‘మాస్ట్రో’ మూవీ రివ్యూ

ABN , First Publish Date - 2021-09-18T01:06:27+05:30 IST

థియేటర్‌కి పోటీగా ఓటీటీలు పరుగులు తీస్తున్న టైమ్‌లో కరోనా రూపంలో వారికి మంచి ఛాన్స్ లభించింది. కరోనాతో థియేటర్లు మూతపడిపోవడంతో.. పెద్ద సినిమాలు సైతం ఓటీటీ బాట పట్టాయి, పడుతున్నాయి. థియేటర్లు తెరుచుకుని సినిమాలు విడుదలవుతున్నా.. ప్రేక్షకులు అంతంత మాత్రంగానే ఇంట్రెస్ట్ పెడుతున్నారు. దీంతో..

‘మాస్ట్రో’ మూవీ రివ్యూ

చిత్రం: ‘మాస్ట్రో’

విడుదల తేదీ: 17, సెప్టెంబర్ 2021

విడుదల: డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (ఓటీటీ)

నటీనటులు: నితిన్, తమన్నా, నభా నటేష్, నరేష్, జిషు సేన్‌ గుప్త, శ్రీముఖి, మంగ్లీ, రచ్చ రవి తదితరులు

కెమెరా: జె. యువరాజ్

ఎడిటింగ్: ఎస్.ఆర్. శేఖర్, 

సంగీతం: మహతి స్వర సాగర్

నిర్మాతలు: సుధాకర్ రెడ్డి, నిఖితారెడ్డి

దర్శకత్వం: మేర్లపాక గాంధీ


థియేటర్‌కి పోటీగా ఓటీటీలు పరుగులు తీస్తున్న టైమ్‌లో కరోనా రూపంలో వారికి మంచి ఛాన్స్ లభించింది. కరోనాతో థియేటర్లు మూతపడిపోవడంతో.. పెద్ద సినిమాలు సైతం ఓటీటీ బాట పట్టాయి, పడుతున్నాయి. థియేటర్లు తెరుచుకుని సినిమాలు విడుదలవుతున్నా.. ప్రేక్షకులు అంతంత మాత్రంగానే ఇంట్రెస్ట్ పెడుతున్నారు. దీంతో బిగ్ డీల్‌తో నిర్మాతల నుంచి చిన్న, పెద్ద హీరోల సినిమాలను సొంతం చేసుకుని, ఓటీటీ సంస్థలు తమ ప్లాట్‌ఫామ్స్‌లో విడుదల చేస్తున్నాయి. అలాంటి జాబితాలోనే నేడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో విడుదలైంది యూత్ స్టార్ నితిన్ నటించిన ‘మాస్ట్రో’ చిత్రం. బాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ హిట్ అయిన సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రంపై మొదటి నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. నితిన్ ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నాడని, తమన్నా ఇందులో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో చేస్తుందనే ప్రచారం ఆమె ఈ చిత్రానికి ఎన్నికైనప్పటి నుంచి వినిపిస్తుండటంతో.. ప్రేక్షకులకు ఈ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. థ్రిల్లర్ నేపథ్యంలో ఉన్న ఈ చిత్రాన్ని దర్శకుడు మేర్లపాక గాంధీ ఎలా తెరకెక్కించి ఉంటాడు? అనే ఆసక్తితో పాటు విడుదలైన ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఈ సినిమా కోసం వెయిట్ చేసేలా చేసింది. విడుదలకు ముందు మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం.. విడుదల తర్వాత ఎటువంటి టాక్‌ని సొంతం చేసుకుంది? ప్రేక్షకుల అంచనాలను ఈ చిత్రం నిలబెట్టుకుందా? ఒరిజినల్ మూవీలో నితిన్ పాత్ర చేసిన ఆయుష్మాన్‌ ఖురానాకు జాతీయ అవార్డును తెచ్చిపెట్టిన ఈ చిత్రం నితిన్‌కు ఎటువంటి విజయాన్ని ఇచ్చింది?.. వంటి విషయాలను రివ్యూలో తెలుసుకుందాం. 


