మొత్తానికి ధైర్యం చేసి.. రియా చక్రవర్తిని దింపారు
ABN , First Publish Date - 2021-03-19T02:11:30+05:30 IST
బాలీవుడ్‌లో వస్తున్న బిగ్ బి స్టారర్ ‘’చెహ్రే’’ రెండు కారణాలకి ఇటీవల బాగా పాప్యులారిటీని సంతరించుకుంది. ఒకటి బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటిస్తున్నందుకు. రెండోది, ఇందులో అమితాబ్, ఇమ్రాన్ హష్మిలతో పాటుగా
బాలీవుడ్‌లో వస్తున్న బిగ్ బి స్టారర్ ‘’చెహ్రే’’ రెండు కారణాలకి ఇటీవల బాగా పాప్యులారిటీని సంతరించుకుంది. ఒకటి బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటిస్తున్నందుకు. రెండోది, ఇందులో అమితాబ్, ఇమ్రాన్ హష్మిలతో పాటుగా మరో ప్రధానపాత్రను పోషిస్తున్న రియా చక్రవర్తి. ఆమె గతేడాది ఎదుర్కొన్న సిబిఐ విచారణలు, జైలుకి వెళ్ళడాలు.. వంటి వాటితో రియా ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిపోయింది. ఓ వంద సూపర్‌హిట్ సినిమాలు నటించినా కూడా వస్తుందో లేదో తెలియని, ఊహించనంత పాప్యులారిటీ ఈ కేసుల గొడవతో రియాకి వచ్చింది. అయితే రియా ఎంజాయ్ చేయగలిగే ఫేం అండ్ నేం కావివి. నటిగా ఎదిగి ఎత్తులపైన నిలబడాలని చిత్రపరిశ్రమలోకి వచ్చిన రియాకి ఈ దశ చాలా బాధాకరమైనది. గోరుచుట్టు మీద రోకటి పోటులా.. ఈ సంక్షోభం ఇలా ఉండగా.. నటిగా ఆమె కుమిలిపోయి, కృంగిపోయిన పరిణామం ఏంటంటే.. ఆమె అమితాబ్, ఇమ్రాన్ హష్మిలాంటి హై కేస్టింగ్‌తో కలసి నటించిన గొప్ప అవకాశాన్ని అందుకుని కూడా పబ్లిసిటీ ఆరంభమైన తర్వాత అందులో ఆమె జాడే లేకపోవడం రియా ఊహించని ఎదురుదెబ్బ. పైగా తన వృత్తిగత జీవితానికి సంబంధించిన చేదు అనుభవం ఇది.
సినిమా చాలా బాగా వచ్చిందంటున్నారు. క్రైమ్ అండ్ సస్పెన్స్ ఎలిమెంట్‌తో తయారైన చెహ్రేలో అమితాబ్ గెటప్ కొంచెం హ్యారీ పోటర్ గెటప్‌కి అతి సమీపంలో ఉండడం అన్నది ట్రైలర్‌కి, తద్వారా సినిమాకి కొంత ప్లస్ పాయింటే అయింది. అందరూ వ్యాఖ్యానిస్తున్నట్టుగా ఏ కారణం చేతనైతేనేం.. సినిమా గనక హిట్ అయితే మొత్తం క్రెడిట్ రియా చక్రవర్తి తీసుకుపోవడం మాత్రం ఖాయం.

