విష్ణు మాయ
ABN, First Publish Date - 2021-10-11T07:51:06+05:30
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఉత్కంఠ రేపిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు.. పోలింగ్, ఫలితాల్లో అంతే ఉత్కంఠ రేపాయి.
- ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు ఘన విజయం
- ప్రకాశ్‌రాజ్‌పై 101 ఓట్ల ఆధిక్యంతో గెలుపు
- ప్రధాన కార్యదర్శిగా రఘుబాబు
- కోశాధికారిగా శివబాలాజీ గెలుపు
- హోరాహోరీగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు
- రెండు ప్యానళ్ల నుంచీ కార్యవర్గ సభ్యుల ఎన్నిక
- ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా శ్రీకాంత్
- మోహన్‌బాబుకు ప్రకాశ్‌రాజ్ పాదాభివందనం
- ప్రాథమిక సభ్యత్వానికి నాగబాబు రాజీనామా
- శివబాలాజీ చేయి కొరికిన నటి హేమ
(సినిమా డెస్క్, ఆంధ్రజ్యోతి) : తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఉత్కంఠ రేపిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు.. పోలింగ్, ఫలితాల్లో అంతే ఉత్కంఠ రేపాయి. నువ్వా.. నేనా అన్నట్లుగా సాగిన ఈ ఎన్నికలో మంచు విష్ణు అధ్యక్షుడిగా ఘనవిజయం సాధించారు. ప్రత్యర్థి ప్రకాశ్‌రాజ్‌పై 101 ఓట్ల తేడాతో ఆయన గెలుపొందారు. విష్ణుకు 385 ఓట్లు రాగా, ప్రకాశ్ రాజ్‌కు 274 ఓట్లు పోలయ్యాయి. అయితే ప్రకాశ్‌రాజ్ ఓటమిపాలైనా.. ఆయన ప్యానల్ తరఫున పోటీ చేసిన పలువురు నటులు గెలుపొందారు. క్రాస్ ఓటింగ్ జరగడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ప్రధాన కార్యదర్శిగా విష్ణు ప్యానల్‌కు చెందిన రఘుబాబు.. ప్రకాశ్‌రాజ్ ప్యానల్‌కు చెందిన జీవితా రాజశేఖర్‌పై గెలుపొందారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా మాత్రం ప్రకాశ్‌రాజ్ ప్యానల్ సభ్యుడు శ్రీకాంత్ ఎన్నికయ్యారు. విష్ణు ప్యానల్ నుంచి పోటీ చేసిన బాబుమోహన్ ఓటమి పాలయ్యారు.
ఇక శివ బాలాజీ (విష్ణు ప్యానల్) విజయం సాధించారు. ఇప్పుడు ఎన్నికైన సభ్యులు రెండేళ్ల పాటు ఆయా పదవుల్లో కొనసాగనున్నారు. కాగా, ‘మా’ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా భారీగా పోలింగ్ నమోదైంది. ఓటు వేయడానికి తారాలోకం తరలివచ్చింది. ప్రస్తుతం ‘మా’లో మొత్తం 925 మంది సభ్యులు ఉండగా.. 883 మందికి ఓటు హక్కు ఉంది. వీరిలో 603 మంది ప్రత్యక్షంగా ఓటుహక్కును వినియోగించుకోగా 52 మంది పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. మొత్తం 665 ఓట్లు పోలయ్యాయి. అయితే కార్యవర్గ సభ్యులు, ఉపాధ్యక్షులు, జాయింట్ సెక్రటరీలకు సంబంధించిన కౌంటింగ్ కొంత మిగిలి ఉందని ఎన్నికల అధికారి కృష్ణమోహన్ ఆదివారం రాత్రి 10.45 గంటల సమయంలో ప్రకటించారు. సమయం మించిపోయినందున కౌంటింగ్ ప్రక్రియను సోమవారం పూర్తి చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. కాగా, అధ్యక్షుడిగా ఎన్నికైన విష్ణు మంచును ప్రకాశ్‌రాజ్ అభినందించారు.
తరలివచ్చిన అగ్రనటులు
మా ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. అగ్రనటులు చిరంజీవి, మోహన్‌బాబు, పవన్‌కల్యాణ్, రామ్‌చరణ్ తదితరులు 9గంటలలోపే ఓటుహక్కు వినియోగించుకున్నారు. అక్కినేని నాగార్జున, ఆయన తనయుడు అఖిల్ మధ్యాహ్నం 12 గంటల తర్వాత వచ్చి ఓటు వేశారు. యాంకర్ అనసూయ చివరి నిమిషంలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. సీనియర్ నటి జయప్రద, మాలాశ్రీ, జెనీలియా, స్నేహా ఉల్లాల్‌తోపాటు తదితరులు ఇతర నగరాల నుంచి విమాన ప్రయాణం చేసి వచ్చి మరీ ఓటు వేశారు. హీరోలు వెంకటేశ్, రవితేజ, మహేశ్‌బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్‌తోపాటు హీరోయిన్లు రకుల్‌ప్రీత్ సింగ్, ఇలియానా, త్రిష, హన్సిక తదితరులు ఓటు వేయలేదు. తొలుత మధ్యాహ్నం 2గంటలకే పోలింగ్ ముగించాలకున్నారు. అయితే, బూత్ బయట ట్రాఫిక్ జామ్ కావడం, ఓటు వేయడానికి వచ్చిన తారలు కొందరు కార్లలో ఉండటంతో పోలింగ్ సమయాన్ని మరో గంట పొడిగించారు. 3 గంటలకు కూడా పోలింగ్ పూర్తి కాకపోవడంతో క్యూలో నిలబడ్డ వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు.
