Review: మహా సముద్రం
ABN , First Publish Date - 2021-10-14T20:58:20+05:30 IST
కొన్ని పరాజయాల తర్వాత కథల ఎంపికలో ఆచితూచి అడుగులేస్తున్న శర్వానంద్ ఈ మధ్యన మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ‘జాను’ సినిమా ప్రేక్షకాదరణ పొందినప్పటికీ విమర్శలు ఎదురయ్యాయి. ఆ తర్వాత విడుదలైన ‘శ్రీకారం’ కూడా సోసోగా అనిపించింది. తదుపరి చిత్రంతో బలమైన విజయం అందుకోవాలని ఆహర్నిశలు కష్టపడ్డారు శర్వానంద్. ‘ఆర్ఎక్స్100’ వంటి యూత్‌ఫుల్ కథతో ఆకట్టుకుని తొలి సినిమాతోనే దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అజయ్ భూపతి కాంబినేషన్లో యాక్షన్, ఎమోషనల్ కథతో ‘మహా సముద్రం’ చిత్రం చేశారు.

సినిమా టైటిల్: మహా సముద్రం
విడుదల తేది: అక్టోబర్ 14, 2021
నటీనటులు: శర్వానంద్, సిద్థార్థ్, అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్, జగపతిబాబు, రావు రమేశ్ తదితరులు.
కెమెరా: రాజ్ తోట
సంగీతం: చేతన్ భరద్వాజ్
ఎడిటర్: ప్రవీణ్
నిర్మాత:ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్, సుంకర రామబ్రహ్మం
దర్శకత్వం : అజయ్ భూపతి
కొన్ని పరాజయాల తర్వాత కథల ఎంపికలో ఆచితూచి అడుగులేస్తున్న శర్వానంద్ ఈ మధ్యన మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ‘జాను’ సినిమా ప్రేక్షకాదరణ పొందినప్పటికీ విమర్శలు ఎదురయ్యాయి. ఆ తర్వాత విడుదలైన ‘శ్రీకారం’ కూడా సోసోగా అనిపించింది. తదుపరి చిత్రంతో బలమైన విజయం అందుకోవాలని ఆహర్నిశలు కష్టపడ్డారు శర్వానంద్. ‘ఆర్ఎక్స్100’ వంటి యూత్‌ఫుల్ కథతో ఆకట్టుకుని తొలి సినిమాతోనే దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అజయ్ భూపతి కాంబినేషన్లో యాక్షన్, ఎమోషనల్ కథతో ‘మహా సముద్రం’ చిత్రం చేశారు. ట్రైలర్లు ఎంతో ఆసక్తికరంగా ఉండడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. దానికి తోడు సిద్ధార్థ్ పదేళ్ల తర్వాత ఈ చిత్రంలో ఓ కీలక పాత్రతో తెలుగుతెరపై కనిపించనుండడం సినిమాకు మరింత హైప్ క్రియేట్ అయింది. మరి ఈ చిత్రం అంచనాలను అందుకొందా? లేదా అన్నది రివ్యూలో చూద్దాం.
కథ:
విశాఖపట్టణానికి చెందిన అర్జున్(శర్వానంద్), విజయ్(సిద్థార్థ్) చిన్ననాటి స్నేహితులు. అర్జున్ మంచి వ్యాపారం చేసి స్థిరపడాలనుకుంటాడు. విజయ్ పోలీసు ఉద్యోగం కోసం కసరత్తులు చేస్తుంటాడు. మరోవైపు మహాలక్ష్మీతో (అదితీరావ్ హైదరీ) తో ప్రేమాయణం సాగిస్తూ, పోలీస్ ఉద్యోగం సాధించాక ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. లా స్టూడెంట్ స్మిత (అనూ ఇమ్మాన్యుయేల్) అర్జున్ లైఫ్‌లోకి అనుకోకుండా వస్తుంది. కొన్ని సంఘటనల వల్ల విజయ్ వైజాగ్ సిటీని, మహాను వదిలేసి వెళ్లిపోతాడు. నాలుగేళ్ల తర్వాత విజయ్ తిరిగి వైజాగ్‌లో ప్రత్యక్షమవుతాడు. అర్జున్ అప్పటికి స్మగ్లర్‌గా ఎదుగుతాడు. అసలు విజయ్ వైజాగ్‌ను ఎందుకు వదిలాడు.. అర్జున్ స్మగ్లింగ్‌లోకి రావడానికి కారణమేంటి? దాని వెనకున్న స్వార్థం ఎవరిది? ప్రాణ ేస్నహితులైన వారిద్దరూ శత్రువులుగా ఎలా మారారు? చివరికి ఏమైంది అన్నది మిగతా కథ.
