దక్షిణాది నిర్మాత ఓ రాత్రి తనతో గడపమన్నాడు!

ABN , First Publish Date - 2021-06-17T10:33:03+05:30 IST

ఓ దక్షిణాది నిర్మాత తనతో అమర్యాదగా ప్రవర్తించాడని నటి, టీవీ దర్శకురాలు నీనా గుప్తా ఆరోపించారు. అదీ ఇప్పటి సంగతి కాదు...

దక్షిణాది నిర్మాత ఓ రాత్రి తనతో గడపమన్నాడు!

ఓ దక్షిణాది నిర్మాత తనతో అమర్యాదగా ప్రవర్తించాడని నటి, టీవీ దర్శకురాలు నీనా గుప్తా ఆరోపించారు. అదీ ఇప్పటి సంగతి కాదు... గతంలో, ఎప్పుడో జరిగినది. ‘సచ్‌ కహూఁ తో’ (ఒకవేళ నేను నిజం మాట్లాడితే...) పేరుతో నీనా గుప్తా తన ఆటోబయోగ్రఫీ రాశారు. వ్యక్తిగత జీవితంతో మంచి-చెడుతో పాటు వృత్తిపరమైన జీవితం, చిత్రసీమలో రాజకీయాలు, క్యాస్టింగ్‌ కౌచ్‌ సమస్య, గాడ్‌ ఫాదర్‌ లేకుండా చిత్ర పరిశ్రమలో ఎలా మనుగడ సాధించినదీ, ఒంటరిగా అమ్మాయిని పెంచి పెద్ద చేయడం, బాలీవుడ్‌లో రీ-ఎంట్రీ వంటి విషయాల్ని అందులో చెప్పుకొచ్చారు. అలాగే, దక్షిణాది నిర్మాత గురించి వివరించారు. ‘‘ముంబైలోని పృథ్వీ థియేటర్‌కు దగ్గరలో ఉన్న హోటల్‌కు ఓ ప్రముఖ దక్షిణాది నిర్మాత రమ్మన్నాడు. వెళ్లి లాబీ నుంచి ఫోన్‌ చేశా. అతను పైకి రమ్మన్నాడు. వద్దని నా మనసు చెప్పింది. అతణ్ణి కిందకు రావాల్సిందిగా అడగాలని అనిపించింది. కానీ, నేనే పై అంతస్తులో ఉన్న అతడి గదికి వెళ్లాను. సోఫాలో కూర్చోబెట్టాడు. దక్షిణాదిలో ఎంతమంది హీరోయిన్లనూ పరిచయం చేసినదీ చెప్పుకొచ్చాడు. నాకు హీరోయిన్‌ స్నేహితురాలి పాత్ర ఆఫర్‌ చేశారు. అతను వివరించినప్పుడు సినిమాలో చాలా చిన్న పాత్ర అనిపించింది. ఆసక్తి లేదని చెప్పి... ‘నేను వెళ్లొచ్చా?’ అని అడిగా. ‘వెళతావా? ఎక్కడికి?’ అన్నాడు. నిజంగా షాక్‌ తిన్నట్టు కనిపించాడు. ‘నువ్వు రాత్రి ఇక్కడ గడపడం లేదా?’ అని అడిగాడు. అప్పుడు నా తలపై ఎవరో చల్లటి నీళ్లు పోసినట్టు ఉంది. నా రక్తం చల్లబడింది. నా హ్యాండ్‌ బ్యాగ్‌ తీసుకుని నా చేతుల్లోకి విసిరేశాడు. ఎవరూ బలవంతం చేయడం లేదని, వెళ్లొచ్చని చెప్పాడు. వెంటనే నేను బయటకు పరుగు తీశా’’ అని ఆటోబయోగ్రఫీలో నీనా గుప్తా వెల్లడించారు. కుమార్తె మసాబా గుప్తా మాజీ భర్త, నిర్మాత మధు మంతెన తనను తాను ‘సౌతిండియన్‌ విలన్‌’గా అభివర్ణించుకుంటాడని నీనా గుప్తా కామెంట్‌ చేశారు.


Updated Date - 2021-06-17T10:33:03+05:30 IST