అసలు సిసలు ‘రైతుబిడ్డ’ నేడు యన్టీఆర్‌ 25వ వర్థంతి

ABN , First Publish Date - 2021-01-18T10:45:57+05:30 IST

రైతుబిడ్డగా జన్మించిన నందమూరి తారక రామారావు తన చిత్రాలలో రైతుల బాగోగులు, వారి సమస్యలు, వాటికి తగ్గ పరిష్కారాలూ చర్చిస్తూ సాగారు...

అసలు సిసలు ‘రైతుబిడ్డ’ నేడు యన్టీఆర్‌ 25వ వర్థంతి

రైతుబిడ్డగా జన్మించిన నందమూరి తారక రామారావు తన చిత్రాలలో రైతుల బాగోగులు, వారి సమస్యలు, వాటికి తగ్గ పరిష్కారాలూ చర్చిస్తూ సాగారు. రాజకీయాలలోనూ అనితర సాధ్యమైన రైతాంగ అనుకూల విధానాలను అమలు చేశారు. ప్రస్తుతం దేశంలో రైతు ఆందోళనలు సాగుతున్నాయి. వ్యవసాయరంగంలో కేంద్రప్రభుత్వం చేపట్టిన నవీన కార్పోరేటీకరణ విధానాలను దేశంలోని అధిక సంఖ్యాక రైతులు వ్యతిరేకిస్తున్నారు. చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తన చిత్రాల ద్వారానే కాకుండా, తన పరిపాలనలోనూ రైతుల సంక్షేమం కోసం తపించిన తారకరాముని మననం చేసుకోవడం సమంజసం. తాను నటించిన చిత్రాలలో ఐదోవంతు (20 శాతం) సినిమాలను యన్టీఆర్‌ రైతు నేపథ్యం, గ్రామీణ నేపథ్యం ఉన్న కథలతోనే నటించారు. తెలుగునాట అంతలా రైతు కుటుంబాల కథలతో సాగిన కథానాయకుడు మరొకరు కానరారు. తన సాంఘికాలలోనే కాదు పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాలలోనూ సందర్భానుసారంగా రైతును గుర్తు చేసుకున్నదీ రామారావు ఒక్కరే!


మచ్చుకు కొన్ని... 

రైతు కుటుంబం నేపథ్యంలో ఉన్న చిత్రాలలోనే నటించడమే కాదు కొన్ని సినిమాల్లో అదే పనిగా రైతుల సంక్షేమం కోసం కథలు రూపొందించిన సందర్భాలూ ఉన్నాయి. ‘దున్నేవాడిదే భూమి...’ నినాద కాలం నుండి ‘సమష్టి వ్యవసాయ’ విధానాల కాలం వరకు రైతు జీవనంలో వచ్చిన పరిణామాలన్నిటినీ తన చిత్రాల ద్వారా సందేశాత్మకంగా జనానికి చేరువ చేశారు. ఇలా సాగిన నటుడు దేశంలో మరొకరు కనిపించరు. ఈ నాటికీ తెలుగునేలపై సినిమాల్లోని రైతుల పాటలూ అంటే అన్న తారకరామునివే ముందుగా గుర్తుకు రాకమానవు. ‘‘ఎవడిదిరా ఈ భూమి... ఎవ్వడురా భూస్వామి.. దున్నవాడిదే భూమి...’’ (మనుషులంతా ఒక్కటే), ‘దేశమంటే మట్టికాదోయ్‌... ‘‘(చండశాసనుడు)... ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన సాంఘిక చిత్రాలలో బోలెడు రైతు పాటలు దర్శనమిస్తాయి. ‘లవకుశ’లో రామన్న రాజ్యం గురించి చర్చిస్తూ ‘‘నెలమూడు వానలూ కురిసేనురా... బంగారు పంటలూ పండేనురా...’’ అంటూ పాట సాగుతుంది. జానపద చిత్రాల్లోనూ ‘‘ఎండా వానా గాలి వెన్నెల ఏమన్నాయిరా...’’ (కదలడు-వదలడు) లాంటి పాటలతో పరవశింప చేశారు. చారిత్రక చిత్రం ‘బ్రహ్మంగారి చరిత్ర’లోనూ ‘‘రైతే వెన్నెముక అన్న దేశాన... ఆ రైతుకే గోరీ కడతారు...’’ అన్న భవిష్యవాణి వినిపించడమూ యన్టీఆర్‌ రైతుబంధాన్ని తెలియజేస్తుంది. ఇలా తాను నటించిన పలు చిత్రాలలో రైతులను మననం చేసుకున్నారు. ‘సమష్టి వ్యవసాయం’ గురించీ ‘కుటుంబ గౌరవం, విశాల హృదయాలు, రైతుబిడ్డ’ వంటి చిత్రాలలో చర్చించారు. తాను ఎంచుకొనే రైతు కథలలో, రైతుల సమకాలీన సమస్యలు, వాటికి పరిష్కారాలు ఉంటే రామారావు ఇట్టే సదరు సినిమాలకు కాల్‌ షీట్స్‌ ఇచ్చేవారని ప్రతీతి. 


సదా స్మరామి... 

రాజకీయ ప్రవేశంలోనూ యన్టీఆర్‌ రైతులకు పెద్ద పీట వేశారు. ఆయన అధికారంలోకి రాగానే రైతులకు వాగ్దానం చేసిన అనేక అంశాలనూ అమలు చేశారు. రామ రాజ్యంలోలాగా నెలమూడు పంటలు పండే పరిస్థితులు ఇప్పట్లో లేవు. కానీ, రెండు కార్లు పండటానికి తగిన చర్యలు అభినవ రామన్న రాజ్యంలో చోటు చేసుకున్నాయని చెప్పవచ్చు. రైతాంగానికి ఎంతో మేలు చేసిన ‘సింగిల్‌ విండో విధానం’, పట్టాదారు పాసుపుస్తకాల వ్యవస్థ, మండల వ్యవస్థ, హార్స్‌ పవర్‌ రూ. 50కే విధానం ద్వారా ఉచిత కరెంట్‌ సరఫరా వంటి విప్లవాత్మక రైతు అనుకూల విధానాలన్నీ దేశం మొత్తంలోనూ మొదటగా ఒక్క యన్టీఆరే ప్రారంభించారు. సహకార బ్యాంకింగ్‌ రంగంలో యన్టీఆర్‌ కాలం స్వర్ణయుగం అనే విషయం అందరికీ తెలిసిందే! పాడిపరిశ్రమకు చెందిన డైరీ రంగంలో కూడా విశేషాభివృద్థి అన్న పాలనాకాలంలోనే సాగింది. యన్టీఆర్‌ రైతు సంక్షేమం కోసం అనుసరించిన ఈ విధానాలనే తరువాత దేశమంతటా అనుసరించడం గమనార్హం! ‘కరోనా నిర్మూలన వ్యాక్సిన్‌’ పంపిణీ సమయంలో తెలుగు మహాకవి గురజాడను గుర్తు చేసుకున్న ప్రధాని మోదీ, రైతుల విషయంలో అన్న యన్టీఆర్‌ను మననం చేసుకొని తగిన పరిష్కారం చూపిస్తారని ఆశిద్దాం.

కొమ్మినేని వెంకటేశ్వరరావు


Updated Date - 2021-01-18T10:45:57+05:30 IST