నోటి మాట చాలు!

ABN , First Publish Date - 2021-01-19T10:47:18+05:30 IST

పక్కగా అగ్రిమెంట్లు ఉన్నప్పటికీ, చివరి నిముషంలో మాట తప్పడం, ఫైనాన్స్‌ విషయం సెటిల్‌ కాక సినిమా విడుదల ఆగిపోవడం...

నోటి మాట చాలు!

వి.దొరస్వామిరాజు : జననం 1946 - మరణం 2021

ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు వి.దొరస్వామిరాజు (75) సోమవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. వీఎంసీ కంబైన్స్‌ పేరుతో రాయలసీమ ప్రాంతంలో పంపిణీ సంస్థను ఏర్పాటు చేసిన దొరస్వామిరాజు నిర్మాణరంగంలోకి ప్రవేశించి ఏయన్నార్‌, నాగార్జున,జూనియర్‌ ఎన్టీఆర్‌, జగపతిబాబు, వినోద్‌కుమార్‌లతో పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. దాదాపు వెయ్యి చిత్రాలను  పంపిణీ చేశారు. చిత్రనిర్మాణరంగంలోనే కాదు ఆధ్మాత్మిక, రాజకీయ రంగాల్లోనూ దొరస్వామిరాజు రాణించారు. తిరుమలతిరుపతి దేవస్థానం సభ్యుడిగా కొంత కాలం సేవలు అందించారు. నగరి శాసన సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు.


దొరస్వామిరాజు పార్ధివ దేహాన్ని మంగళవారం ఉదయం తెలుగు ఫిల్మ్‌ చాంబర్‌ దగ్గరకు తీసుకువస్తారు. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించిన అనంతరం ఉదయం 11 గంటలకు ఫిల్మ్‌ నగర్‌ మహాప్రస్థానంలో  అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.


పక్కగా అగ్రిమెంట్లు ఉన్నప్పటికీ, చివరి నిముషంలో మాట తప్పడం, ఫైనాన్స్‌ విషయం సెటిల్‌ కాక సినిమా విడుదల ఆగిపోవడం.. తెలుగు చిత్రపరిశ్రమలో తరచూ జరిగే సంఘటనలు. ముందు ఇంత ఇస్తామని ఒప్పుకొని, చివరి క్షణంలో అంత డబ్బు చెల్లించలేమంటూ బయర్లు చేతులు ఎత్తేయ్యడం, అటువంటి సందర్బాల్లో ఫైనాన్స్‌ను ఎలా క్లియర్‌ చేయాలో తెలియక పంచాయతీలతో లాబ్స్‌ దగ్గర నిర్మాతలు  రాత్రంతా జాగరణ చేసే సన్నివేశాలు గతంలో ఎక్కువగా కనిపించేవి. ఈ మధ్య కూడా ఓ ప్రముఖ హీరో నటించిన చిత్రం సకాలంలో విడుదల కాకపోవడానికి కారణం డబ్బు విషయంలో ఇచ్చిన మాట నిలబెట్టు కోకపోవడమే! అయితే పంపిణీదారుడు దొరస్వామిరాజు విషయంలో ఎప్పుడూ అలా జరగలేదు. కేవలం నోటి మాటతోనే లక్షల వ్యాపారం చేసేవారాయన. అయినా ఎప్పుడూ మాట తేడా రాలేదు. మనిషి  ఎంత నిక్కచ్చిగా ఉంటారో, ఆయన మాట అంత పర్ఫెక్ట్‌. అటువంటి గుడ్‌విల్‌ ఉండడం వల్లే దాదాపు వెయ్యి చిత్రాలను ఆయన పంపిణీ చేయగలిగారు. 


‘డ్రైవర్‌రాముడు’ సినిమాతో... 

 పంపిణీ రంగంలో రాయలసీమకు రాజుగా పేరు తెచ్చుకున్న దొరస్వామిరాజు థియేటర్‌ అధిపతిగా కూడా తన ప్రత్యేకతను చాటుకున్నారు. నటరత్న ఎన్టీఆర్‌ నటించిన ‘డ్రైవర్‌ రాముడు’ చిత్రంతో పంపిణీదారుడుగా దొరస్వామిరాజు రంగ ప్రవేశం చేశారు. ‘విజయ మల్లేశ్వరి కంబైన్స్‌’ (విఎంసీ) పేరుతో ఆయన తిరుపతి ఏర్పాటు చేసిన  పంపిణీ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని ఎన్టీఆర్‌ ప్రారంభించారు. 


