పాటల పల్లకిలో తెలుగు సినిమా
ABN , First Publish Date - 2021-12-27T06:35:37+05:30 IST
‘సంగీతం సగం బలం’ అని నమ్ముతుంది సినీ పరిశ్రమ. పాటలు హిట్టయితే, సినిమా హిట్టే. ఈ విషయం చాలాసార్లు నిరూపితమైంది. కేవలం పాటల కోసమే ప్రేక్షకులు సినిమాలకు వెళ్లిన సందర్భాలున్నాయి. సినిమా బాగుండి...

‘సంగీతం సగం బలం’ అని నమ్ముతుంది సినీ పరిశ్రమ. పాటలు హిట్టయితే, సినిమా హిట్టే. ఈ విషయం చాలాసార్లు నిరూపితమైంది. కేవలం పాటల కోసమే ప్రేక్షకులు సినిమాలకు వెళ్లిన సందర్భాలున్నాయి. సినిమా బాగుండి, అందులో మంచి పాటలుంటే - కచ్చితంగా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయనడానికి రుజువులు ఎన్నో. అందుకే పాటలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంటారు. ఆల్బమ్‌లో ఆరు పాటలూ మార్మోగేలా సంగీత దర్శకులు శ్రమిస్తుంటారు. చిన్న సినిమాలకైతే.. పాటలే ప్రాణం. సినిమా చిన్నదైనా, పెద్దదైనా పాట బాగుంటే చాలు. ఆదరించడం తెలుగు శ్రోతల వంతు. అందుకే టాలీవుడ్‌లో మంచి పాటలకు కొదవ లేకుండా పోతుంది. ప్రతీ యేటా.. కొన్ని ఆణిముత్యాల్లాంటి పాటలు వస్తూనే ఉంటాయి. 2021లోనూ కొన్ని పాటలు మార్మోగాయి. ఆయా చిత్రాల విజయాల్లో కీలకమైన పాత్ర పోషించాయి. ఆ సరిగమపదనిసలు ఇవి.
స్టార్ సినిమా అంటే.. కచ్చితంగా పేరున్న సంగీత దర్శకులే పని చేస్తారు. బడ్జెట్లు ఉంటాయి. పాపులర్ సినీ రచయితలతో పాటలు రాయించొచ్చు. క్రేజీ సింగర్స్‌తో పాడించొచ్చు. పాటకు ఏదోలా ఓ ఊపు తీసుకురావచ్చు. చిన్న సినిమాలకు ఇన్ని సౌలభ్యాలు ఉండవు. ఆ పాటలోనే మ్యాజిక్ ఉండాలి. లేదంటే.. శ్రోతల్ని అలరించడం చాలా కష్టం. ఈ విషయం తెలుసుకున్న చిన్న సినిమాలు సంగీతం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించాయి. 2021లో విడుదలై, విజయవంతమైన చిత్రాల్ని పరిశీలిస్తే కచ్చితంగా వాటిలో పాటలకు ప్రత్యేక స్థానం ఉండి తీరుతుంది. ఈ యేడాది వచ్చిన సూపర్ హిట్లలో ‘ఉప్పెన’ ఒకటి. అందులో పాటలన్నీ హిట్టే. ‘నీ కన్ను నీలి సముద్రం’ అనే పాటైతే.. యూ ట్యూబ్ రికార్డులు షేక్ చేసింది. సాకీలో ఖవాలీ వినిపించడం, ఖవాలీతోనే పాట ముగించడం ఈ పాటలో దేవిశ్రీ ప్రసాద్ చేసిన ప్రయోగం. ‘చిన్ని ఇసుక గూడు కట్టినా..నీ పేరు రాసి పెట్టినా.. దాన్ని చెరిపేసే కెరటాలు పుట్టలేదు తెలుసా’ - ఇలా శ్రీమణి రాసిన సాహిత్యంలోనూ మెరుపులు కనిపించాయి.
ఈ యేడాది యువతరానికి ఎక్కేసిన మరో పాట... ‘నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా’. యాంకర్ ప్రదీప్ హీరోగా పరిచయం అయిన సినిమా ఇది. ఈ ఒక్క పాట... కోట్ల రూపాయల ప్రచారాన్ని తీసుకొచ్చి పెట్టింది. సిద్ శ్రీరామ్ ఈ పాటని పాడిన విధానం, చంద్రబోస్ సాహిత్యం... శ్రోతల్ని కట్టిపడేశాయి. ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ రావడానికి ఈ పాట ప్రధాన కారణంగా నిలిచింది.
‘నువ్వే నడిచేటి తీరుకే - తారలు మొలిచాయి నేలకే..
