Siva shankar Master: ఊపిరి ఎంతో.. చేసే పని అంతే!

ABN , First Publish Date - 2021-11-29T19:20:00+05:30 IST

‘‘వృత్తి బోర్‌ కొడితే ఎందుకీ జన్మ! ఐ యామ్‌ ఎంజాయింగ్‌. ప్రాణం పోయే దాకా ఊపిరి పీలుస్తూనే ఉంటాం కదా! సో... నాలో శక్తి ఉన్నంత వరకూ పనిచేస్తూనే ఉండాలన్నది నా జీవిత ఆశయం’’ ప్రముఖ నృత్య దర్శకుడు శివ శంకర్‌ తరచు చెప్పే మాటలివి. కరోనాతో పోరాడిన ఆయన ఆదివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. కోట్లాది మందిని హృదయాలను తన నృత్యంతో గెలుచుకున్న ఆయన మృత్యువు ముందు గెలవలేకపోయారు. ఆయన అనుకున్నట్లుగానే చనిపోవడానికి కొద్దిరోజుల ముందు వరకూ ఆయనకు ఇష్టమైన వృత్తితో బిజీగానే ఉన్నారు.

Siva shankar Master: ఊపిరి ఎంతో.. చేసే పని అంతే!

‘‘వృత్తి బోర్‌ కొడితే ఎందుకీ జన్మ! ఐ యామ్‌ ఎంజాయింగ్‌. ప్రాణం పోయే దాకా ఊపిరి పీలుస్తూనే ఉంటాం కదా! సో... నాలో శక్తి ఉన్నంత వరకూ పనిచేస్తూనే ఉండాలన్నది నా జీవిత ఆశయం’’ ప్రముఖ నృత్య దర్శకుడు శివ శంకర్‌ తరచు చెప్పే మాటలివి. కరోనాతో పోరాడిన ఆయన ఆదివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. కోట్లాది మందిని హృదయాలను తన నృత్యంతో గెలుచుకున్న ఆయన మృత్యువు ముందు  గెలవలేకపోయారు. ఆయన అనుకున్నట్లుగానే చనిపోవడానికి కొద్దిరోజుల ముందు వరకూ ఆయనకు ఇష్టమైన వృత్తితో బిజీగానే ఉన్నారు. సినిమాల్లో కొరియోగ్రఫీ అవకాశాలు లేని సమయంలో నటుడిగానూ బిజీ అయ్యారు. శివ శంకర్‌ మాస్టర్‌ చెప్పుకొచ్చిన ఆసక్తికర విషయాలు... 


‘‘నా ఎక్స్‌ప్రెషన్స్‌ చూసి చాలామంది ఆడతనమని అనుకుంటారు.  కానీ నాలో రౌద్రం కూడా ఉంది. నాట్యం లలిత కళ. శివశంకర్‌లో శివుడు ఉన్నాడు... శంకరీ ఉంది! మా గురువుగారు నటరాజ పంతులు చిన్న పాపను చూసి కూడా నమస్కారం చేస్తారు. పాఠశాలలో అయ్యవార్ల పిల్లలంతా పంచ, జుబ్బా, విబూధి పెట్టుకుని సంప్రదాయబద్దంగా వచ్చేవారు. అది చూసి చిన్నప్పటి నుంచీ హిందూ ధర్మంగా అలా కట్టు, బొట్టూ అలవాటు చేసుకున్నా’’

ఆ అలవాటు లేదు...

‘‘మొదటి నుంచీ నేను బంగారం ధరించేవాడిని. ఒకసారి శరత్‌కుమార్‌, మీనా సినిమా కోసం రాత్రి 2 గంటలకు నాకు రైలు బుక్‌ చేశారు. రాత్రి ఆభరణాలు వేసుకుని పడుకునే అలవాటు లేదు. నగలన్నీ బ్యాగ్‌లో పెట్టుకున్నాను. రైలు ఎక్కిన తరువాత ఆ బ్యాగ్‌ పోయింది. అప్పటి నుంచి బంగారం వేయడం లేదు.
ఒక సాంగ్‌కు రూ.750 

కెరీర్‌ మొదలుపెట్టిన కొత్తలో వెంటనే ఏవో అవకాశాలు వచ్చేస్తాయనుకున్నా. కానీ ఏమీ రాలేదు. ప్రదర్శనలివ్వాలంటే ఎదురు డబ్బులు పెట్టుకోవాల్సిన పరిస్థితి. మా నాన్నేమో... ‘నువ్వు డ్యాన్స్‌ నేర్చుకుంటానంటే నేర్పించాను. ఇక నీ జీవితం నువ్వు జీవించాలి. నా నుంచి ఒక్క పైసా కూడా ఆశించొద్దు’ అని చెప్పేశారు. ఆ రోజుల్లోనే (1974) నా అరంగేట్రం కోసం ఆయన లక్ష రూపాయలు ఖర్చు పెట్టారు. అవకాశాల కోసం ఏడాది తిరిగినా ఫలితం లేదు. తరువాత సలీం గారికి అసిస్టెంట్‌ కావాలని తెలిసింది. తెలిసినవారి ద్వారా సలీం గారి దగ్గరకు వెళ్లాను. అలా సినిమా రంగ ప్రవేశం చేశాను. అప్పట్లో ఒక సాంగ్‌కు రూ.750 వచ్చేది. తొలినాళ్లలో గ్రూపు డ్యాన్సర్లతో కలిసి 20 పాటల వరకూ చేసుంటాను. అయితే నా రూటు వేరు. అసిస్టెంట్‌గా ఉంటే అన్నీ నేర్చుకోవచ్చన్నది ఆలోచన. కొంత కాలానికి వేరే మాస్టర్‌ దగ్గరకు వెళితే ఇంకొన్ని కొత్త స్టయిల్స్‌ నేర్చుకోవచ్చని పసుమర్తి కృష్ణమూర్తి, సుందరం మాస్టర్‌, చిన్ని సంపత్‌, హీరాలాల్‌ వద్ద అసిస్టెంట్‌గా చేశాను. 


