మునిగేది నిర్మాతలే

ABN , First Publish Date - 2021-12-30T06:04:18+05:30 IST

‘‘ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సినిమా టికెట్‌ ధరలను తగ్గించడం నా దృష్టిలో పూర్తిగా తప్పు. ఉత్పత్తిదారులకి తమ ఉత్పత్తి ధరను నిర్ణయించుకునే హక్కు ఉంది...

మునిగేది నిర్మాతలే

‘‘ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సినిమా టికెట్‌ ధరలను తగ్గించడం నా దృష్టిలో పూర్తిగా తప్పు. ఉత్పత్తిదారులకి తమ ఉత్పత్తి ధరను నిర్ణయించుకునే హక్కు ఉంది. కొనాలా వద్దా అనే విచక్షణ వినియోగదారుడిదే. సినిమా నచ్చితే చూస్తారు. లేదంటే మానేస్తారు. మారుతీ కారు ధరకే బెంజ్‌కారు ఇవ్వాలంటే ఎలా కుదురుతుంది. ఇదంతా ఏపీ ప్రభుత్వం ఇండస్ట్రీపై కక్షతో చేస్తుందా లేదా అనేది నాకు తెలియదు. కానీ ఇలా చేయడం వల్ల హీరోలకు వచ్చిన నష్టమేం లేదు. టికెట్‌ ధర తగ్గినంత మాత్రాన హీరోల పారితోషికం తగ్గుతుందనేది భ్రమే. దీనివల్ల అంతిమంగా మునిగేది నిర్మాతలే’’ అన్నారు రామ్‌గోపాల్‌ వర్మ. ఆయన పర్యవేక్షణలో దర్శకుడు ఆనంద్‌ చంద్ర రూపొందించిన ‘ఆర్జీవీ ఆశ ఎన్‌కౌంటర్‌’ చిత్రం జన వరి 1న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా సినిమా గురించి ఆయన మాట్లాడుతూ... ‘అత్యాచారాలకు పాల్పడిన వ్యక్తులను చట్టపరంగా శిక్షించడం మాత్రమే పరిష్కారం కాదు. సమస్య మూలాల్లోకి వెళ్లి పరిష్కరించాలి. ఏ పరిస్థితుల్లో మగాళ్లు మృగాళ్లుగా మారి మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు, ఆ పరిస్థితుల వెనుక ఉన్న నేపథ్యం ఎలాంటిది అనేది కూలంకషంగా ఈ సినిమాలో చర్చించాం’ అన్నారు. ‘‘ఒక వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడంటే దానికి చాలా కారణాలు ఉంటాయి. సమాజంలో వందల ఏళ్లుగా ఉన్న పితృస్వామ్య వ్యవస్థ ప్రభావం మహిళలను చులకనగా చూడడం సమాజంలో బలంగా నాటుకొంది. అత్యాచారం చేయడానికి ముందు, చేసేటప్పుడు, అనంతరం ఆ వ్యక్తుల మానసిక స్థితి ఎలా ఉందనేది నేను చాలా ఎక్కువగా స్టడీ చేశాను. అత్యాచారం చేయడానికి ముందు వారంతా మనందరి లాంటి మనుషులే. ఆ కొన్ని క్షణాల్లోనే వారిని నరరూప రాక్షసులుగా మార్చి ఎన్‌కౌంటర్‌ చేయాలనేంతగా ప్రజల్లో ఏహ్యతను తెచ్చిన ఘటనను కొత్త కోణంలో తెరపై ఆవిష్కరించాం’’ అని చెప్పారు. 


Updated Date - 2021-12-30T06:04:18+05:30 IST