నువ్వే వదిలేటి శ్వాసకే - గాలులు బ్రతికాయి చూడవే’ అనడం మంచి సాహితీ ప్రయోగం. సిద్ పాడిన మరో పాట ‘ఒకే ఒక లోకం’ కూడా ఈ యేడాది బాగా వినిపించింది. ఆది సాయికుమార్ నటించిన ‘శశి’లోని పాట ఇది. చంద్రబోస్ రాశారు. ఈ పాటతోనే వరుణ్ అనే సంగీత దర్శకుడు వెలుగులోకి వచ్చాడు. ‘అర్థ శతాబ్దం’లో సిద్ పాడిన ‘ఏ కన్నులూ చూడనీ చిత్రమే’ కూడా ఉత్తమ గీతాల సరసన చేరిపోయింది. ‘అందుకే ఈ నెల నవ్వి పూలు పూసెలే.. గాలులన్నీ నిన్ను తాకి గంధమాయెనె’ అంటూ రెమమాన్ కలం ఉరకలు వేసింది. ‘రంగ్‌దే’లోని ‘నీకనులు ఎపుడూ..’ అంటూ సాగే సిద్ శ్రీరామ్ గీతం... మంచి ఎమోషన్ టచ్ తో సాగింది.
2021లో ఘన విజయాన్ని అందుకున్న మరో చిన్న సినిమా ‘జాతి రత్నాలు’. తక్కువ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం భారీ వసూళ్లతో ప్రభంజనం సృష్టించింది. ఈ సినిమాకి వినోదం ఎంత ప్లస్సో.. సంగీతం అంత ప్లస్సు. ముఖ్యంగా ‘చిట్టీ నీ నవ్వంటే.. లక్ష్మీ పటాసే..’ సూపర్ హిట్. రామ్ మిరియాల ఈ పాట పాడారు. ‘మిర్చిబజ్జీ లాంటి లైఫుల.. నువ్వు ఆనియన్ వేశావే’ అంటూ రామజోగయ్య శాస్ర్తి సాహిత్యం చాలా సరదాగా సాగింది. రధన్ ట్యూన్ క్యాచీగా ఉండడంతో పాటు, తెరకెక్కించిన విధానం కూడా ఆకట్టుకోవడంతో... ఈ పాట హల్ చల్ చేసింది.
‘ఎస్.ఆర్.కల్యాణమండపం’లోని ‘చుక్కల చున్నీవే..’ మరో సూపర్ హిట్ గీతం. చేతన్ భరద్వాజ్ సంగీతం, అనురాగ్ కులకర్ణి గానం... ఈ పాటకు ప్లస్సయితే, భాస్కరభట్ల క్యాచీ పదాలతో బండిని హై స్పీడుతో నడిపించేశారు. ‘కాసేపు నువ్వు కన్నార్పకు..నీలోన నన్ను చూస్తూనే ఉంటా, కాసేపు నువ్వు మాటాడకు... కౌగిళ్ల కావ్యం రాసుకుంటా’ అనే లైన్లు బాగా నచ్చాయి.
స్టార్ హీరోల చిత్రాల్లో పాటలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ యేడాది కూడా ఆ ప్రభావం కనిపించింది. ‘వకీల్ సాబ్’లోని ‘మగువా.. మగువా’ పాట ఆ సినిమా థీమ్ మొత్తాన్ని మోసింది. స్ర్తీ ఔన్నత్యాన్ని చాటి చెప్పిన సినిమా ఇది. ‘లవ్ స్టోరీ’లో సుద్దాల రాసిన ‘సారంగ దరియా’ ఓ ఊపు ఊపేసింది. మంగ్లీ ఈ పాటని పాడిన విఽధానం ఒక ఎత్తయితే, అందులో సాయి పల్లవి వేసిన స్టెప్పులు మరో ఎత్తు. అందుకే యూ ట్యూబ్‌లో ఈ పాట కొత్త రికార్డుల్ని లిఖించేలా చేసింది. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’లోని లెహరాయి, ‘వరుడు కావలెను’లో ‘దిగు దిగు దిగు నాగ’ రెండూ కొత్త జోష్ తీసుకొచ్చిన పాటలే. ‘ఆచార్య’ నుంచి ‘లాహె.. లాహె..’ మెగా అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ పాటలో చిరు యువ హీరోలకు పోటీ ఇస్తూ స్టెప్పులు వేయడం.. వాళ్లకు మరింత బాగా నచ్చింది. చిరు - మణిశర్మ కాంబో ఎప్పుడూ హిట్టే. ‘లాహె.. లాహె’ పాట అందుకు ఓ నిదర్శనంగా నిలిచింది. దేవిశ్రీ ప్రసాద్ నుంచి వచ్చిన ‘పుష్ప’లోని పాటలన్నీ సూపర్ హిట్టే. ప్రతీ పాటా.. కొత్త పంథాలో సాగింది. అయితే... ‘ఊ అంటావా.. ఊహూ అంటావా’ మాత్రం మాస్‌లోకి చొచ్చుకుపోయింది. ‘మగబుద్ది’ ప్రయోగం కొంతమంది మనోభావాల్ని దెబ్బ తీసినా, పాటకొచ్చిన క్రేజ్‌ని మాత్రం తగ్గించలేకపోయింది. ‘ఆర్.ఆర్.ఆర్’లోని ‘నాటు నాటు’ పాట, అందులో చరణ్, ఎన్టీఆర్‌లు వేసిన స్టెప్పులు... టాలీవుడ్‌ని షేక్ చేస్తున్నాయి. ఇక సినిమా విడుదలయ్యాక.. ఇంకెంత దుమ్ము రేపుతుందో..?