సుకుమార్ ఏం ఇచ్చినా జీవితాంతం గుర్తుండిపోతుంది!
ABN , First Publish Date - 2021-04-08T06:37:13+05:30 IST
‘‘నేను ఏం చేసినా, ఎంత కష్టపడినా మీకు నచ్చటమే నాక్కావాల్సింది. మీకోసం కష్టపడతాను. తగ్గేదే లే... అని అభిమానులకు హామీ ఇస్తున్నాను’’...

‘‘నేను ఏం చేసినా, ఎంత కష్టపడినా మీకు నచ్చటమే నాక్కావాల్సింది. మీకోసం కష్టపడతాను. తగ్గేదే లే... అని అభిమానులకు హామీ ఇస్తున్నాను’’ అన్నారు హీరో అల్లు అర్జున్. ఆయన కథానాయకుడుగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’. గురువార ం బన్నీ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రంలో పుష్పరాజ్ పాత్రను పరిచయంచేస్తూ రూపొందించిన టీజర్‌ను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ‘‘మై డియర్ ఫ్యాన్స్, నా ఆర్మీ అందరికీ థ్యాంక్స్. ఈ రోజు ఇక్కడ ‘పుష్ప’ టీజర్ ను ఆవిష్కరించటంతో పాటు నా పుట్టిన రోజును మీతో కలసి సెలబ్రేట్ చేసుకోవటం సంతోషంగా ఉంది. ఇంతకంటే ఏం కావాలి! ఈ బర్త్‌డే నాకు చాలా స్పెషల్‌గా మిగిలిపోతుంది. నా సినిమా లైఫ్ టేకాఫ్ అయింది సుకుమార్ గారి ‘ఆర్య’తో. ఇప్పుడు నాకు ‘ఐకాన్ స్టార్’ అనే కొత్త బిరుదు ఇచ్చారు. ఆయన ఏం ఇచ్చినా జీవితాంతం గుర్తుండిపోతుంది.
‘తగ్గేదే లే...’ అనేది సినిమాలో క్యారెక్టర్‌కు వాడే ఊత పదం మాత్రమే కాదు నా హృదయానికి చాలా దగ్గరైన మాట కూడా. నాకు భయమేసినప్పుడు నాకు నేను చెప్పుకునే మాట.. నన్ను నేను ప్రోత్సహించుకోవటానికి మరింత కష్టపడటానికి చెప్పుకునే మాట. టీజర్‌లో మీరు చూసింది కొంతే..‘పుష్ప’లో ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. వాటి గురించి తర్వాత చెప్తాను. ‘పుష్ప’తో దేవీ, సుకుమార్, నేను.... ముగ్గురం కలసి వస్తున్నాం. దేవి శ్రీ ప్రసాద్ కూడా తన సంగీతంతో తగ్గేది లే.. అంటున్నాడు. ఈ సినిమా గ్రాండియర్‌గా తెరకెక్కటానికి కారణం మైత్రీమూవీస్ నవీన్, రవి, సతీష్ గారు. వాళ్ల సహకారం మరువలేనిది. అభిమానులు నా పేరు మీద చేస్తున్న మంచి పనులు చూస్తున్నాను. అది నా అదృష్టం’’ అని అన్నారు.
సుకుమార్ మాట్లాడుతూ ‘‘స్టైలిష్ స్టార్ అనే బిరుదు బన్నీకి ఎప్పుడొచ్చిందో నాకు తెలియదు. కానీ ‘పుష్ప’ సినిమాలో బన్నీ అద్భుతమైన పెర్‌ఫార్మెన్స్ అందించబోతున్నారు. ఆయన నటన, వస్త్రధారణ, ఫైట్స్ అన్నీ దేనికదే ప్రత్యేకం. కాబట్టే ఇకపైన ఆయన స్టైలిష్ స్టార్ కాదు ఐకాన్ స్టార్. ఈ సినిమా తర్వాత అర్జున్‌ను ‘ఐకాన్ స్టార్’, ‘పుష్ప’ అని మాత్రమే పిలవాలి. రామ్‌లక్ష్మణ్, పీటర్ హెయిన్స్, జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ ‘పుష్ప’ను అద్భుతంగా తీర్చి దిద్దుతున్నారు. మిరోస్లావ్ బోజెక్ ఫొటోగ్రఫీ ‘పుష్ప’కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. చిత్ర నిర్మాణంలో అద్భుతమైన సహకారం అందించిన నిర్మాతలు రవి శంకర్, నవీన్ యేర్నేని, సతీష్, ప్రవీణ్ గారికి నా ధన్యవాదాలు’’ అని అన్నారు.
ముత్తంశెట్టి మీడియా కృష్ణ మాట్లాడుతూ ‘‘2021లో ‘పుష్ప’ బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుంది’’ అన్నారు.
మెత్రీ మూవీ మేకర్స్ రవి మాట్లాడుతూ‘‘‘పుష్ప’ షూటింగ్‌ను ప్రతికూల పరిస్థితుల్లోనూ కష్టపడి చేశారు. ఆ శ్రమను టీజర్లో చూశారు. ఈ చిత్రాన్ని తీర్చిదిద్దిన సుకుమార్ గారికి థ్యాంక్స్. టీజర్‌లో అర్జున్ గారి పాత్రను ఒక్క నిమిషం చూశారు. సినిమాలో మూడు గంటల పాటు ఇలానే ఆకట్టుకునేలా ఉంటుంది’’ అని చెప్పారు.
అల్లు శిరీష్ మాట్లాడుతూ ‘‘పుష్ప’ టీజర్ చూస్తుంటే ఒక ఫ్యాన్‌గా సూపర్బ్‌గా అనిపించింది. నా కంటూ ఓ స్థాయి వచ్చాక మా అన్నగురించి మాట్లాడతాను. అప్పటివరకూ మౌనంగానే ఉంటాను’’ అని అన్నారు.