‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా’ మూవీ రివ్యూ
ABN , First Publish Date - 2021-01-29T21:12:38+05:30 IST
బుల్లితెరపై యాంకరింగ్, స్పెషల్ షోస్ ద్వారా గుర్తింపు సంపాదించుకున్న ప్రదీప్ మాచిరాజు హీరోగా నటించిన చిత్రం '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?'

చిత్రం: 30 రోజుల్లో ప్రేమించటం ఎలా?
బ్యానర్: ఎస్.వి.ప్రొడక్షన్
విడుదల: జీఏ2 పిక్చర్స్, యువీ క్రియేషన్స్
నటీనటులు: ప్రదీప్ మాచిరాజు, అమృతా అయ్యర్, శుభలేఖ సుధాకర్, పోసాని కృష్ణమురళి, హేమ, హైపర్ ఆది, శివన్నారాయణ, హర్ష చెముడు, భద్రం తదితరులు
ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్
సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర
సంగీతం: అనూప్ రూబెన్స్
నిర్మాత: ఎస్.వి.బాబు
దర్శకత్వం: మున్నా దూళిపూడి
బుల్లితెరపై యాంకరింగ్, స్పెషల్ షోస్ ద్వారా గుర్తింపు సంపాదించుకున్న ప్రదీప్ మాచిరాజు హీరోగా నటించిన చిత్రం '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?' సినిమాకు చాలా మంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది. అందుకు కారణం మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ అందించిన 'నీలి నీలి ఆకాశం సాంగ్..'. వంద మిలియన్ వ్యూస్‌ను దక్కించుకున్న ఈ వీడియో సాంగ్ సినిమాలో ఎలా ఉంటుంది. అసలు ప్రదీప్ మాచిరాజు హీరోగా సక్సెస్ అయ్యాడా? అసలు 30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా ద్వారా దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడు?ఆల్రెడీ క్రియేట్ అయిన అంచనాలను '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' సినిమా రీచ్ అయ్యిందా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా కథలోకి వెళదాం...

కథ:
1947 స్వాతంత్ర్యం వచ్చే సమయంలో అబ్బాయిగారు(ప్రదీప్ మాచిరాజు), అమ్మాయిగారు(అమృతా అయ్యర్)లకు నిశ్చితార్థం జరిగి ఉంటుంది. మరుసటి రోజు పెళ్లి అనగా, అబ్బాయి, అమ్మాయి మధ్య మనస్పర్ధలు వస్తాయి. దీంతో ఇద్దరూ చనిపోతారు. తర్వాత జన్మలో అర్జున్(ప్రదీప్ మాచిరాజు), అక్షర(అమృతా అయ్యర్)గా పుడతారు. ఇద్దరూ వైజాగ్‌లో బి.టెక్ చదువుతుంటారు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు. పక్క పక్క ఇళ్లల్లోనే ఉంటారు. ఒకరిపై ఒకరు కక్ష సాధించుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో ఓసారి ఇద్దరూ తమ తమ స్నేహితులతో కలిసి అరకు సమీపంలో టూర్‌కు వెళతారు. అక్కడ అనుకోకుండా ఒకరి శరీరంలో మరొకరు ఆత్మ మారిపోతుంది. తిరిగి వారి శరీరాల్లోకి వెళ్లాలంటే ఏం చేస్తారనేదే సినిమా కథ. అసలు ముందు జన్మలో ఇద్దరూ ఎందుకు చనిపోతారు. మళ్లీ వాళ్లిద్దరూ ఈ జన్మలో ఎలా కలుసుకుంటారు? అసలు ఇద్దరి ఆత్మలు ఎందుకు మారిపోతాయి? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే...

విశ్లేషణ:
బుల్లితెరపై ప్రేక్షకులను అలరించిన ప్రదీప్ మాచిరాజు డెబ్యూ హీరోగా ఆకట్టుకోవడానికి గట్టిగానే ప్రయత్నించాడు. అందుకోసం బాగానే కష్టపడ్డాడు. ముఖ్యంగా అబ్బాయిగారు అనే పాత్రలో ప్రదీప్ చక్కగా సూట్ అయ్యాడు. అయితే నటన పరంగా ఓకే అనిపించుకున్నాడు కానీ.. ఆకట్టుకోలేకపోయాడు. ఇక అమృతా అయ్యర్ లుక్స్ పరంగా బాగానే ఉంది. ఆత్మలు మారిన సందర్భంలో మగవాడిలా ఆమె చేసిన నటన ఇబ్బందికరంగా అనిపిస్తుంది. శివన్నారాయణ, హేమ, పోసాని కృష్ణమురళి వారి వారి పాత్రల్లో చక్కగా నటించారు. ఇక వైవా హర్ష, భద్రమ్ నటన గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది. ఇద్దరి పాత్రలూ ఎందుకా? అనిపిస్తాయి. ఏదో కామెడీ సన్నివేశాలు రాసుకున్నాం కదా.. అందుకే వారిని తీసుకున్నాం అన్నట్లు పాత్రలను డిజైన్ చేశారు. పునర్జన్మలపై సినిమాలు రావడం తెలుగులో కొత్తేమీ కాదు. అలాగే హీరో హీరోయిన్స్ శరీరాల్లోకి ఆత్మలు మారిపోయే కథాంశంతోనూ సినిమాలు వచ్చాయి. దర్శకుడు మున్నా ఈ రెండు కాన్సెప్ట్‌లను కలిపి కథగా రాసుకున్నాడు.
లాజిక్ లేవు.. అసలు సినిమాలో హీరో , తన తల్లిని ఎందుకనో తీవ్రంగా ద్వేషిస్తుంటాడు. అందుకు సరైన కారణాన్ని దర్శకుడు వివరించలేదు. అలాగే పోసాని కృష్ణమురళి కూడా తన పెద్ద కుమార్తెను ద్వేషిస్తుంటాడు. కానీ.. అలాంటి ద్వేషం రాత్రికి రాత్రే మారిపోయే సన్నివేశాలు పెట్టేసి మిరాకిల్‌ను ఉన్నట్లుండి దర్శకుడు క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడు. ఇక ఫస్టాఫ్, సెకండాఫ్‌లో సిల్లీ కామెడీ ఎక్కువగా ఉంది. హీరో, అతని స్నేహితులు ఇతర హీరోలను ఇమిటేట్ చేస్తూ వారి అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారే కానీ.. కథలో భాగంగా చేయలేదు. మరో సన్నివేశంలో అమ్మాయిలను వారి అమ్మలు కొట్టే సీన్స్ కూడా స్ఫూఫ్లను ఫాలో అయినట్లు చేశారు. ఇక క్లైమాక్స్ ఉన్నట్లుండి ఏదో ముగించేయాలి? ఇప్పటికే ఆలస్యం చేసేశాం అనే రీతిలో ముగించేశారు. సినిమాకు మంచి హైప్ తెచ్చిన నీలి నీలి ఆకాశం సాంగ్ చిత్రీకరణ, ట్యూన్ చాలా బావుంది. మిగిలిన సాంగ్స్ ఏవీ అంత క్యాచీగా లేవు. దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫీ ఓకే
బోటమ్ లైన్... ప్రేక్షకులు ప్రేమలో పడటం కష్టమే