ఆ తరువాత ఎన్టీఆర్‌ నటించిన ‘వేటగాడు’, ‘ యుగంధర్‌’, ‘గజదొంగ’, ‘ కొండవీటి సింహం’, ‘జస్టిస్‌ చౌదరి’ తదితర చిత్రాలను దొరస్వామిరాజు రాయలసీమలో పంపిణీ చేశారు. ఏయన్నార్‌ నటించిన ‘ప్రేమాభిషేకం’ చిత్రాన్ని సీడెడ్‌ ఏరియాలో పంపిణీ చేయడంతో దొరస్వామిరాజుకు అక్కినేని కుటుంబంతో సాన్నిహిత్యం ఏర్పడింది. ఇక  అక్కడినుంచి అన్నపూర్ణ స్టూడియో సంస్థ నిర్మించిన అన్ని చిత్రాలను ఆయన పంపిణీ చేశారు.డిస్ర్టిబ్యూటర్‌గా,  ఎగ్జిబిటర్‌గా వరుస విజయాలు సాధించడంతో  దొరస్వామిరాజు దృష్టి చిత్రనిర్మాణ రంగం మీద పడింది. నిర్మాతగా కూడా తన సత్తా చాటాలని ఆయన అనుకొన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో దొరస్వామిరాజుకు అగ్రకథానాయకులు ఎన్టీఆర్‌, ఏయన్నార్‌తో సాన్నిహిత్యం ఉంది. అయితే అప్పటికే ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి వెళ్లిపోవడంతో   అక్కినేని నాగేశ్వరరావుతో తన తొలి సినిమా తీయాలనుకున్నారు దొరస్వామిరాజు. కానీ  అక్కినేని నాగార్జునతో సినిమా తీయమని సూచించారు. అప్పటికే నాగార్జున నటించిన రెండు చిత్రాలు విడుదలయ్యాయి. వాటి రిజల్ట్‌ అంతంత మాత్రమే. అందుకే మాస్‌ సబ్జెక్ట్‌ను ఎన్నుకొని, నాగార్జున, దర్శకుడు కోదండరామిరెడ్డి కాంబినేషన్‌లో   ‘కిరాయి దాదా’ నిర్మించారు దొరస్వామిరాజు. తొలి సినిమాతోనే సక్సెస్‌ఫుల్‌ నిర్మాతల జాబితాలో ఆయన పేరు చేరింది. 


పేరు, డబ్బు రెండూ...

తన రెండో సినిమాను మాత్రం అక్కినేని నాగేశ్వరరావుతోనే తీశారు దొరస్వామిరాజు. ఆ చిత్రం ‘సీతారామయ్యగారి మనవరాలు’. క్రాంతికుమార్‌ ఈ చిత్రానికి  దర్శకుడు. అక్కినేని విగ్గు పెట్టుకోకుండా నటించిన సినిమా ఇదే! ఆయనకు మనవరాలుగా మీనా నటించారు. ఆమె నటజీవితాన్ని రాత్రికి రాత్రి మార్చేసిన సినిమా ఇది. ‘సీతారామయ్యగారి మనవరాలు’ సినిమా బాగుందని అందరూ అన్నారు కానీ కలెక్షన్లు  బొత్తిగా లేవు. ‘పాపం.. దొరస్వామిరాజుకు రూ 30 లక్షలు పోవడం ఖాయం!’ అంటూ ఓ పక్క చిత్రపరిశ్రమలో ప్రచారం. 


‘మీ సినిమా తీసేసి వేరే చిత్రం వేస్తాం’ అంటూ  మరోపక్క నుంచి ఎగ్జిబిటర్ల నుంచి వరుసగా ఫోన్లు. మరో నిర్మాత అయితే సరేననేవారేమో! కానీ దొరస్వామిరాజు వెనక్కి తగ్గ లేదు. కథ మీద గట్టి నమ్మకం ఉంది. ‘సినిమా బాగుంది’ అనే మౌత్‌ టాక్‌ జనానికి చేరితే చాలు.. కలెక్షన్లు పెరుగుతాయి. అందుకే పబ్లిసిటీ మీద దృష్టి పెట్టారు. డైలీ పేపర్లలో ఫుల్‌ పేజీ యాడ్స్‌ ఇవ్వడం ప్రారంభించారు. ఆ రోజుల్లోనే ఈ సినిమా పబ్లిసిటీ కోసం రూ. 25 లక్షలు ఖర్చు పెట్టడం దొరస్వామిరాజు గట్స్‌కు ఓ నిదర్శనం. ఆయన ప్లాన్‌ ఫలించింది. మూడో వారం నుంచి సినిమాకు కలెక్షన్లు పెరిగాయి. వంద రోజుల వరకూ ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం కలగలేదు.  ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావుతోనే ‘మాధవయ్యగారి మనవడు’ సినిమా నిర్మించారు దొరస్వామిరాజు. 


