పదేళ్లకు సరిపడా కథలున్నాయి!
ABN , First Publish Date - 2021-09-13T05:49:08+05:30 IST
‘‘గోపీచంద్ గారు, నేనూ సరైన విజయం కోసం ఎదురు చూస్తున్నాం. ఇప్పుడీ ‘సీటీ మార్’కు వస్తున్న వసూళ్లు చూస్తే... మా ఇద్దరికీ కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రం అవుతుందనిపిస్తోంది....
‘‘గోపీచంద్ గారు, నేనూ సరైన విజయం కోసం ఎదురు చూస్తున్నాం. ఇప్పుడీ ‘సీటీ మార్’కు వస్తున్న వసూళ్లు చూస్తే... మా ఇద్దరికీ కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రం అవుతుందనిపిస్తోంది. ఉత్తరాదిలోనూ మంచి వసూళ్లు వస్తున్నాయి. ‘కరోనా తర్వాత ఏ చిత్రానికీ ఈ స్థాయిలో ఆరంభవసూళ్లు చూడలేదు. మీ చిత్రంతో మళ్లీ థియేటర్లకు ఊపు వ చ్చింది’ అని చిత్ర ప్రముఖులు చెబుతున్నారు. పదేళ్లలో నాకు దక్కిన పెద్ద విజయమిది’’ అని సంపత్ నంది అన్నారు. గోపీచంద్ హీరోగా ఆయన దర్శకత్వంలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన చిత్రం ‘సీటీమార్’. వినాయక చవితికి థియేటర్లలో విడుదలైంది. తమ చిత్రానికి లభిస్తోన్న ప్రేక్షకాదరణ అమితానందాన్ని ఇస్తోందని సంపత్ నంది సంతోషం వ్యక్తం చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘కబడ్డీ లాంటి మాస్ గేమ్‌కు వాణిజ్య అంశాలు జోడిస్తే ప్రేక్షకులకు నచ్చుతుందని భావించా. నా నమ్మకం నిజమైంది. చాలా రోజుల తర్వాత సీ సెంటర్ ప్రేక్షకులను సైతం థియేటర్లకు రప్పించడంలో ‘సీటీమార్’ సక్సెస్ అయింది. అన్ని చోట్లా థియేటర్లు హౌస్‌ఫుల్ అవుతున్నాయి. ముఖ్యంగా పతాక సన్నివేశాలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రత్యేకించి డైలాగ్‌లకు మంచి ప్రశంసలు వచ్చాయి. ఈ విజయంతో గోపిచంద్ అభిమానుల దాహం తీరిందని చెప్పడం, ప్రభాస్‌గారు సినిమా విజయం గురించి పోస్ట్ చేయడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. ఆయన ఇచ్చిన ప్రోత్సాహం, మద్దతుకు థాంక్యూ’’ అని చెప్పారు. తదుపరి చిత్రాల గురించి ఆయన మాట్లాడుతూ ‘‘ప్రస్తుతం రెండు కథలు సిద్ధం చేశాను. కథల పరంగా నాకు కంగారు లేదు. నా దగ్గర పదేళ్లకు సరిపడా కథలు ఉన్నాయి. నాకెప్పుడూ మాస్ సినిమాలు తీయడమే ఇష్టం. నా సహచరులకు అవకాశం కల్పించాలనే నిర్మాణంలోకి అడుగుపెట్టా. ఫలితం పక్కనపెడితే అవకాశాలు ఇచ్చాననే తృప్తి ఉంది’’ అన్నారు.