థియేటరా? ఓటీటీనా?.. ప్రక్షాళన జరగాల్సిందే

ABN , First Publish Date - 2021-02-02T04:55:21+05:30 IST

కరోనా అన్‌లాక్‌ తర్వాత తెరుచుకున్న థియేటర్లలో సినిమాలు సందడి చేసేందుకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 50 శాతం కెపాసిటీతో రన్‌ అవుతున్న

థియేటరా? ఓటీటీనా?.. ప్రక్షాళన జరగాల్సిందే

కరోనా అన్‌లాక్‌ తర్వాత తెరుచుకున్న థియేటర్లలో సినిమాలు సందడి చేసేందుకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 50 శాతం కెపాసిటీతో రన్‌ అవుతున్న థియేటర్లలోకి వచ్చి కొన్ని సినిమాలు సందడి చేశాయి. కేంద్రం రీసెంట్‌గా 100శాతం కెపాసిటీతో థియేటర్లు రన్‌ చేసుకోవచ్చని అనుమతులు ఇచ్చిన తరుణంలో.. సినిమా వాళ్లంతా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే థియేటర్లు తెరుచుకున్నా కూడా ఓటీటీలు మాత్రం తమ హవాని ప్రదర్శిస్తూనే ఉన్నాయి. 


ముఖ్యంగా తమిళనాడులో సూర్య నటించిన 'ఆకాశం నీ హద్దురా..' డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. సూర్య వంటి స్టార్‌ హీరో చిత్రం ఓటీటీ బాట పట్టడంతో థియేటర్‌ అప్పట్లో యాజమాన్యాలు వ్యతిరేకించాయి. అయినా సరే.. సూర్య మాత్రం వెనక్కి తగ్గలేదు. ఆ తర్వాత థియేటర్లు తెరుచుకున్నా కూడా.. ఓటీటీలకు ప్రేక్షకులు అలవాటు పడ్డారని భావించిన నిర్మాతలు తమ చిత్రాలను థియేటర్లతో పాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో విడుదల చేసేందుకు అగ్రిమెంట్‌లు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు సినిమా విడుదలైన 50 రోజుల తర్వాత డిజిటల్‌గా ప్రదర్శించాలనే రూల్‌ను కూడా పక్కన పెట్టి.. రెండు మూడు వారాల్లోనే ఓటీటీలో ప్రదర్శించేందుకు నిర్మాతలు అంగీకారం తెలుపుతుండటం విశేషం.


స్టార్‌ హీరోల సినిమాలైన 'మాస్టర్‌', 'క్రాక్‌' చిత్రాలే ఇందుకు ఉదాహరణ. సంక్రాంతికి రిలీజ్‌ అయిన ఈ చిత్రాల్లో ఇప్పటికే 'మాస్టర్‌' చిత్రం ఓటీటీలో విడుదలవగా.. 'క్రాక్‌' చిత్రం ఫిబ్రవరి 5న ఓటీటీలో విడుదల కాబోతోంది. ఈ రెండు సినిమాలు థియేటర్లలో బాగా రన్‌ అవుతున్నా.. ఓటీటీలో విడుదల చేయడాన్ని కొందరు బిగ్‌స్ర్కీన్‌ ప్రేమికులు వ్యతిరేకిస్తుంటే.. నిర్మాతలు మాత్రం అగ్రిమెంట్‌కు కట్టుబడాల్సిన పరిస్థితులు ఏర్పడినట్లుగా టాక్‌ నడుస్తోంది. 


అయితే 'క్రాక్‌'తో పోల్చుకుంటే 'మాస్టర్‌' చిత్రం మరీ దారుణమనే చెప్పాలి. 'క్రాక్‌' చిత్రాన్ని డిజిటల్‌గా విడుదల చేసేందుకు రైట్స్‌ తీసుకున్న నిర్మాత అల్లు అరవింద్‌, విచక్షణతో ఆలోచించి అగ్రిమెంట్‌ను కూడా పక్కనెట్టి.. కొన్ని రోజుల పాటు ఓటీటీ విడుదలను వాయిదా వేశారు. బిగ్‌ స్ర్కీన్‌ మీద సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతున్న చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయడం ఇష్టం లేకే పెద్దమనసు చేసుకుని ఆయన కొన్ని రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లుగా.. స్వయంగా ఓ ప్రెస్‌ నోట్‌ని విడుదల చేయడం విశేషం. ఆయన కూడా పెద్ద నిర్మాత కాబట్టి.. ఓ నిర్మాత కష్టాలు ఎలా ఉంటాయనేది తెలిసిన వ్యక్తి కాబట్టి.. అల్లు అరవింద్‌ ఈ విషయంలో తన గొప్ప మనసు చాటుకున్నారు.


కాకపోతే ఒక చిత్రం ఓటీటీలో వచ్చేస్తుంది అని తెలిశాక.. థియేటర్లకు ప్రేక్షకులు వచ్చే పరిస్థితి ఉంటుందా? అనేది ఒక్కసారి నిర్మాతలు ఆలోచించుకోవాలి. 'మాస్టర్‌' చిత్రం ఓటీటీలో విడుదలయ్యాక.. థియేటర్లలో టికెట్‌ కొనేవారే కరువైనట్లుగా కోలీవుడ్‌ వర్గాలు పేర్కొంటున్న తరుణంలో.. దాదాపు 'క్రాక్‌' పరిస్థితి కూడా అలాగే ఉంది. అయితే ఈ విషయంలో నిర్మాతలు సరైన నిర్ణయం తీసుకోకపోతే మాత్రం థియేటర్లకు అనుమతి వచ్చినా ఉపయోగం లేనట్లే. ఓటీటీనా? థియేటరా? అంటే సినిమా ప్రేమికులు ఖచ్చితంగా థియేటరే అని అంటారు. 


ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నిర్మాతలు కూడా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు ప్రయత్నించాలి. కరోనా టైమ్‌లో ఎలాగూ ఓటీటీలను ప్రోత్సహించారు కాబట్టి.. ఇప్పుడు థియేటర్‌ వ్యవస్థను రక్షించుకునే ప్రయత్నం చేయకపోతే.. ముందు ముందు థియేటర్లలో సినిమా ఒక వారం మాత్రమే అనేలా మారిపోతుంది. సో.. దీనిపై సరైన మార్గదర్శకాలు అవసరం. ఆ దిశగా నిర్మాతలు అడుగులు వేస్తారేమో చూద్దాం.

Updated Date - 2021-02-02T04:55:21+05:30 IST