నాకు రెహమాన్ ఇచ్చిన సలహా అదే!
ABN , First Publish Date - 2021-09-22T06:24:01+05:30 IST
‘‘నీకు నచ్చిందే చెయ్! - నాకు రెహమాన్‌గారు ఇచ్చిన సలహా అదే! కథ నచ్చినప్పుడు, పాట నచ్చినప్పుడే చేయాలన్నారు’’ అని పవన్ సీహెచ్ అన్నారు. ఆయన సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘లవ్ స్టోరి’...
‘‘నీకు నచ్చిందే చెయ్! - నాకు రెహమాన్‌గారు ఇచ్చిన సలహా అదే! కథ నచ్చినప్పుడు, పాట నచ్చినప్పుడే చేయాలన్నారు’’ అని పవన్ సీహెచ్ అన్నారు. ఆయన సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘లవ్ స్టోరి’. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నారాయణ్ దాస్ కె. నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మించారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. శుక్రవారం విడుదల కానుంది. పవన్ సీహెచ్ మాట్లాడుతూ ‘‘మా తాతయ్య నాగేశ్వరరావు, నాన్న విజయ్ సి. కుమార్ ఛాయాగ్రహకులు. అయితే, సినిమాల్లోకి వస్తానని అనుకోలేదు. నేను చేసిన ఓ ర్యాప్ సాంగ్ విని మా కుటుంబ సభ్యులు సంగీతంలో శిక్షణ ఇప్పించారు. చెన్నైలో ఓ స్టేజి షోలో నేను స్వరపరిచిన మూడు పాటలు ఉపయోగించారు. దానికి ఏఆర్ రెహమాన్ వచ్చారు. నా సౌండ్ నచ్చడంతో ఆయన బృందంలో పని చేసే అవకాశం కల్పించారు. ‘మామ్’, ‘రోబో’, ‘ఫకీర్ ఆఫ్ వెనిస్’కు పని చేశా. అలా చేస్తున్నప్పుడే... ‘ఫిదా’కు స్వరకర్తగా అవకాశం కోసం ప్రయత్నించా. నేను చేసిన కొన్ని బాణీలు శేఖర్ కమ్ములకు వినిపించా. అయితే, కొన్ని కారణాల వల్ల అవకాశం ఇవ్వలేదు. ‘లవ్ స్టోరి’కి అవకాశం ఇవ్వడానికి ముందు కొన్ని సందర్భాలు చెప్పి బాణీలు కట్టమన్నారు. ఓ పది, పదిహేను చేశాక... అవకాశం ఇచ్చారు. అప్పటికి రెహమాన్‌గారి దగ్గర ‘సర్కార్’, ‘నవాబ్’ పనులు జరుగుతున్నాయి. అవి పూర్తి చేసుకుని ఉదయం ఐదున్నరకు ఇంటికొచ్చి ‘లవ్ స్టోరి’ పాటలు చేసేవాణ్ణి. రెండు మూడు నెలలు ఆ విధంగా పని చేశాక... ‘నేనొక చిత్రానికి పని చేయడం ప్రారంభించా’ అని చెప్పా. అప్పుడు ‘ఆల్ ద బెస్ట్’ చెప్పి పంపించారు. ‘లవ్ స్టోరి’లో విభిన్నమైన బాణీలు అందించే అవకాశం లభించింది. శేఖర్ కమ్ములగారు ప్రతి సందర్భాన్ని వివరించి చెప్పడం, సలహాలు ఇవ్వడంతో మంచి సంగీతం ఇవ్వడానికి దోహదపడ్డాయి. యూట్యూబ్‌లో రెహమాన్‌గారు విని బావున్నాయని నా స్నేహితులతో అనడంతో చాలా సంతోషమేసింది. నాపై ఓ ముద్ర పడకుండా అన్ని తరహా పాటలు, సంగీతం అందించాలనుంది’’ అన్నారు.