అందుకే స్టేజీమీద ఐలవ్‌యూ చెప్పా!
ABN , First Publish Date - 2021-11-09T05:30:00+05:30 IST
‘‘కొంత మంది తమ పిల్లలకు అభిమాన తారల పేర్లు పెట్టుకుంటారు. అలాగే నేను నా సినిమాకి చిరంజీవిగారి టైటిల్ పెట్టా’’ అన్నారు కార్తికేయ. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘రాజా విక్రమార్క’. ఈనెల 12న విడుదల అవుతోంది...

‘‘కొంత మంది తమ పిల్లలకు అభిమాన తారల పేర్లు పెట్టుకుంటారు. అలాగే నేను నా సినిమాకి చిరంజీవిగారి టైటిల్ పెట్టా’’ అన్నారు కార్తికేయ. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘రాజా విక్రమార్క’. ఈనెల 12న విడుదల అవుతోంది. ‘‘నేను ఇప్పటి వరకూ ప్రయత్నించని జోనర్ ఇది. ప్రేక్షకుల్ని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది’’ అంటున్న కార్తికేయ ఈ సినిమా గురించి ఇంకా ఏం చెప్పారంటే..?
‘‘ఇప్పటి వరకూ ఇంత కామెడీ టైమింగ్ ఉన్న పాత్ర నేను చేయలేదు. ప్రతీ పాత్ర కథలోంచే పుట్టుకొస్తుంది. సందర్భోచితమైన వినోదం అందరినీ నవ్విస్తుంది. నిర్మాణాత్మక విలువలు ఆకట్టుకుంటాయి. నిర్మాతలకు ఇదే తొలి సినిమా అయినా సరే, ఖర్చుకు ఎక్కడా వెనుకంజ వేయలేదు. ఓటీటీ నుంచి ఎన్ని ఒత్తిడులు వచ్చినా, ఈ సినిమాని థియేటర్లోనే విడుదల చేయాలనుకున్నారు’’
బయట ఇలానే ఉంటా!
‘‘ఈ చిత్రంలో ఎన్.ఐ.ఏ ఏజెంట్‌గా కనిపిస్తా. ఈ పాత్ర కోసం కొంత రిసెర్చ్ చేశా. అయితే.. దర్శకుడితో మాట్లాడి తెలుసుకున్నదే ఎక్కువ. కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ ఎలా ఉండాలి? అనేది దర్శకుడిని అడిగి తెలుసుకున్నా. నేను బయట చాలా సరదాగా ఉంటాను. అందుకే కామెడీ చేయడం పెద్ద కష్టమనిపించలేదు. దర్శకుడు స్ర్కిప్ట్ వినిపించిన వెంటనే నచ్చింది. పది నిమిషాల్లోనే తన శక్తి సామర్థ్యాలను అంచనా వేయగలిగాను. ఒక్కో షెడ్యూల్ అవుతున్న కొద్దీ.. తనపై నమ్మకం మరింత బలపడింది’’
చిరుకి చెప్పా
‘‘ఈ సినిమా కోసం దర్శకుడు కొన్ని టైటిళ్లు చెప్పారు. కానీ పెద్దగా అనిపించలేదు. ఓసారి ఆయన మొబైల్‌లో ‘రాజా విక్రమార్క’ అని చూశా. ఆ సౌండింగ్ బాగా నచ్చింది. వినగానే పాజిటీవ్ ఎనర్జీ వచ్చింది. పైగా నేను చిరంజీవిగారి వీరాభిమానికి. ఈ సినిమాకి టైటిల్ అనుకోగానే... చిరంజీవిగారికి ఫోన్ చేసి చెప్పా. ఆయన ‘గుడ్ లక్..’ అంటూ ప్రోత్సహించారు’’.
పెళ్లయితే చెప్పలేను
‘‘నాకు కాబోయే భార్య పేరు లోహిత. తనతో చాలా రోజులుగా ఫోనులో మాట్లాడుతున్నా.. ‘ఐ లవ్ యూ’ అని ఒక్కసారి కూడా చెప్పలేదు. ప్రీ రిలీజ్ ఫంక్షన్లో.. ఎందుకో చెప్పాలనిపించింది. పెళ్లయిపోతే... మళ్లీ ఈ అవకాశం రాదు కదా? అందుకే చెప్పేశా. అయితే ఇదంతా ఓ సర్‌ప్రైజ్‌గా ఉంచాను. నేను స్టేజీపై ఇలా మాట్లాడతానని లోహిత ఊహించి ఉండదు’’
అజిత్‌కి నేనే విలన్
‘‘ప్రస్తుతం యూవీ క్రియేషన్స్‌లో ఓ సినిమా చేస్తున్నా. శ్రీదేవి మూవీస్‌లో ఓ సినిమా ఒప్పుకున్నా. ఇవి కాకుండా మరో రెండు చిత్రాలపై సంతకాలు చేశా. తమిళంలో అజిత్ సర్‌తో... ‘వాలిమై’లో ప్రతినాయకుడిగా నటించా. ఆయనతో కలిసి తెరని పంచుకోవడం ఓ గొప్ప అనుభవం. ఈ సినిమా కోసం తమిళంలో నేనే డబ్బింగ్ చెప్పుకున్నా. ఇప్పుడు తమిళం నుంచి కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి’’.