కథ:

కంటిచూపు లేకపోయినా.. అరుణ్(నితిన్)లో పియానోను అద్భుతంగా వాయించే టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్‌తో కొందరికి పియానో నేర్పిస్తూ.. మధ్యలో కన్సర్ట్‌లు చేసుకుంటూ ఉంటాడు. అయితే ఓ కన్సర్ట్‌కు అతను ట్యూన్ రెడీ చేస్తుండగా.. అతని పియానో పాడవుతుంది. దీంతో కొత్తది లేదంటే సెకండ్ హ్యాండ్ పియానో కొనాలని అనుకుంటున్న అరుణ్‌కు, రెస్టారెంట్‌‌ సరిగా సాగక.. అందులోని వస్తువులను అమ్మేసి బిజినెస్ క్లోజ్ చేయాలనుకుంటున్న సోఫీ(నభా నటేష్).. పియానో అమ్ముతానని ఫోన్ చేస్తుంది. పియానో కొనడానికి వెళ్లిన అరుణ్.. వారు చెప్పిన రేటుకు కొనలేక, వారి ప్రాబ్లమ్ తెలుసుకుని అక్కడే ఓ డీల్ కుదుర్చుకుంటాడు. నితిన్ ప్లాన్‌తో సోఫీ వాళ్ల రెస్టారెంట్ మళ్లీ కళకళలాడుతుంది. ఆ రెస్టారెంట్‌లో పియానో వాయిస్తున్న అరుణ్‌ను సీనియర్ హీరో మోహన్(నరేష్) చూసి, అతని టాలెంట్‌కు ఆకర్షితుడవుతాడు. మ్యారేజ్ యానివర్శరీకి తన భార్య సిమ్రన్(తమన్నా)ను సర్‌ప్రైజ్ చేయాలని.. తన ఇంటిలో అరుణ్‌తో పియానో ప్రోగ్రామ్‌కు ఓకే చేయించుకుంటాడు. అయితే మ్యారేజ్ యానివర్సరీ రోజు మోహన్ ఇంటికి వెళ్లిన అరుణ్‌‌.. రక్తపు మడుగులో మోహన్ చనిపోయి ఉండటం గమనిస్తాడు. ఆ మోహన్‌ని ఎవరు.. ఎందుకు చంపారు? మోహన్ చావుతో అరుణ్ ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? చివరకు అరుణ్ ఆ విపత్కర పరిస్థితుల నుంచి ఎలా బయటపడ్డాడు? అనేది తెలియాలంటే ఓటీటీలో విడుదలైన ఈ సినిమా చూడాల్సిందే.


విశ్లేషణ:

రీమేక్ సినిమా అనగానే ఎక్కువగా కంపారిజన్స్ వెతికే ప్రయత్నం చేస్తుంటారు. ఈ సినిమాలో అరుణ్‌గా అంధుడి పాత్రలో నితిన్ అన్ని ఎమోషన్స్‌ని చక్కగా పలికించాడు. ఫస్టాఫ్ అంతా సరదాగా కనిపించిన నితిన్‌, సెకండాఫ్‌లో పడే ఇబ్బందుల్లోనూ చక్కని అభినయం కనబరిచాడు. బాలీవుడ్‌లో ఈ పాత్ర చేసిన ఆయుష్మాన్‌ ఖురానాకు ఏ మాత్రం తీసిపోకుండా నితిన్ తన పాత్రకు న్యాయం చేశాడు. నితిన్ తర్వాత తమన్నాకు ఈ సినిమాలో చాలా మంచి పాత్ర దక్కింది. ఇంకా చెప్పాలంటే ఈ సినిమాకి కీలకమే ఆమె పాత్ర. ఒరిజినల్‌లో టబు ఈ పాత్రని చేసింది. టబుతో పోలిక పక్కన పెడితే.. నటనపరంగా తమన్నా ఎక్కడా తగ్గలేదు. తన రియల్ లైఫ్ పాత్రనే ఈ చిత్రంలో పోషించాడు నరేష్. కనిపించిన ప్రతిసారి విగ్గు సరిచేసుకుంటూ.. రెస్పాన్సిబిలిటీ ఉన్న సెలబ్రిటీగా ఒదిగిపోయాడు. ఆయన కూతురు పవిత్రగా చేసిన అనన్య నాగళ్ల పాత్రకు పెద్దగా స్కోప్ లేదు. సీఐ పాత్రలో సీరియస్‌గా, భార్య(శ్రీముఖి)కు వణికిపోయే పాత్రలో కామెడీగా జిషు సేన్‌ గుప్త వైవిధ్యభరితంగా నటించాడు. సెకండాఫ్‌లో మంగ్లీ, రచ్చరవి, హర్షవర్ధన్‌లు షాకింగ్ ట్విస్ట్‌ ఇచ్చే ప్రయత్నం చేశారు. వీరు తప్ప మిగతా ఆర్టిస్ట్‌లంటూ పెద్దగా చెప్పుకోవడానికి ఎవరూ లేరు. మహతి స్వరసాగర్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఉన్న రెండు మూడు సాంగ్స్ పెద్దగా ఎక్కలేదు కానీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో మహతి మెప్పించాడు. సెకండాఫ్ ఎడిటింగ్ విషయంలో ఎస్.ఆర్. శేఖర్ ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. జె. యువరాజ్ కెమెరా వర్క్, నిర్మాణ విలువలు అన్నీ బాగున్నాయి. 


