ఎస్‌... ఇక నుంచి సమంత

ABN , First Publish Date - 2021-10-04T07:42:28+05:30 IST

నాగచైతన్య, సమంత దారులు ఇక నుంచి వేర్వేరు. అలాగే, ఇంటి పేర్లు కూడా! వీళ్లిద్దరూ వేరుపడిన విషయం ప్రేక్షకుల్ని, ప్రముఖుల్ని షాక్‌కి గురిచేసింది. దాన్నుంచి తేరుకోక ముందే పేరు విషయంలో సమంత స్పష్టత ఇచ్చారు...

ఎస్‌... ఇక నుంచి సమంత

నాగచైతన్య, సమంత దారులు ఇక నుంచి వేర్వేరు. అలాగే, ఇంటి పేర్లు కూడా! వీళ్లిద్దరూ వేరుపడిన విషయం ప్రేక్షకుల్ని, ప్రముఖుల్ని షాక్‌కి గురిచేసింది. దాన్నుంచి తేరుకోక ముందే పేరు విషయంలో సమంత స్పష్టత ఇచ్చారు. ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల్లో తన పేరును ‘ఎస్‌’ నుంచి ‘సమంత’ కింద ఆమె మార్చారు. వివాహమైన తర్వాత సామాజిక మాధ్యమాల్లో పేరు చివర అక్కినేని ఇంటి పేరును చేర్చారామె. ‘సమంత అక్కినేని’ అని రాసుకున్నారు. అయితే, కొన్ని రోజుల క్రితం అక్కినేని ఇంటి పేరును తొలగించి... కేవలం ‘ఎస్‌’ అని మాత్రమే రాశారు. నాగచైతన్య, సమంత జంట మధ్య ఏదో జరుగుతోందని అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి. వాటిని నిజం చేస్తూ శనివారం తమ దారులు వేరని ఇద్దరూ ప్రకటించారు. మరునాడే... ఆదివారం ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల్లో ‘ఎస్‌’ నుంచి ‘సమంత’గా పేరు మారింది. అయితే, ఫేస్‌బుక్‌లో ఇంకా ‘సమంత అక్కినేని’ అని ఉండటం గమనార్హం.


సిద్ధార్థ్‌ చేసిన ట్వీట్‌... సమంతను ఉద్దేశించేనా?

‘మోసగాళ్లు ఎప్పటికీ బాగుపడరు - స్కూల్‌లోని ఓ టీచర్‌ నుంచి నేను నేర్చుకున్న తొలి పాఠాల్లో ఇదొకటి’ అని  శనివారం హీరో సిద్ధార్థ్‌ ట్వీట్‌ చేశారు. అదీ నాగచైతన్య, సమంత ప్రకటన వెలువడిన తర్వాత! సమంతను ఉద్దేశించే ఆయన ట్వీట్‌ చేశారనేది నెట్టింట జనాల అభిప్రాయం. గతంలో సిద్ధార్థ్‌, సమంత ప్రేమలో ఉన్నారనే ప్రచారం జరిగింది. దాన్ని వాళ్లిద్దరూ ఖండించనూ లేదు. అలాగని, అంగీకరించలేదు. నాగచైతన్యతో సమంత వివాహమైన తర్వాత సిద్ధార్థ్‌ సంగతి మరుగున పడింది. ఇప్పుడీ ట్వీట్‌తో మళ్లీ తెర మీదకు వచ్చింది.


చై-సామ్‌ విడిపోవడానికి ఆమిర్‌ ఖాన్‌ కారణమా?

కంగనా రనౌత్‌ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో చేసిన వ్యాఖ్యలు చూస్తే... ‘చై-సామ్‌ విడిపోవడానికి హిందీ హీరో ఆమిర్‌ ఖాన్‌ కారణమా?’ అనే సందేహం కలుగుతుంది. నాగచైతన్య, సమంత, ఆమిర్‌ ఖాన్‌... ఎక్కడా కంగనా రనౌత్‌ వీరి పేర్లు ఉపయోగించలేదు. అయితే, ఆమె చేసిన వ్యాఖ్యలు మాత్రం వాళ్లను ఉద్దేశించి చేసినవే అనిపిస్తోంది. ‘‘దశాబ్ద కాలంగా ప్రేమలో ఉన్న, నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న దక్షిణాది నటుడు సడన్‌గా భార్యకు విడాకులు ఇచ్చాడు. చాలామంది మహిళలు, పిల్లల జీవితాలను నాశనం చేసిన బాలీవుడ్‌ డివోర్స్‌ ఎక్స్‌పర్ట్‌ (విడాకుల అనుభవజ్ఞుడు)ను ఇటీవల దక్షిణాది నటుడు కలిశాడు. దాంతో అంతా స్మూత్‌గా జరిగింది. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మనందరికీ తెలుసు’’ అని కంగనా రనౌత్‌ పేర్కొన్నారు. ‘‘విడాకులు ఎప్పుడు తీసుకున్నా తప్పంతా పురుషులదే. నా మాటలు మహిళ పక్షాన ఉండొచ్చు. కానీ, ప్రకృతిలో స్త్రీ-పురుషులను భగవంతుడు అలా చేశాడు. పురుషుడు ఎప్పుడూ వేటగాడే. ఒంటి మీద దుస్తులు మార్చినట్టు మహిళలను మార్చి, బెస్ట్‌ ఫ్రెండ్‌ అని చెప్పే వెధవలపై జాలి చూపించడం ఆపండి’’ అని కంగనా రనౌత్‌ వ్యాఖ్యానించారు.


ఆ జంటకు తప్ప ఎవరికీ తెలియదు!

‘‘ఓ జంట ఎందుకు విడిపోయారనేది వాళ్లిద్దరికీ తప్ప... ఎవరికీ తెలియదు. ఏం జరిగినా వాళ్ల మధ్యే ఉంటుంది. మనుషులుగా వాళ్ల ప్రైవసీకి మనం గౌరవం ఇవ్వాలి. పరిస్థితులు అర్థం చేసుకునేందుకు వాళ్లకు తగిన సమయం ఇవ్వాలి. ఊహాగానాలు చేయడం, ఓ నిర్ణయానికి రావడం వంటివి మానేయండి’’ అని నటి ఖుష్బూ ట్వీట్‌ చేశారు. ‘‘మీరు బతకండి. పక్కనోళ్లను బతకనివ్వండ్రా! అది చాలా సులభం’’ అని ఇన్‌స్టా స్టోరీలో నిహారికా కొణిదెల పేర్కొన్నారు. ‘‘పెళ్లిల్లు నరకంలో, విడాకులు స్వర్గంలో నిశ్చయింపబడతాయి. విడాకుల తర్వాత సంగీత్‌ వేడుక జరుపుకోవాలి. విడాకులు తీసుకున్న పురుషులు, మహిళలు పాటలు పాడుతూ నృత్యాలు చేయాలి’’ అని రామ్‌గోపాల్‌ వర్మ ట్వీట్‌ చేశారు. ఈ ముగ్గురూ కూడా ఎక్కడా నాగచైతన్య, సమంత పేర్లు ఉపయోగించలేదు.
ఖుష్బూ

Updated Date - 2021-10-04T07:42:28+05:30 IST