సీనియర్ జర్నలిస్ట్, మ్యూజికాలజిస్ట్ రాజా ఇక లేరు
ABN, First Publish Date - 2021-04-15T23:46:15+05:30
‘హాసం’ రాజాగా సుపరిచితులైన సీనియర్ జర్నలిస్ట్ రాజా గురువారం హైదరాబాద్‌లో కన్ను మూశారు. ఆయనకు 70 ఏళ్లు. ఆయన అసలు పేరు మంగు నరసింహ స్వామి. బికామ్ చదువుకొన్న రాజా 1974లో ‘వెండితెర’ సినీ వారపత్రికలో
‘హాసం’ రాజాగా సుపరిచితులైన సీనియర్ జర్నలిస్ట్ రాజా గురువారం హైదరాబాద్‌లో కన్ను మూశారు. ఆయనకు 70 ఏళ్లు. ఆయన అసలు పేరు మంగు నరసింహ స్వామి. బికామ్ చదువుకొన్న రాజా 1974లో ‘వెండితెర’ సినీ వారపత్రికలో జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత ‘సినీ హెరాల్డ్’ వార పత్రికలో చేరారు. ఎంతో మంది సినీ ప్రముఖులను ఇంటర్వ్యూ చేయడమే కాకుండా ‘సినీ స్వరాలు’ పేరుతో ఆయన నిర్వహించిన శీర్షిక సినీ సంగీత ప్రపంచానికి దగ్గర చేసింది. అలాగే ‘సితార’ సినీ వారపత్రికలో రాజా నిర్వహించిన ‘సితారాగాలు’, ‘కూనిరాగాలు’ శీర్షికలు రాజాకు ఎంతో పేరు తెచ్చాయి. ‘పల్లకి’ వారపత్రికలో పని చేస్తున్న సమయంలోనే రాజా రాసిన ‘మల్లాది వెంకట కృష్ణమూర్తి’ సీరియల్ తెలుగు సాహిత్యంలో ఓ కొత్త ప్రయోగంగా గుర్తింపు తెచ్చుకొంది.
‘పల్లకి’ తర్వాత ‘ఆంధ్రభూమి’, ‘సితార’, ‘జ్యోతిచిత్ర’ సినిమా పత్రికల్లో ‘ఈ పాట ఇలా పుట్టింది’ అనే శీర్షికను నిర్వహించారు రాజా. అలాగే ఓ దినపత్రికలో ‘ఆ పాత మధురం’ పేరుతో ఆయన నిర్వహించిన శీర్షిక ఎంతో పేరు తెచ్చింది. అలాగే ‘హాసం’ హాస్య సంగీత పక్ష పత్రికకు ఎడిటర్‌గా చాలా కాలం పనిచేశారు రాజా. మ్యూజికాలజిస్టుగా సినిమా పాటలను విశ్లేషించడంలో రాజా తన ప్రత్యేకత చూపేవారు. అంతేకాకుండా ఆ పాటల తమిళ, హిందీ, కన్నడ, బెంగాలీ, ఆంగ్ల పాటల మూలాలను వెలికితీసి ఆ వివరాలను పాఠకులకు అందించేవారు రాజా. ఆ పత్రిక మూసేసిన అనంతరం ‘మా టీవీ’లో పదేళ్లు పనిచేశారు. అక్కడ సినీ ప్రముఖులతో చేసిన ‘గుర్తుకొస్తున్నాయి’ శీర్షిక ఆయనకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. సినీ సంగీతంకు తను చేసిన పరిశోధనలకుగానూ గౌరవ డాక్టరేట్ పొందిన రాజా.. తెలుగు సినిమా పాటలు, వాటి రాగాలపై ‘ఆ పాత మధురం’ పుస్తకాన్ని కూడా రాశారు. తెలుగు సినిమా పాటకు సంబంధించి సినీ ప్రముఖుల్లో ఎవరికి ఎలాంటి సందేహం కలిగినా వెంటనే రాజాను సంప్రదించేవారు. తెలుగు సినిమా పాటలకు సంబందించిన పూర్తి వివరాలు అందరికీ అందుబాటులో ఉండాలనే ఆలోచనతో ‘రాజా మ్యూజిక్ బ్యాంక్’ ఏర్పాటు చేసి, దాదాపు 40 వేల పాటలు సేకరించారు రాజా. ఆ మృతి వార్త తెలిసిన సినీ, మీడియా ప్రముఖులు నివాళులు అర్పిస్తూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.