ఇక దర్శకుడు మేర్లపాక గాంధీ.. ఈ చిత్రం విషయంలో ఛాయిస్ తీసుకోలేదు. దాదాపు ఒరిజినల్‌నే ఫాలో అయ్యాడు. వాస్తవంగా బాలీవుడ్ చిత్రానికి ఇది ఫర్పెక్ట్ రీమేక్ అని చెప్పుకోవచ్చు. గాంధీ కొత్తగా ఏం చేసినా, అది అతనికే రివర్స్ కొడుతుందని కాబోలు.. మ్యాగ్జిమమ్ ఒరిజినల్‌కే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాడు. సోల్ మిస్ కాకుండా చిత్రాన్ని తెరకెక్కించాడు. మాములుగా అయితే ఇటువంటి థ్రిల్లర్స్‌లో హీరో.. విలన్ ఎవరో కనుక్కోవడమే సినిమా లక్ష్యంగా సాగుతుంది. కానీ, అసలు హంతకులు ఎవరనేది స్టార్టింగ్‌లోనే హీరోకి తెలిసినా.. ఆ విషయం చెప్పే దారులు లేకపోవడమే ఈ సినిమాలో మెయిన్ ట్విస్ట్. ఇక ఇంటర్వెల్‌కి ముందు తమన్నా ఇచ్చే ట్విస్ట్ ప్రేక్షకులకు ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. ఆ ఆసక్తిని సెకండాఫ్‌ స్టార్టింగ్‌లో క్యారీ చేయలేకపోయాడు దర్శకుడు. మళ్లీ మంగ్లీ, రచ్చరవి, హర్ష ఇచ్చే ట్విస్ట్‌‌తో సెకండాఫ్ గ్రాఫ్ లేపాలని దర్శకుడు ప్రయత్నించాడు. ఇక క్లైమాక్స్ చూశాక.. చిన్న కుందేలు పిల్ల ఇంత కథని నడిపిందా? అని అనుకునేలా చేసి.. ఆర్గాన్ డొనేషన్ మెసేజ్‌తో చిత్రాన్ని ముగించాడు దర్శకుడు. ఓవరాల్‌గా ఇళయరాజా ఏకలవ్య శిష్యుడైన ఈ ‘మాస్ట్రో’ ఒరిజినల్ చూసిన వారికి అంతగా కిక్ ఇవ్వకపోయినా.. చూడని వారికి మాత్రం ఓకే అనిపిస్తాడు.

ట్యాగ్‌లైన్: ‘మాస్ట్రో’.. మనకి కొత్తగా ఉంటాడు

Updated Date - 2021-09-18T01:06:27+05:30 IST