‘అన్నమయ్య’తో అంతులేని కీర్తి

అనంతరం నాగార్జునతో ‘ప్రెసిడెంట్‌గారి పెళ్ళాం’ చిత్రం నిర్మించారు. హిట్స్‌ లేక డల్‌గా ఉన్న నాగార్జునకు ఈ సినిమాతో భారీ హిట్‌ వచ్చింది. మీనా కథానాయికగా నటించిన ఈ చిత్రానికి కోదండరామిరెడ్డి దర్శకుడు.

నాగార్జునతోనే ఆయన నిర్మించిన మరో చిత్రం ‘అన్నమయ్య’ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. స్వీయ రచనకు పదాలు పొదిగి, గానం చేసి తరించిన వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్య చరిత్రను తెరపైకి ఎక్కించిన ఘనత దొరస్వామిరాజుదే. ఎంతో మంది మొదలుపెట్టి, ప్రారంభంలోనే వదిలేసిన ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టి భక్తిశ్రద్ధలతో, నియమనిష్టలతో పూర్తి చేశారు దొరస్వామిరాజు. ఆలా్ట్ర మోడరన్‌ హీరోగా పేరు తెచ్చుకున్న నాగార్జున అన్నమయ్య పాత్రలో అద్బుతంగా ఒదిగారు. అంతకుముందు సాంఘిక, జానపద చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు రాఘవేంద్రరావుకు ఇదే తొలి చారిత్రక, పౌరాణిక చిత్రం. ‘అన్నమయ్య’ చిత్రనిర్మాణ సమయంలో  అడుగడుగునా అవరోధాలు ఎదురైనా దొరస్వామిరాజు లెక్క చేయలేదు. తొలి వారం కలెక్షన్లు కూడా డల్‌గా ఉన్నాయి. అయినా పబ్లిసిటీతో ఆ చిత్రాన్ని నిలబెట్టారు.


జూనియర్‌ ఎన్టీఆర్‌కు పెద్ద హిట్‌

ఎన్టీఆర్‌తో సినిమా తీయలేకపోయినా, ఆయన మనవడు జూనియర్‌ ఎన్టీఆర్‌తో సినిమా తీసి తన కోరిక నెరవేర్చుకొన్నారు దొరస్వామిరాజు. ఆ సినిమా ‘సింహాద్రి’. 18 ఏళ్ల కితం విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ రికార్డులను తిరగరాసి, ఒక ప్రభంజనం సృష్టించిందని చెప్పాలి. దర్శకుడు రాజమౌళికి ఇది రెండో సినిమా. ఎనిమిది కోట్ల బడ్జెట్‌తో రూపుదిదుకున్న ఈ చిత్రం పదమూడున్నర కోట్ల బిజినెస్‌ చేయడం విశేషం. జూనియర్‌ ఎన్టీఆర్‌ కెరియర్‌ను  గొప్ప మలుపు తిప్పిన చిత్రమిది. డిస్ర్టిబ్యూటర్‌గా సిల్వర్‌ జూబ్లీలోకి ఎంటర్‌ అయిన సంవత్సరంలోనే నిర్మాత దొరస్వామిరాజుకు ఇలా  ‘సింహాద్రి’ హిట్‌తో మెమరబుల్‌ గిఫ్టు  ఇచ్చారు ఆడియన్స్‌.


ఆ తర్వాత జగపతిబాబు, మీనా కాంబినేషన్లో ‘భలే పెళ్లాం’  చిత్రాన్ని, వినోద్‌ కుమార్‌, ఆమని జంటగా ‘రాము సినిమా నిర్మించారు. ‘అన్నమయ్య’ తర్వాత దొరస్వామిరాజు నిర్మించిన మరో భక్తిరస చిత్రం ‘వెంగమాంబ’. ఈ సినిమా కూడా పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత తన కుమారుడు విజయకుమార్‌ వర్మను నిర్మాతగా పరిచయం చేస్తూ వంశీ దర్శకత్వంలో ‘కొంచెం టచ్‌లో ఉంటే చెపుతా’  సినిమా నిర్మించారు. ఇదే దొరస్వామిరాజు ఆఖరి చిత్రం.


దొరస్వామిరాజు చిత్రపరిశ్రమలో అజాతశత్రువు అనీ, అందరికీ బంధువు అనీ తెలంగాణ సీఎం కేసీఆర్‌ సహా జూనియర్‌ ఎన్టీఆర్‌, నాని, కె.రాఘవేంద్రరావు, రాజమౌళి, కాట్రగడ్డ ప్రసాద్‌ తదితరులు నివాళులు అర్పించారు. 

Updated Date - 2021-01-19T10:47:18+05:30 IST