‘అఖండ’ సీక్వెల్‌ చేయాలని వుంది

ABN , First Publish Date - 2021-12-29T09:24:58+05:30 IST

ఈ యేడాది చిత్రసీమ అందుకున్న భారీ విజయాలలో ‘అఖండ’ ఒకటి. నందమూరి బాలకృష్ణ సినీ జీవితంలో ఇదో మైలురాయిగా మిగిలిపోయింది. ఈ చిత్రంతో అభిరుచి గల నిర్మాత అనిపించుకున్నారు మిర్యాల రవీందర్‌ రెడ్డి...

‘అఖండ’ సీక్వెల్‌ చేయాలని వుంది

ఈ యేడాది చిత్రసీమ అందుకున్న భారీ విజయాలలో ‘అఖండ’ ఒకటి. నందమూరి బాలకృష్ణ సినీ జీవితంలో ఇదో మైలురాయిగా మిగిలిపోయింది. ఈ చిత్రంతో అభిరుచి గల నిర్మాత అనిపించుకున్నారు మిర్యాల రవీందర్‌ రెడ్డి. ఆయన బుధవారం తన పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈసందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.


‘‘అఖండ సినిమాపై ముందు నుంచీ గట్టి నమ్మకంతో ఉన్నా. బాలకృష్ణ గారి కంటే, బోయపాటి కంటే నేనే ఈ సినిమా గురించి ఎక్కువగా మాట్లాడా. దానికి కారణం... ఈ సినిమాపై నాకున్న నమ్మకమే. ‘అఖండ’లో అన్ని రకాల భావోద్వేగాలూ ఉన్నాయి. అఘోరా పాత్ర ప్రవేశించిన దగ్గర్నుంచి ప్రేక్షకులలో పూనకం మొదలవుతుంది. అది క్లైమాక్స్‌ వరకూ కొనసాగుతుంది. బాలయ్య తన ఉగ్రరూపం చూపించారు. తమన్‌ సంగీతం మరో ప్లస్‌ పాయింట్‌ అయ్యింది. అందుకే ఈ చిత్రం ఇంత పెద్ద విజయ్నాన్ని అందుకుంది’’


‘‘ఇలాంటి కథ ఏ భాషలో అయినా ఆడుతుంది. హిందీలో ఈ సినిమాని రీమేక్‌ చేసే అవకాశం ఉంది. అక్కడ అజయ్‌ దేవగణ్‌, అక్షయ్‌ కుమార్‌లైతే సరిగ్గా సరిపోతారు. ‘అఖండ’కు సీక్వెల్‌ చేయాలని కూడా ఉంది. 2022 మార్చిలో ఓ కొత్త సినిమా ప్రారంభిస్తున్నా. ఓ కొత్త హీరోని పరిశ్రమకు పరిచయం చేయబోతున్నా. స్టార్‌ హీరోతో కూడా ఓ సినిమా ప్లానింగ్‌లో ఉంది’’


‘‘ప్రభుత్వాలు ఎప్పుడూ వ్యక్తుల కోసం పనిచేయవు. వ్యవస్థల కోసం పనిచేయవు. ప్రజల కోసమే పనిచేస్తాయి. ఆన్‌లైన్‌ టికెటింగ్‌ సిస్టమ్‌ ఉండాలని నిర్మాతలే కోరారు. అందులో పారదర్శకత ఉంటుందని నా నమ్మకం.  రాజకీయాలపై నాకు ఆసక్తి ఉంది. కానీ ప్రస్తుతానికి ఏ పార్టీలోనూ లేను’’ 

Updated Date - 2021-12-29T09:24:58+05:30 IST