కథతో కనెక్ట్ అవుతారు
ABN , First Publish Date - 2021-11-29T11:18:08+05:30 IST
‘‘స్కైలాబ్’’ కథ విని చాలా ఉద్వేగానికి గురయ్యా. మన ఇంట్లో పెద్దవాళ్లు స్కైలాబ్ గురించి ఇప్పటికీ కథలు కథలుగా చెబుతుంటారు. పాత తరానికి తెలిసినంతగా...

‘‘స్కైలాబ్’’ కథ విని చాలా ఉద్వేగానికి గురయ్యా. మన ఇంట్లో పెద్దవాళ్లు స్కైలాబ్ గురించి ఇప్పటికీ కథలు కథలుగా చెబుతుంటారు. పాత తరానికి తెలిసినంతగా ఈ తరానికి తెలియదు. ఈ సినిమాతో ఈతరం వాళ్లు కూడా తెలుసుకుంటారు. కథ నచ్చడంతో లీడ్రోల్లో నటించేందుకు అంగీకరించాను. ఒక మంచి సినిమాను ప్రేక్షకుల ముందుకు ఎందుకు తేకూడదు అనే ఆలోచనతో నేనే నిర్మాతగా మారాను’’ అన్నారు నిత్యామీనన్. ఆమె ముఖ్యపాత్రలో నటిస్తూ నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 4న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా సినిమా విశేషాలను నిత్యామీనన్ పంచుకున్నారు.
దర్శకుడు కథ చెప్పినప్పుడు నాకు స్కైలాబ్ గురించి తెలియదు. ఇంటికెళ్లాక అమ్మానాన్నను అడిగితే చాలా విషయాలు చెప్పారు. కథతో అందరూ కనెక్ట్ అవుతారనిపించింది. ‘స్కైలాబ్’ కథ, తెరకెక్కించిన తీరు చాలా కొత్తగా ఉంటుంది. తెలంగాణలోని బండలింగంపల్లి అనే చిన్న గ్రామంలో జరిగే కథ ఇది. సినిమా అంతా తెలంగాణ యాసలో మాట్లాడతాను. కానీ నేపథ్యంలో వెస్టర్న్ క్లాసికల్ మ్యూజిక్ వినిపిస్తుంది.
నేను సెట్లో ఉన్నంతసేపు నా ఫోకస్ అంతా నటనపైనే. షూటింగ్ పూర్తయ్యాక నిర్మాణ వ్యవహారాలను సమీక్షించేదాన్ని కొన్ని ఇబ్బందులు ఒత్తిళ్లు ఉన్నా నిర్మాతగా సంతోషంగానే ఉన్నాను. ఈ సినిమా నాకు డబ్బు కంటే ఎక్కువ. అందుకే నిర్మాణంలో ఖర్చుకు వెనుకాడలేదు. - రాహుల్ రామకృష్ణ, సత్యదేవ్తో నాకు కాంబినేషన్ సీన్లు లేవు. నాది సెపరేట్ ట్రాక్. కానీ సినిమా చూశాక వాళ్లిద్దరు చాలా గొప్ప నటులు అని అర్థమైంది.