మోహన్‌బాబు, పవన్ ఆలింగనం!
‘మా’ ఎన్నికలకు ముందు విష్ణు మంచు, ప్రకాశ్‌రాజ్ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలకు దారి తీసిన అంశాల్లో ‘రిపబ్లిక్’ ప్రీ-రిలీజ్ వేడుకలో పవన్‌కల్యాణ్ ప్రసంగం ఒకటి. ఆ స్పీచ్ తర్వాత పవన్‌కల్యాణ్‌పై విష్ణు వ్యాఖ్యలు, దానికి ప్రకాశ్‌రాజ్ కౌంటర్, తిరిగి విష్ణు ప్రతిస్పందన.. మా ఎన్నికలకు హైప్ తీసుకువచ్చాయి. అయితే ఆదివారం ఓటుహక్కు వినియోగించుకోవడానికి వచ్చిన సమయంలో మోహన్‌బాబు, పవన్‌కల్యాణ్ ఆత్మీయంగా కౌగిలించుకున్నారు. ఇరువురూ కాసేపు సంభాషించుకున్నారు. అనంతరం పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ ‘‘ఈ ఎన్నికల వల్ల ఇండస్ట్రీ చీలిపోదు. రాజకీయాలపై ఇది ప్రభావం చూపదు. ‘మా’ ఎన్నికలకు ఇంత హడావిడి అవసరం లేదు’’ అని వ్యాఖ్యానించారు. అన్నయ్య చిరంజీవి, మోహన్‌బాబు స్నేహితులన్నారు. మా ఎన్నికల్లో గెలుపొందిన మంచు విష్ణు ప్యానల్‌కు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు.
శివబాలాజీని కొరికిన హేమ!
పోలింగ్ సందర్భంగా రెండు ప్యానళ్ల సభ్యుల మధ్య కొంత వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సమయంలో నటుడు శివబాలాజీ చేతిని నటి హేమ కొరికారు. అయితే ఇందుకు సంబంధించి ఇరువురి వాదనలు భిన్నంగా ఉన్నాయి. ‘‘ప్రకాశ్‌రాజ్ బ్యాడ్జ్ వేసుకుని ఎవరో ఒకరు రిగ్గింగ్ చేయడానికి ప్రయత్నిస్తే... ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశాం. గొడవేమీ కాదు, అది చాలా చిన్నదే. తర్వాత ప్రకాశ్‌రాజ్, నేనూ కౌగిలించుకున్నాం. నో ఫైటింగ్... ఓన్లీ ఓటింగ్ అని చెప్పుకొన్నాం’’ అని విష్ణు ప్యానల్‌కు మద్దతుదారుగా ఉన్న నటుడు నరేశ్ తెలిపారు. శివబాలాజీని హేమ కొరికారని ఆయన చెప్పారు. శివబాలాజీ ఒంటిపై పంటిగాట్లను చూపించారు. కొరికిన దృశ్యాలు వార్తా చానళ్లు, సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. అయితే... హేమ మాట్లాడుతూ, ‘‘నేను వెళ్తున్న సమయంలో శివబాలాజీ తన చేతిని అడ్డుగా పెట్టారు. తప్పుకోమంటే తప్పుకోలేదు. అందుకని, చేయి కొరకాల్సి వచ్చింది. అంతే తప్ప... ఎటువంటి దురుద్దేశం లేదు’’ అని వివరణ ఇచ్చారు. తొలుత హేమ కొరికిన విషయాన్ని తేలిగ్గా తీసుకున్న శివబాలాజీ, అనంతరం నిమ్స్ ఆస్పత్రికి వెళ్లి ప్రథమ చికిత్స తీసుకున్నారు. కాగా, ఎన్నికల ఫలితా ల అనంతరం నటుడు నాగబాబు ‘మా’ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో ఆయన వెల్లడించారు. నాగబాబు ఈ ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్ ప్యానల్‌కు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.
విష్ణు, ప్రకాశ్‌రాజ్ సెల్ఫీ
పోలింగ్ ఉత్కంఠగా జరుగుతున్న సమయంలో ‘మా’ అధ్యక్ష పదవికి పోటీ చేసిన విష్ణు మంచు, ప్రకాశ్‌రాజ్ సెల్ఫీ తీసుకున్నారు. ఆ ఫొటోను ‘డి డే’ (మార్పు మొదలయ్యే రోజు) క్యాప్షన్‌తో విష్ణు సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో వారిద్దర్నీ మంచు మనోజ్ ఫొటో తీశారు. ఆ సెల్ఫీ, మనోజ్ తీసిన ఫొటో నెట్టింట వైరల్ అయ్యాయి. ఎన్నికలు మొదలు కావడానికి ముందు మోహన్‌బాబు కాళ్లకు ప్రకాశ్‌రాజ్ నమస్కరించారు. శివబాలాజీ, మధుమిత దంపతులు సైతం మోహన్‌బాబు ఆశీర్వాదం తీసుకున్నారు.
కార్యవర్గ సభ్యులు వీరే?
కార్యవర్గ సభ్యులుగా పోటీ చేసిన వారిలో మంచు విష్ణు ప్యానల్ నుంచి పూజిత, శశాంక్, జయవాణి, పి.శ్రీనివాసులు, శ్రీలక్ష్మి, మాణిక్, హరినాథ్‌బాబు, విష్ణు బొప్పన గెలుపొందినట్లు సమాచారం. ప్రకాశ్‌రాజ్ ప్యానల్ నుంచి కౌశిక్, శివారెడ్డి, సురేశ్ కొండేటి, అనసూయ, తనీశ్, భూపాల్, ‘సుడిగాలి’ సుధీర్, సమీర్ కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైనట్లు తెలుస్తోంది.