ఫైనల్‌గా విడుదల చేసిన ట్రైలర్‌లో మాత్రం సడెన్‌గా రియా ప్రత్యక్షమయింది. మీడియా షాక్ అయింది. చెహ్రే తారాగణం కాదు, సంగీతం కాదు, కథాకథనాలు కావు.. మొత్తం ఆసక్తికి కేంద్రబిందువుగా రియా చెహ్రే సినిమాని డామినేట్ చేసేసింది. దర్శకుడు రూమీ జాఫ్రీ చివరికి అందరికీ మీడియా ముఖంగా సంజాయిషీలు గుప్పించాల్సి వచ్చింది. రియా మీద షూట్ చేసిన పార్ట్‌ని రూమీ కట్ చేసి, మరొక ఆర్టిస్టుతో షూట్ చేసే ఉంటాడని దర్శకుడి మీద బాలీవుడ్ అంతా అనుమానాలు తెగ చక్కర్లు కొట్టాయి. అందుకే రియా ఎక్కడా పోస్టర్‌లోనూ, టీజర్‌లోనూ కూడా దర్శనమీయలేదు అన్నది ఎవరి వాదన వారిదిగా చెహ్రే సినిమాకి బ్రహ్మాండమైన పబ్లిసిటీ వచ్చేసింది- రూపాయి ఖర్చు లేకుండా. ఎప్పుడైతే రియా ట్రైలర్‌లో తళుక్కుమందో మళ్ళీ బాలీవుడ్ మీడియా రియాని ప్రశంసల వరదలో ముంచెత్తింది. ఈరోజు నిజంగానే రియాకి ఓ గొప్పరోజు అని అభిమానులు పోస్టులు కుమ్మేశారు. నిజంగానే రియా చక్రవర్తికిది గొప్ప నైతికవిజయం. అమితాబ్ మొత్తం కెరీర్‌లోనే.. అంటే ఆయన బాలీవుడ్ బాద్‌షాగా ఎదిగిన తర్వాత తను నటించిన సినిమాలో తన గురించి కాకుండా మరో ఆర్టిస్టు గురించి మాట్లాడుకున్న మొదటి సందర్భం ఇదేనేమో బహుశా.

పాపం..రియా మదర్స్ డే నాడు అమ్మ చేయి పట్టుకుని తీయించుకున్న ఫోటోని ఇన్‌స్టాగ్రాంలో అప్‌లోడ్ చేసి అమ్మే నాకు ధైర్యం, నా బలం అని మెసేజ్ పెట్టగానే, అందరి సింపతీని టన్నులు టన్నులు సంపాదించుకోగలిగింది. కానీ ఇవేవి కూడా నటిగా ఎదగాలనుకున్న ఏ ఆర్టిస్టుకి కూడా ఉపశమనాన్ని అందించలేవు కదా. అదే చెహ్రే పబ్లిసిటీలో గనక తననీ దర్శకనిర్మాతలు ఇమిడ్చి ఉంటే ఆ సంతృప్తి, ఆ స్వాంతన వేరేగా ఉండేవి. కానీ మరో విషయం.. రియాని ముందే పెట్టి ఉంటే కూడా రానంత క్రేజ్, పెట్టనందుకు రియాకి రావడం ఇక్కడ గమనార్హం. అసలు అమితాబ్, హష్మిల కన్నా రియా గురించే దేశం మొత్తం మాట్లాడుకుంది. అమితాబ్‌ని కూడా వదిలేసి, చెహ్రే సినిమా రియా చక్రవర్తి సినిమాలా తయారైంది చివరికి. అమితాబ్ వయోవృద్దుడై ఉండి కూడా ఓ ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంటే పట్టించుకోలేదన్న చెడ్డపేరును కూడా మీడియా పనిగట్టుకుని అమితాబ్‌కి అంటగట్టేసింది. అమితాబ్ భరించక తప్పలేదు.

మొదట విడుదల చేసిన పోస్టర్‌లో గానీ, రెండో దశలో విడుదల చేసిన టీజర్‌లో గానీ రియా ఆచూకియే బొత్తిగా లేకపోయింది. బాలీవుడ్ మీడియా ఈ విషయాన్ని గుర్తించింది.. ఘాటుగానే స్పందించింది కూడా. ఎడాపెడా, ఛడామడా సోషల్ మీడియాలో ఉతికి ఆరేసింది యూనిట్ మొత్తాన్ని. అయినా మేకర్స్ నుంచి ఎటువంటి స్పందన లభించకపోగా, నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఇది మరీ పెద్ద చర్చకు దారి తీసింది. మరోవైపు రియాని తీసిపారేయమని సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అభిమానులు, అనుయాయులు డిమాండ్లతో రెచ్చిపోయారు. టోటల్‌గా వారి ఆగ్రహానికి గురవుతామని అనుకున్నారో ఏమో.. లేదా ఇలాంటి అప్రదిష్ట తెచ్చుకున్న నటిని ఫస్ట్ ఫేజ్ పబ్లిసిటీలోనే ఫోకస్ చేయడం ఇష్టం లేకనో.. దర్శకనిర్మాతలు రియాని పోస్టర్, టీజర్‌లలో నిర్దాక్ష్యంగా కట్ చేసేశారు.