సిల్క్‌ స్మితకు నాకు గొడవల్లేవ్‌! 

సిల్క్‌స్మిత అంటే చాలా గౌరవం నాకు. ఇండస్ట్రీలో ఆవిడలా కాస్టూమ్స్‌ వేసుకొనేవాళ్లని చూడలేదు. బాంబేలో రేఖ... ఇక్కడ స్మిత. ఆమెకు పేరు ప్రఖ్యాతులు వచ్చిన తరువాత సొంతంగా డ్యాన్స్‌ మాస్టర్లను తయారు చేసుకుంది. పెద్ద డ్యాన్స్‌ మాస్టర్‌ పులిగిరి సరోజను ఆమె రిఫర్‌ చేసేది. ఆమె దొరక్కపోతే మాలాంటి వాళ్లను పెడితే... స్మిత సరిగా చేయదు. నానా యాతన పెట్టేది. ఆవిడ చెప్పిన డ్యాన్స్‌ మాస్టర్‌ లేకపోతే  ఆవిడతో కష్టం. బాలయ్య బాబు ‘భలే తమ్ముడు’ షూటింగ్‌. అందులో నాలుగు పాటలు చేశాను. ఐదో పాట స్మితతో చేయాలి. అప్పుడు రిహార్సల్స్‌ తరువాత ఇంటికొచ్చాను. కంపెనీ నుంచి ఫోన్‌ వచ్చింది... ‘మాస్టర్‌... స్మితకు మీకు గొడవేంటి’ అని! ‘నాకేం లేదండీ’ అని చెప్పాను. ‘ఏమైందో తెలియదు మాస్టారూ... మీతో చేయనంటుంది స్మిత’ అని కంపెనీ వాళ్లు చెప్పారు. ‘మాస్టారు బాగా కంపోజ్‌ చేశారు. స్మిత చేయనంటే వేరే వాళ్లని తీసుకోండి’ అని నిర్మాత అర్జున్‌రాజు గారు చెప్పారు. స్మితను అడిగితే... ‘నేను చేయను’ అంటూ అడ్వాన్స్‌ చెక్‌ వెనక్కి ఇచ్చేసింది. నాకు బాధేసింది. తరువాత జయమాలినితో ఆ సాంగ్‌ తీశాం. అక్కడి నుంచి నేనే ఆవిడకి దూరమయ్యా. నేను అసిస్టెంట్‌గా ఉన్నప్పుడు ఆవిడ సలీం మాస్టర్‌ గారి దగ్గరకు వచ్చి డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చేసేది. సలీం మాస్టర్‌ బాగా బిజీ. నన్ను అసిస్టెంట్‌గా చూసింది ఆవిడ. నేను డ్యాన్స్‌ మాస్టర్‌ను అయ్యాక... ‘ఇతని దగ్గర చేయాలా’ అన్న ఫీలింగ్‌ అయ్యుండవచ్చు ఆమెకు! బట్‌ నేను మాత్రం స్మితకు అప్పుడు... ఇప్పుడు చాలా గౌరవం ఇస్తాను. చనిపోయినప్పుడు కూడా వెళ్లాను. 


ఇంకో మూమెంట్‌ అనేవారు...

నేను ఎప్పుడూ ఒకటికి పది మూమెంట్లు ఆలోచించి పెట్టుకుంటా. చిరంజీవి గారయితే... ‘మాస్టర్‌... ఇంకో మూమెంట్‌ చేయండి’ అని అడుగుతుంటారు. వాటిల్లో ఆయన సెలెక్ట్‌ చేసుకుంటారు. హీ ఈజ్‌ ఏ బ్యూటిఫుల్‌ డ్యాన్సర్‌.  ‘మగధీర’ పాటకు ఆరేడు కంపోజ్‌ చేశాను. రాజమౌళి గారు వచ్చి ‘చాలా బాగుంది. కానీ నా పాటలో హీరో డ్యాన్స్‌ చేయకూడదు. హీరోయిన్‌కు మాతమే మూమెంట్లు ఇవ్వండి’ అని చెప్పారు. అలా ఆరు రకాలు రెడీ చేశాను. ఏడోసారి కంపోజ్‌ చేయగానే ఓకే అన్నారు. 


Updated Date - 2021-11-29T19:20:00+05:30 IST