విశ్లేషణ:
శర్వానంద్, సిద్థార్థ్ ఇద్దరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. జీవితంలో కష్టపడి పైకి ఎదగాలనుకున్న వ్యక్తి, అక్రమ వ్యాపారం చేసి సంపాదించడం.. ఈ రెండు వేరియేషన్లలోనూ శర్వా నటన చక్కగా ఉంది. ఇలాంటి పాత్రల్ని పండించాలంటే కాస్త కష్టపడాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఎంత కష్టపడినా ఆర్టిఫిషియల్‌గా ఉంటుంది. ఆ తేడా కనిపించకుండా శర్వా, సిద్ధార్ధ్ చక్కగా యాక్ట్ చేశారు. భావోద్వేగ సన్నివేశాల్లో శర్వా నటన బావుంది. లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న సిద్థార్థ్ నెగెటీవ్ షేడ్ ఉన్న విజయ్ పాత్రలో అద్భుతమైన నటన కనబర్చాడు. మహా పాత్రలో అదితిరావు హైదరి ఒదిగిపోయింది. అందం, అభినయంతో ఆకట్టుకుంది. లా స్టూడెంట్‌గా అను ఇమ్మాన్యుయేల్ ఇలా వచ్చి అలా వెళ్లినా ఫర్వాలేదనిపించింది. జగపతిబాబు, రావు రమేశ్‌ల పాత్రలు సినిమాకు కీలకమైనవి. ఫస్టాఫ్‌లో జగపతిబాబు పాత్ర ఆర్టిఫిషియల్‌గా ఉన్నపట్పికీ సెకెండాఫ్‌కి వచ్చేసరికి ఆసక్తికరంగా నడిచింది. కండ బలం కన్నా బుద్థి బలం గొప్పది అని నమ్మే గూని బాబ్జీ క్యారెక్టర్లో రావు రమేశ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. విలన్‌గా రామచంద్ర రాజు ఆ పాత్రకు న్యాయం చేశాడు. శరణ్యా, హర్షా తదితరులు తమ పాత్రలకు తగ్గట్టు నడుచుకున్నారు.
తొలి సినిమాతోనే హైప్ తెచ్చుకున్న అజయ్ భూపతి తన తొలి జానర్‌కు భిన్నంగా ఈ కథ ఎంచుకున్నాడు. ఇద్దరు స్నేహితుల మధ్య వివాదాలు రావడం, పగతో వాళ్లు ఎంచుకున్న రంగంలో ఎదగడం, ఇద్దరు స్నేహితుల మధ్య ఉన్న కామన్ ఫ్రెండ్‌కి పెళ్లి విషయంలో అన్యాయం జరిగితే రెండో హీరో తన మంచితనంతో అండగా ఉండడం రొటీనే. అయినా ఆ సన్నివేశాలను దర్శకుడు మరో కోణంలో చూపించి ఉంటే బావుండేది. విలన్‌పై విజయ్ ఎదురు తిరిగింది.. మొదలు.. ప్రేయసితో గొడవ వరకూ ముందు ఏం జరగబోతుందో ముందే తెలిసిపోతుంది. సీన్ జరుగుతుంటే.. ముందు ఏం జరుగుతుందో ఊహించేలా ఉంది. స్ర్కీన్‌ప్లే విషయంలో దర్శకుడు కాస్త జాగ్రత్త తీసుకోవలసింది. మెయిన్ విలన్ రామచంద్రరాజుని అంతం చేసిన తీరు అంతగా ఆకట్టుకోలేదు. భావోద్వేగ సన్నివేశాల్లో సంభాషణలు ఆకట్టుకున్నాయి. విజయ్‌తో ప్రేమలో ఉన్న మహా.. అతను దూరం అయ్యాక ఆమె మనసు అర్జున్ వైపు మళ్లడం.. అతనిపై ఆశలు పెంచుకోవడం అంత కన్వెన్సింగ్గా అనిపించలేదు. క్లైమాక్స్‌లో జగపతిబాబు, సిద్ధార్ధ్‌కు ఏం జరిగిందో చెప్పే సన్నివేశాలు కూడా పేలవంగా అనిపించాయి. పాటలు, వినడానికి, చూడటానికి బావున్నాయి. నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు బావున్నాయి.
ట్యాగ్‌లైన్: ‘మహా సముద్రం’ ఉప్పొంగలేదు