్యకృష్ణ, జగపతిబాబులకు పవర్ ఫుల్ రోల్స్ పడ్డాయి. పొలిటికల్ పాత్రలు రమ్యకృష్ణకు కొత్తేం కాదు. ఈ మధ్య కాలంలో ఆమె చేస్తున్నవన్నీ ఇటువంటి పాత్రలే. అయితే ఈ సినిమాలో రమ్యకృష్ణ పాత్ర చాలా వైవిధ్య భరితంగా ఉంటుంది. రెండు షేడ్స్ ఉంటాయి. జగపతిబాబు పాత్ర కూడా అంతే. ఇంకా శ్రీకాంత్ అయ్యంగార్‌, రాహుల్ రామకృష్ణ, మనోజ్ నందంకు మంచి పాత్రలు పడ్డాయి. సుబ్బరాజుని రెండు సీన్లకు పరిమితం చేశారు. ఆమని, సురేఖావాణి పాత్రలకు పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. వీరంతా వారి పాత్రల పరిధిమేర సినిమాకు మంచి సహకారాన్ని అందించారు.


టెక్నికల్ విషయానికి వస్తే.. మణిశర్మ నేపథ్య సంగీతం, దేవ్ కట్టా డైలాగ్స్ ఈ సినిమా ప్రధాన బలం. ఉన్న మూడు పాటలు సందర్భానుసారంగా వచ్చి వెళ్లిపోతాయి తప్ప.. అంతగా ఎక్కించుకునేలా లేవు. నేపథ్య సంగీతం విషయంలో మణిశర్మ ఎందుకంత స్పెషలో మరోసారి నిరూపించుకున్నాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పరంగా ఇంకాస్త క్రిస్ప్‌గా వెళ్లి ఉండవచ్చు. నిర్మాతలు పెట్టిన ఖర్చు తెరపై కనిపిస్తుంది. స్టార్టింగే పోలింగ్ సీన్‌తో దర్శకుడు దేవ్ కట్టా ఎటువంటి చిత్రాన్ని చూపించబోతున్నాడో క్లారిటీ ఇచ్చేశాడు. తను రాసుకున్న కథని నిజాయితీగా తెరకెక్కించాడు దర్శకుడు. ఆయన ఈ సినిమాతో చెప్పాలనుకున్న మెయిన్ పాయింట్..  ప్రభుత్వం, పరిపాలన వ్యవస్థ, న్యాయస్థానాలు సమాంతరంగా నడిస్తేనే ప్రజాస్వామ్యం. వీటిలో ఏది గాడి తప్పినా.. వ్యవస్థ మొత్తం చెడిపోతుంది. ముఖ్యంగా పరిపాలన వ్యవస్థ మిగతా వాటిని శాసించినంతకాలం ప్రజాస్వామ్యం అనే పదానికి అర్థమే ఉండదని తెలపడమే. అలాగే కరెప్టెడ్ బ్యూరోక్రాట్స్‌ వల్ల వ్యవస్థ ఎలా నాశనం అవుతుందో, నిజాయితీపరులైన అధికారులు ప్రభుత్వాలకు ఎలా బలి అవుతున్నారో చెప్పే ప్రయత్నం చేశాడు. వాస్తవానికి నేటి పొలిటికల్ పరిస్థితులు ఈ సినిమాకి చాలా దగ్గరగా ఉన్నాయి. పార్టీ కోసం, పదవుల కోసం ఎన్ని అరాచకాలైనా చేయవచ్చు అనేలా.. ‘మర్డర్ కూడా ఆర్భాటంగా చేయాలి’ అని దేవ్ కట్టా రాసిన డైలాగ్ ఒక్కటి చాలు.. నేటి పొలిటికల్ వ్యవస్థ తీరు ఎలా ఉందో చెప్పడానికి. ఇంకా 

‘గవర్నమెంట్ మారడమంటే పాత గూండాలు పోయి కొత్త గూండాలు రావడమే’, 

‘ఓటర్ చిన్న పిల్లాడితో సమానం.. సాయంత్రం వరకు బాదేసి.. చివరలో ఓ బిస్కట్ పడేస్తే చాలు’, 

‘అజ్ఞానం గూడు కట్టిన చోటే మోసం గుడ్లు పెడుతుంది’.. వంటి డైలాగ్స్‌తో నేటి పొలిటికల్ వ్యవస్థ తీరెలా ఉందో చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అలాగే 

‘కట్టకుండానే కూలిపోతున్న వ్యవస్థలే.. ఆ ప్రజాస్వామ్యానికి పునాదులని తెలియకుండా ఇంకా ఫ్యూడలిక్ వ్యవస్థలోనే బ్రతుకుతున్నాం’, 

‘సివిల్ సర్వెంట్స్, కోర్టులు కూడా ఆ రూలర్స్ కింద బానిసలుగానే బ్రతుకుతున్నారు’, 

‘ప్రతి ఫెయిల్యూర్ మనల్ని రియాల్టీకి దగ్గర చేస్తుంది’ వంటి డైలాగ్స్ ప్రజలను ఆలోచనా మార్గం వైపు నడిపేలా ఉన్నాయి. రియాలిటీకి వస్తే.. ఇందులో దిశ, నిర్భయ వంటి సంఘటనల తర్వాత ప్రభుత్వాల రియాక్షన్, అధికారం కోసం పార్టీలు చేసే దౌర్జన్యాలు, వింత వింత వ్యాధులకు కారణాలు.. ఇలా ఒక్కటేమిటి అనేక విషయాలను సినిమాటిక్‌గా దేవ్ కట్టా ఈ సినిమాలో చూపించాడు. సినిమా విషయానికి వస్తే.. కథనంగా చిన్న చిన్న లోపాలు పక్కన పెడితే కథగా దేవ్ కట్టా చెప్పాలనుకున్న పాయింట్ చాలా ఉన్నతమైనది. క్లైమాక్స్ ఎవరూ ఊహించనిది. నిజాయితీగా, ఆలోచనాత్మకంగా దేవ్ చేసిన ఈ ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనే దానిపైనే ఈ చిత్ర సక్సెస్ ఆధారపడి ఉంది. ఫైనల్‌గా దేవ్ కట్టా చెప్పింది ఏమిటంటే.. ఇప్పుడున్న వ్యవస్థని మార్చడం అంత సులభం కాదు అనేది ఆయన ఇచ్చిన క్లైమాక్స్‌కి నిదర్శనం. ఈ విషయం ఆయన చెప్పడానికి ఎంచుకున్న మార్గమే ‘రిపబ్లిక్’. 

ట్యాగ్‌లైన్: నేటి వ్యవస్థపై ఎక్కుపెట్టిన అస్త్రం

Updated Date - 2021-10-01T21:17:32+05:30 IST