ఈ సినిమాపై సిరివెన్నెల తన మార్క్‌ వదిలివెళ్లారు

ABN , First Publish Date - 2021-12-14T06:48:13+05:30 IST

‘శ్యామ్‌సింగరాయ్‌’ హృదయాలను కదిలించగల ప్రేమకథా చిత్రం. సంగీతం కొన్ని సంవత్సరాల పాటు ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. ఈ చిత్రంలో నాని రెండు భిన్న ఛాయలున్న పాత్రలు...

ఈ సినిమాపై సిరివెన్నెల తన మార్క్‌ వదిలివెళ్లారు

‘శ్యామ్‌సింగరాయ్‌’ హృదయాలను కదిలించగల ప్రేమకథా చిత్రం. సంగీతం కొన్ని సంవత్సరాల పాటు ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. ఈ చిత్రంలో నాని రెండు భిన్న ఛాయలున్న పాత్రలు పోషించారు. ఆ పాత్రలను ఎలివేట్‌ చేసేలా సంగీతం అందించాను’’ అన్నారు మిక్కీ జే మేయర్‌. రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో నాని కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం డిసెంబరు 24న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్ర సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్‌ మాట్లాడుతూ... 


కథానుసారం ఈ సినిమాకు 70వ దశకంలోని వాతావరణాన్ని ప్రతిబింబించేలా సంగీతం అందించా. ఆ కాలంలో వాడుకలో ఉన్న సంగీత పరికరాలను వాడాను. సినిమా బెంగాల్‌ నేపథ్యంలో సాగుతుంది. దీంతో బెంగాలీ ర్యాప్‌ను జోడించాం. ప్రథమార్థంలో కర్నాటిక్‌, ద్వితీయార్థంలో హిందుస్థానీ సంగీతం ఎక్కువ వినిపిస్తుంది. 


ఈ సినిమాలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రెండు పాటలు రాశారు.  ‘సిరివెన్నెల...’ అంటూ సాగే గీతం ఇప్పటికే విడుదలైంది. ‘ఈ పాటలో మీ పేరుంది కదా’ అని అంటే సీతారామశాస్త్రి గారు ‘ఇదే నా చివరి పాట’ అన్నారు. అలాగే సాయిపల్లవి మీద చిత్రీకరించిన క్లాసికల్‌ సాంగ్‌ను ఆయనే రాశారు. ఆయనతో ఈ పాట గురించి చాలా సేపు మాట్లాడాను. కంపోజ్‌ చేశాక పాట విని చాలా మెచ్చుకున్నారు. అది నేను ఎప్పటికీ మరచిపోలేని జ్ఞాపకం. 


నానితో సినిమా చేస్తానని అనుకోలేదు. ఆయన చాలా కూల్‌గా, కామ్‌గా ఉంటారు. ఈ సినిమాలో పాటలు, నేపథ్య సంగీతం నానికి బాగా నచ్చాయి. ఇప్పటికే విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. సినిమా రిలీజయ్యాక బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ నాకు మరింత పేరు తెస్తుందని నమ్ముతున్నాను. 


Updated Date - 2021-12-14T06:48:13+05:30 IST