మనసును హత్తుకునేది మెలోడీయే!
ABN , First Publish Date - 2021-08-10T09:33:18+05:30 IST
‘‘ప్రతి స్వరకర్తకు ఓ శైలి ఉంటుంది. కొత్తగా వచ్చే సంగీత దర్శకుల పాటలను ప్రేక్షకులు ఆదరించడమనేది ముఖ్యం. నా విషయంలో తొలి చిత్రం నుంచి ఇప్పటివరకూ ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన లభించడం...
‘‘ప్రతి స్వరకర్తకు ఓ శైలి ఉంటుంది. కొత్తగా వచ్చే సంగీత దర్శకుల పాటలను ప్రేక్షకులు ఆదరించడమనేది ముఖ్యం. నా విషయంలో తొలి చిత్రం నుంచి ఇప్పటివరకూ ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన లభించడం హ్యాపీగా ఉంది’’ అని చైతన్ భరద్వాజ్ చెప్పారు. ఆయన సంగీతమందించిన ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ ఇటీవల విడుదలైంది. పాటలకు, నేపథ్య సంగీతానికి చక్కటి ప్రశంసలు లభిస్తున్నాయని చైతన్ భరద్వాజ్ సంతోషం వ్యక్తం చేశారు. ‘ఆర్ఎక్స్ 100’, ‘సెవెన్’, ‘గుణ 369’, ‘మన్మథుడు 2’కు ఆయన పని చేశారు. త్వరలో రానున్న ‘మహా సముద్రం’ చిత్రానికీ ఆయనే సంగీత దర్శకుడు. ఈ సందర్భంగా చైతన్ భరద్వాజ్ చెప్పిన సంగతులివీ...
‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ థియేటర్లలోకి రావడానికి కంటే చాలారోజుల ముందే పాటలు విడుదలయ్యాయి. నన్నో కొత్త స్వరకర్తగా చూడలేదు. ప్రతి పాటను శ్రోతలు బాగా ఆదరించారు. థియేటర్లకు ప్రేక్షకుల్ని రప్పించడంలో పాటలు దోహదపడ్డాయనే మాటలు చాలా సంతోషాన్నిచ్చాయి. సుకుమార్‌గారు, ఇంకా చాలామంది ఫోనులు చేసి ప్రశంసిచారు. ‘పాటలు కొత్తగా ఉంటున్నాయి. బాగా చేస్తున్నారు’ అని చెప్పారు. వాట్సాప్, సోషల్ మీడియాలో ప్రేక్షకులు సైతం చాలా సందేశాలు పంపారు. హీరో, దర్శక-నిర్మాతలు స్వేచ్ఛ ఇవ్వడంతో మంచి పాటలు చేసే అవకాశం లభించింది.
నేపథ్య సంగీతంలో మెలోడీ ఉండటం చాలా ముఖ్యం. పాటలోనూ అంతే! ఎప్పుడైనా మనసును హత్తుకొనేది మెలోడీయే. పాటను వినేటప్పుడు ప్రేక్షకుడు ఎటువంటి అనుభూతికి లోనవుతాడో... నేపథ్య సంగీతమూ అటువంటి అనుభూతి ఇవ్వాలని కోరుకుంటాను. ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ కీ, ప్రతి చిత్రానికీ నేనది దృష్టిలో పెట్టుకుని పని చేస్తా. అదే సమయంలో సన్నివేశం కంటే నేపథ్య సంగీతం ఎక్కువ ఉండకూడదు. ఉంటే సీన్ ఎలివేషన్ కష్టమవుతుంది. అందుకనే, నేపథ్య సంగీతానికి పేరొస్తుంది.
సినిమాలో ఓ పాట చేస్తాం. ఆ సందర్భానికి పాట చక్కగా కుదిరి, మంచి పేరొస్తే... విజయం సాధించినట్టే. నా దృష్టిలో ఏ సినిమా ఫ్లాప్ కాదు. పరిస్థితులను బట్టి కొన్ని చిత్రాలు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యి ఉండకపోవచ్చు. ఇప్పటివరకూ నేను పనిచేసిన దర్శకులందరూ కొత్త శైలి సంగీతాన్ని ఇష్టపడ్డారు. అందువల్లే, అంతమంచి పాటలు ఇవ్వగలిగా. నేను చేసిన ప్రతి చిత్రం నాకు సవాల్ విసిరిన చిత్రమే. టెక్నాలజీ పరంగా సంగీతంలో చాలా మార్పులు వచ్చాయి. ఎలకా్ట్రనిక్గా మ్యూజిక్ చేసినా... లైవ్ ఇన్స్ట్రుమెంట్స్తో చేస్తే వచ్చే అనుభూతి ఉండదు.
‘ఆర్ఎక్స్ 100’ తర్వాత అజయ్ భూపతితో చేస్తున్న చిత్రం ‘మహాసముద్రం’. ‘ఆర్ఎక్స్ 100’తో పోలిస్తే... పూర్తిగా ఓ కొత్త నేపథ్యంలో అజయ్ సినిమా చేస్తున్నారు. ఇందులోని ‘హే రంభ’ పాట విడుదలైంది. దానికి మంచి స్పందన లభిస్తోంది. ప్రస్తుతం నేను చేస్తున్న చిత్రమిదే. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి.