యంగ్ యాక్షన్ కొరియోగ్రాఫర్లతో
ABN , First Publish Date - 2021-06-13T06:28:57+05:30 IST
అనుభవం కంటే ప్రతిభకు ప్రాముఖ్యం ఇచ్చే కథానాయకుల్లో అక్కినేని నాగార్జున ఒకరు. పనితనం నచ్చితే తనతో పనిచేసే అవకాశం ఇస్తారు....

అనుభవం కంటే ప్రతిభకు ప్రాముఖ్యం ఇచ్చే కథానాయకుల్లో అక్కినేని నాగార్జున ఒకరు. పనితనం నచ్చితే తనతో పనిచేసే అవకాశం ఇస్తారు. ఇప్పుడు ఆయన ఇద్దరు యంగ్ యాక్షన్ కొరియోగ్రాఫర్లకు అవకాశం ఇచ్చారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఆయనది మాజీ రా అధికారి పాత్ర. పైగా, హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్. సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్‌కు చాలా ఇంపార్టెన్స్ ఉంది. వాటిని కొరియోగ్రఫీ చేసే పని రాబిన్ మాస్టర్, నభా మాస్టర్ చేతుల్లో పెట్టారు. అయితే, యాక్షన్ పార్ట్ డిజైనింగ్ బాధ్యత అంతా దర్శకుడు ప్రవీణ్ సత్తారు చూసుకుంటున్నారని తెలిసింది. గతంలో ‘గరుడువేగ’ చిత్రంలో యాక్షన్ సీక్వెన్సులను దర్శకుడే డిజైన్ చేశారు. ఇప్పుడూ అదే విధంగా స్ర్కిప్ట్ రాసుకున్నప్పుడే యాక్షన్ సీక్వెన్సులు డిజైన్ చేశారట. ఆయన డిజైన్ చేసిన విధంగా యాక్షన్ సీన్లను కొరియోగ్రఫీ చేయడం రాబిన్, నభా మాస్టర్ల బాధ్యత. గతంలో ‘గూఢచారి’ చిత్రానికి వీళ్లిద్దరూ పని చేశారు. ఇప్పుడు ‘మేజర్’కు పని చేస్తున్నారు. జూలై తొలి వారంలో తాజా షెడ్యూల్ ప్రారంభించాలని నిర్మాతలు నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఇజ్రాయేల్ ఆర్మీ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్ క్రవ్ మగ, సమురాయ్ స్వార్డ్ ఫైటింగ్‌లో నాగార్జున శిక్షణ తీసుకున్నారు. ఆయన సరసన కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. ఆమె కూడా రా అధికారి పాత్రలో కనిపించనున్నారు.