‘మెరిసే మెరిసే’ మూవీ రివ్యూ
ABN , First Publish Date - 2021-08-07T12:44:17+05:30 IST
ఫీల్ గుడ్ లవ్‌స్టోరీస్‌కు ప్రేక్షకాదరణ ఎప్పుడూ ఉంటుంది. అయితే ప్రేమకథను వెండితెరపై...

చిత్రం: మెరిసే మెరిసే
బ్యానర్: కొత్తూరి ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పి
నటీనటులు: దినేశ్ తేజ్, శ్వేతా అవస్తి, సంజయ్ స్వరూప్, గురు రాజ్, బిందు, సంధ్య జనక్, మని, శశాంక్, నానాజీ తదితరులు
సినిమాటోగ్రఫీ: నగేశ్ బానెల్
సంగీతం: కార్తీక్ కొడగండ్ల
ఎడిటర్: మహేశ్
నిర్మాత: వెంకటేశ్ కొత్తూరి
దర్శకత్వం: పవన్‌కుమార్.కె
ఫీల్ గుడ్ లవ్‌స్టోరీస్‌కు ప్రేక్షకాదరణ ఎప్పుడూ ఉంటుంది. అయితే ప్రేమకథను వెండితెరపై చూపించాల్సిన తీరులో చక్కగా అన్ని ఎలిమెంట్స్‌ను యాడ్ చేసి తెరకెక్కించాలి. అప్పుడే అవి ప్రేక్షకుడికీ ఆసక్తికరంగా అనిపిస్తాయి. ప్రేమకథను ఆసక్తికరంగా తెరకెక్కించలేనప్పుడు రొటీన్‌గా అనిపిస్తాయి. మరి ఈ వారం ప్రేక్షకుల ముందుకు `హుషారు` ఫేమ్ దినేశ్ తేజ్, శ్వేతా అవస్తి జంటగా పవన్‌కుమార్.కె దరశకత్వంలో వచ్చిన ఫీల్ గుడ్ లవ్‌స్టోరి `మెరిసే మెరిసే` ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో తెలుసుకోవాలంటే సినిమా కథలోకి వెళదాం
కథ:
వైజాగ్‌లో కన్స్ట్రక్షన్ కంపెనీ యజమాని కొడుకైన సిద్ధు(దినేశ్ తేజ్) తండ్రి వ్యాపారాన్ని చూసుకోమని చెబుతున్నా, తన కాళ్లపై తను నిలబడాలనుకుంటాడు. అందుకోసం బెంగుళూరులో స్టార్టప్ కంపెనీ ప్రారంభిస్తాడు. కానీ కాలం కలిసి రాకపోవడంతో నష్టపోతాడు. బాధను మరచిపోవాలంటే ప్లేస్ మారాలని, తల్లిదండ్రుల పర్మిషన్తో హైదరాబాద్‌కు షిఫ్ట్ అవుతాడు. మరోవైపు రాజమండ్రిలో బి.కాం చదివే వెన్నెల(శ్వేతా అవస్తి)కి లండన్‌లో డాక్టర్ అయిన హరీశ్‌తో ఎంగేజ్మెంట్ అవుతుంది. పెళ్లికి ఎనిమిది నెలల సమయం ఉండటంతో హైదరాబాద్‌కు చేరుకుంటుంది. ఆమెకు ప్యాషన్ డిజైనర్ కావాలనే కోరిక బలంగా ఉంటుంది. ఆమె చేసిన కొన్ని డిజైన్స్ చూసిన ఆమె స్నేహితులు కూడా ఆమెకు అదే సలహాను ఇస్తారు. కానీ కాబోయే భర్త హరీశ్, అతని తల్లి అందుకు ఒప్పుకోరు. దాంతో వెన్నెల వారికి చెప్పకుండా ఓ తన దగ్గరున్న బంగారాన్ని తాకట్టు పెట్టి ఫ్యాషన్ డిజైనింగ్కంపెనీని స్టార్ట్ చేస్తుంది. ఆమె దగ్గర సిద్ధు ఎంప్లాయ్‌గా జాయిన్ అవుతాడు. మరి వెన్నెల ఫ్యాషన్ డిజైనర్‌గా సక్సెస్ అయ్యిందా? వెన్నెలకు సిద్ధు ఎంత వరకు అండగా నిలబడతాడు.. హరీశ్, వెన్నెల పెళ్లి చేసుకుంటారా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:
ఇది వరకు ప్రస్తావించినట్లు తెలుగు తెరపై వైవిధ్యమైన ప్రేమకథలెన్నో వచ్చాయి. అయితే వాటిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నవి కొన్ని మాత్రమే. అందుకు కారణం.. దర్శకులు వాటిని వైవిధ్యంగా తెరకెక్కించిన తీరు. మంచి ప్రేమకథకు, సంగీతం, సినిమాటోగ్రఫీ జత కూడితే తిరుగుండదు. ఈ మధ్య లవ్‌స్టోరీస్‌లో బోల్డ్, అడల్ట్ కంటెంట్ ఎక్కువ అవుతున్న తరుణంలో పవన్‌కుమార్ ఓ ఫీల్ గుడ్ లవ్‌స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. జీవితంలో ఏదో సాధించాలనుకుని ఏమీ చేయలేకపోయాననుకున్న యువకుడికి, ఏదో సాధిద్దాం అనుకుని సిటీకి వచ్చిన ఓ అమ్మాయి తారసపడుతుంది. వారిద్దరూ కలిసి చేసే ప్రయాణాన్ని డైరెక్టర్ పవన్ కుమార్ మెరిసే మెరిసే చిత్రంలో చూపించారు. అసలు ఏ దర్శకుడి దగ్గరా పనిచేయకపోయినా పవన్‌కుమార్ సినిమాను తెరకెక్కించిన తీరు బావుంది. సింపుల్‌గా కథను నడింపించాడు. ఎక్కడా ట్విస్టులు, టర్నులు అంటూ వెళ్లలేదు. అయితే అదే ఆయనకు బ్రేక్‌లా అడ్డుపడిందనాలి. ఎందుకంటే ఇప్పుడు డిజిటల్ మీడియాల ట్రెండ్‌లో ప్రేక్షకులు హారర్, థ్రిల్లర్, క్రైమ్, లస్ట్ , లవ్ అంటూ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ చూస్తున్నాడు. ఏదో ఎగ్జయిట్మెంట్ కావాలనుకోవడం అలవాటైంది. ఇలాంటి తరుణంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుడికి కనెక్ట్ కాదు. అదీ కాక.. సినిమాను స్లోగా నడిపించడం ప్రధాన సమస్యగా మారింది. లవ్ ట్రాక్‌లో ఎమోషన్స్ డెప్త్ కనపడదు. అలా సినిమా నడిచిపోతుంటుంది. అది ప్రేక్షకుడికి సినిమా చూస్తున్నాంలే అనే భావన వస్తుంది కానీ.. ఏదో ఎగ్జయిట్‌మెంట్‌గా ఫీల్ కాడనేది వాస్తవం. ప్రొడక్షన్ వేల్యూస్ బావున్నాయి. కార్తీక అందించిన పాటల్లో ఓ లవ్ మాంటేజ్ సాంగ్ బావుంది. నేపథ్య సంగీతం ఓకే. నగేశ్ బానెల్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. బలమైన సంభాషణలు లేవు.
చివరగా.. ఫీల్ మిస్ అయిన ప్రేమకథ.. `మెరిసే మెరిసే`
