ప్రకాశ్, విష్ణుల పోటీని స్వాగతిస్తున్నా: వీకే నరేష్
ABN , First Publish Date - 2021-06-23T00:26:50+05:30 IST
తెలుగు సినిమా పరిశ్రమ మరోసారి ఎన్నికల పేరుతో వేడెక్కుతోంది. మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ అధ్యక్ష ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. అప్పట్లో జయసుధ, రాజేంద్రప్రసాద్‌లు పోటీగా చేసినప్పుడు ఎటువంటి ఆసక్తికరమైన ఘటనలు

తెలుగు సినిమా పరిశ్రమ మరోసారి ఎన్నికల పేరుతో వేడెక్కుతోంది. మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ అధ్యక్ష ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. అప్పట్లో జయసుధ, రాజేంద్రప్రసాద్‌లు పోటీగా చేసినప్పుడు ఎటువంటి ఆసక్తికరమైన ఘటనలు చోటు చేసుకున్నాయో తెలియంది కాదు. అలాంటి ఫైట్ మరోసారి ఈ సెప్టెంబర్‌లో జరిగే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది. సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ ఈ ఎన్నికల బరిలో దిగుతున్నానని ప్రకటించగా.. మరోవైపు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ ఫ్యామిలీలలో ఒకటిగా చెప్పుకునే మంచు ఫ్యామిలీ నుంచి విష్ణు పోటీకి దిగుతున్నట్లుగా సోమవారం ప్రకటించారు. దీంతో ఇండస్ట్రీ అంతా.. 'మా' ఎన్నికల గురించే మాట్లాడుకుంటున్నారంటే.. ఈసారి పోటీ ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. 'మా' బరిలో దిగేందుకు సిద్ధమవుతోన్న పోటీదారుల గురించి ప్రస్తుత 'మా' అధ్యక్షుడు వీకే నరేష్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో ముచ్చటించారు. ప్రకాశ్ రాజ్, మంచు విష్ణుల పోటీని స్వాగతిస్తున్నట్లుగా ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా వీకే నరేష్ మాట్లాడుతూ..
''విష్ణు పోటీ చేస్తున్నాడంటే.. నేను స్వాగతిస్తున్నాను. ఎందుకంటే.. అతనిది యువరక్తం, ఇండస్ట్రీలో పెరిగిన బిడ్డ. ఇండస్ట్రీలో ఇబ్బందులు ఏంటి?.. ఆర్టిస్ట్‌ల కష్టాలేంటి?.. అనేవి తెలిసిన ఫ్యామిలీ నుంచి ఓ ఆర్టిస్ట్‌గా వచ్చాడు. అలాగే మోహన్‌బాబుగారి ఫ్యామిలీ కష్టనష్టాలు చూడకుండా దాదాపు 50కి పైగా సినిమాలు నిర్మించింది. తద్వారా ఎంతో మందికి అన్నం పెట్టారు. కాబట్టి ఈ కుటుంబం నుంచి యువరక్తం కలిగిన వ్యక్తి వస్తే.. ఓ మార్పు వస్తుందని మా నమ్మకం. కాబట్టి నేను స్వాగతిస్తున్నాను. ప్రకాశ్ విషయానికి వస్తే.. అతను నాకు మంచి స్నేహితుడు. కష్టసుఖాలు తెలిసిన మనిషి. సహాయగుణం కలిగిన వ్యక్తి. అతను 'మా' అధ్యక్షుడిగా పోటీ చేసినా స్వాగతిస్తాను".. అని తెలిపారు.
