‘వివాహ భోజనంబు’ ట్రైలర్: కరోనా కష్టాల్లో నవ్వులు
ABN , First Publish Date - 2021-08-05T01:33:08+05:30 IST
తక్కువ ఖర్చుతో పెళ్లి చేసుకోవాలని చూసిన పిసినారి పెళ్లి కొడుక్కి లాక్‌డౌన్ పిడుగుపాటులా మీద పడుతుంది. పెళ్లికి వచ్చిన బంధువులంతా ఇంట్లోనే 21 రోజుల పాటు ఉండిపోవాల్సి వస్తుంది. అసలే పిసినారి అయిన

కమెడియన్ సత్య హీరోగా, అర్జావీ రాజ్ హీరోయిన్‌గా వెంకటాద్రి టాకీస్ సమర్పణలో ఆనంది ఆర్ట్స్, సోల్జర్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై కేఎస్ శినీష్, సందీప్ కిషన్ నిర్మించిన చిత్రం ‘వివాహ భోజనంబు’. యంగ్ హీరో సందీప్ కిషన్ ఓ వైవిధ్య పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి రామ్ అబ్బరాజు దర్శకుడు. ఈ చిత్రం త్వరలోనే ‘సోని లివ్’ ఓటీటీలో విడుదలకానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. కరోనా సమయంలో పెళ్లి చేసుకున్న ఓ పిసినారి యువకుడి కథను వినోదాత్మకంగా ఈ చిత్రంలో చూపించినట్లుగా ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది.
ట్రైలర్ విషయానికి వస్తే.. తక్కువ ఖర్చుతో పెళ్లి చేసుకోవాలని చూసిన పిసినారి పెళ్లి కొడుక్కి లాక్‌డౌన్ పిడుగుపాటులా మీద పడుతుంది. పెళ్లికి వచ్చిన బంధువులంతా ఇంట్లోనే 21 రోజుల పాటు ఉండిపోవాల్సి వస్తుంది. అసలే పిసినారి అయిన కథానాయకుడు వాళ్లకు పెట్టే ఖర్చులు తట్టుకోలేకపోతాడు. క్రికెట్ టీమ్‌లా ఇంట్లో ఉండిపోయిన ఈ బంధువులను వదిలించుకోలేక అతను పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. కాగా, సోని లివ్ ఓటీటీలో విడుదల కాబోతోన్న మొట్టమొదటి తెలుగు చిత్రం ఇదే కావడం విశేషం.