వారిద్దరే కథను బాగా నమ్మారు
ABN , First Publish Date - 2021-03-26T05:44:21+05:30 IST
‘‘ఈ కథను నా కన్నా నితిన్, కీర్తి బాగా నమ్మారు. అర్జున్, అను పాత్రల్లో లీనమై నటించారు. వారిద్దరి నటనతోపాటు పీసీ శ్రీరామ్ ఫొటోగ్రఫీ సినిమాకు...
‘‘ఈ కథను నా కన్నా నితిన్, కీర్తి బాగా నమ్మారు. అర్జున్, అను పాత్రల్లో లీనమై నటించారు. వారిద్దరి నటనతోపాటు పీసీ శ్రీరామ్ ఫొటోగ్రఫీ సినిమాకు ఎసెట్ అవుతుంది’’ అని వెంకీ అట్లూరి అన్నారు. నితిన్, కీర్తి సురేశ్ జంటగా ఆయన దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ‘రంగ్‌దే’ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు విలేకర్లతో మాట్లాడారు.
‘మిస్టర్ మజ్ను’ తర్వాత క్యూట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చేయాలనిపించింది. పక్క పక్కనే ఉండే రెండు కుటుంబాల కథ ఇది. ఇరుగుపొరుగు ఇళ్లల్లో ఉండే ఓ అబ్బాయి, అమ్మాయి మధ్య వ్యవహారం పెళ్లిదాకా వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయన్నది సినిమా ఇతివృత్తం. కడుపుబ్బ నవ్వించే హాస్య సన్నివేశాలతో పాటు, మనసుని తట్టే భావోద్వేగాలు ఉన్నాయి. ఇంద్రధనస్సులోని ఏడు రంగుల్లాగా ఇందులో భావోద్వేగాలుంటాయి. నితిన్ సింగిల్ సిట్టింగ్‌లో అంగీకరించాడు. పీసీ శ్రీరామ్ గారితో పని చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఆయన సపోర్ట్ వల్ల 64 రోజుల్లో సినిమా పూర్తి చేశాం. సంగీతం విషయానికొస్తే.. ఈ సినిమాకు ఏం కావాలో అది దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చారు. సినిమాకు పాటలు ఒకెత్తు అయితే.. నేపథ్య సంగీతం మరో ఎత్తు. గేయ రచయిత శ్రీమణిని వదులుకోవాలన్నా మేం ఇద్దరం ఒకర్నొకరం వదులుకోలేం. కొవిడ్ టైమ్‌లో సితారా సంస్థ ఇచ్చిన సపోర్ట్ మరువలేనిది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, దిల్ రాజు బ్యానర్ కలిసి నా తదుపరి చిత్రాన్ని నిర్మించబోతున్నాయి. అది లవ్ స్టోరీ కాదు. వేరే తరహా సినిమా’’ అన్నారు.