ఈ బొమ్మ హిట్టమ్మా!
ABN, First Publish Date - 2021-12-30T06:07:41+05:30
కొత్తదనాన్ని ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తుంటారు. ఇది ఎన్నోసార్లు ఫ్రూవ్ అయింది కూడా. కొత్త తరహా కథ, సరికొత్త నేపథ్యం.. వీటికి అగ్ర హీరో తోడయితే బాక్సాఫీసు దగ్గర సునామీ...
కొత్తదనాన్ని ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తుంటారు. ఇది ఎన్నోసార్లు ఫ్రూవ్ అయింది కూడా. కొత్త తరహా కథ, సరికొత్త నేపథ్యం.. వీటికి అగ్ర హీరో తోడయితే బాక్సాఫీసు దగ్గర సునామీ సృష్టించవచ్చని 2021 సంవత్సరం నిరూపించింది. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ అంటూ కరోనా భయపెట్టినా కొత్త నేపథ్యంలో కథాబలం ఉన్న ప్రతి చిత్రాన్నీ ప్రేక్షకులు థియేటర్‌కు వచ్చి చూశారు. ఇక అగ్రహీరోలు నటించిన చిత్రాల విషయం చెప్పనక్కర్లేదు. హిట్టు మీద హిట్టు తో తెలుగు సినిమాకు జోష్ తెచ్చిన హీరోలు, వాళ్ల చిత్రాలు....
బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ ఈ ఏడాది ఒకే ఒక చిత్రం ‘అఖండ’లో నటించారు. సీనియర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా మే 28న ఈ సినిమాను మొదట విడుదల చేయాలనుకున్నారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా పడింది. చివరకు డిసెంబర్ 2న రిలీజ్ చేశారు. రిలీజ్ డేట్ మారినా మంచి కథ, సరయిన దర్శకుడు కుదిరితే బాక్సాఫీసు దగ్గర బాలకృష్ణ ప్రభంజనం సృష్టిస్తారని ఈ చిత్రం మరోసారి నిరూపించింది. బాలకృష్ణతో ఎలాంటి సినిమా తీయాలో, ఆయన్ని తెరపై ఎలా చూపించాలో బాగా తెలిసిన దర్శకుడు బోయపాటి శ్రీను ఈ చిత్రానికి తోడవడంతో ‘అఖండ’ సరికొత్త రికార్డులకు తెర తీసింది. ఈ సినిమాతో బాలకృష్ణ, బోయపాటి శ్రీను హ్యాట్రిక్ హిట్ సాధించారు. కష్టకాలంలో ఉన్న తెలుగు చిత్రపరిశ్రమకు ‘అఖండ’ విజయం కొత్త ఊపిరినిచ్చింది. థియేటర్లకు కొత్త వెలుగు తెచ్చింది.
వెంకటేశ్
విక్టరీ వెంకటేశ్ ఈ ఏడాది రెండు చిత్రాల్లో నటించారు. ఒకటి ‘నారప్ప’. రెండోది ‘దృశ్యం 2’. ఇవి రెండూ ఓటీటీలో విడుదల కావడం విశేషం. ఒక అగ్ర హీరో నటించిన తెలుగు చిత్రం ఓటీటీలో విడుదల కావడం అదే ప్రథమం. సినిమాను థియేటర్లలో విడుదల చేయకుండా ఓటీటీకి ఇవ్వడంపై నిర్మాత సురేశ్‌బాబు కొన్ని విమర్శలు ఎదుర్కొన్నారు కూడా . తమిళంలో ధనుష్ నటించిన ‘అసురన్’ చిత్రానికి ఇది రీమేక్.
ఇక వెంకటేశ్ నటించిన మరో చిత్రం ‘దృశ్యం 2’. మలయాళ చిత్రం ‘దృశ్యం 2’ కు ఇది రీమేక్ వెర్షన్. మలయాళ చిత్రం కూడా ఓటీటీలో రిలీజ్ అయింది. అందుకే మొదటి నుంచీ తెలుగు ‘దృశ్యం 2’ కూడా ఓటీటీలో విడుదలవుతుందని ప్రచారం జరిగింది. చివరకు అదే నిజమైంది కూడా. తమ అభిమాన హీరో నటించిన రెండు చిత్రాలు ఇలా థియేటర్లలో సందడి చేయకుండా ఓటీటీలో రిలీజ్ కావడంతో వెంకటేశ్ అభిమానులు కొంత నిరాశకు గురయ్యారు. అయితే వెంకటేశ్, వరుణ్‌తేజ్ నటిస్తున్న మరో సీక్వెల్ చిత్రం ‘ఎఫ్ 3’ మాత్రం థియేటర్లలోనే విడుదలవుతుందని నిర్మాతలు చెబుతున్నారు.
పవన్‌కల్యాణ్
కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో విడుదలైన చిత్రం ‘వకీల్ సాబ్’. హిందీలో హిట్ అయిన ‘పింక్’ చిత్రానికి ఇది రీమేక్. రాజకీయాల కారణంగా కొంత కాలం సినిమాలకు దూరమైన పవన్‌కల్యాణ్ మళ్లీ ఎంట్రీ ఇవ్వడంతో ‘వకీల్ సాబ్’ సినిమా మీద మొదటి నుంచీ భారీ అంచనాలు ఉన్నాయి. కరోనా కారణంగా థియేటర్లకు రావడానికి భయపడుతున్న జనాన్ని రప్పించి, తన స్టామినా ఏమిటో నిరూపించారు పవన్‌కల్యాణ్. ఇందులో లాయర్‌గా పవన్‌కల్యాణ్ అభినయం ఆయన అభిమానుల్నే కాదు అందరినీ ఆకట్టుకుంది. ఆయన నటిస్తున్న మరో రీమేక్ చిత్రం ‘భీమ్లా నాయక్’ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల కానుంది.
అల్లు అర్జున్
అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా ఫిల్మ్ ‘పుష్ప’. దర్శకుడు సుకుమార్ రూపొందించిన ఈ చిత్రానికి మొదట మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయితే దానికి అతీతంగా కలెక్షన్లు ఉండడం విశేషం. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల వ్యవహారం ‘పుష్ప’ వసూళ్ల మీద కొంత ప్రభావం చూపినా, పాన్ ఇండియా ఫిల్మ్ కావడం బాగా కలిసొచ్చింది. అనువాద చిత్రాల ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులకు ఇప్పటికే దగ్గరైన అల్లు అర్జున్ ‘పుష్ప’ చిత్రంతో వారిని డైరెక్ట్‌గా వారిని పలకరించారు. ఆయన నటన, చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలు అందర్నీ అలరిస్తున్నాయి.
రవితేజ
కరోనాతో తెలుగు చిత్రపరిశ్రమ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన ‘క్రాక్’ చిత్రం విజయం సాధించి, అందరికీ కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. రవితేజ పోలీస్ ఆఫీసర్‌గా నటించిన ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. ఇంతవరకూ వచ్చిన పోలీస్ కథలకు భిన్నంగా రూపుదిద్దుకొన్న ఈ చిత్రం మాస్ ఆడియన్స్‌కు తెగ నచ్చేసింది.
నాని
వరుసగా రెండు చిత్రాలు ఓటీటీలో విడుదల కావడంతో ఈ సారి ఎలాగైనా థియేటర్లలోనే తన సినిమాను విడుదల చేయాలనే పట్టుదలతో హీరో నాని ‘శ్యామ్ సింగరాయ్’గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం మంచి విజయం సాధించింది. రెండు విభిన్న పాత్రలు పోషించిన నానికి ఆర్టిస్ట్‌గా మంచి పేరు తెచ్చింది.