Review 2021: ఓటీటీ విజయాలు..

ABN , First Publish Date - 2021-12-28T19:14:06+05:30 IST

గత ఏడాది ముందువరకు మెజారిటీ శాతం ప్రేక్షకులకు ఓటీటీ అంటే అంతగా అవగాహన, ఆసక్తి లేదనే చెప్పాలి. మేకర్స్ కూడా వీటి మీద అంతగా దృష్ఠిపెట్టింది లేదు. ఎప్పుడైతే కరోనా మహమ్మారి విజృంభించి ప్రళయం

Review 2021: ఓటీటీ విజయాలు..

గత ఏడాది ముందువరకు మెజారిటీ శాతం ప్రేక్షకులకు ఓటీటీ అంటే అంతగా అవగాహన, ఆసక్తి లేదనే చెప్పాలి. మేకర్స్ కూడా వీటి మీద అంతగా దృష్ఠిపెట్టింది లేదు. ఎప్పుడైతే కరోనా మహమ్మారి విజృంభించి ప్రళయం సృష్ఠించిందో అప్పటి నుంచి ప్రేక్షకుల ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయింది. ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే ఒణికిపోయారు. ఇక థియేటర్స్ వరకు వెళ్ళి సినిమా చూసేందుకు ఎవరు మాత్రం ధైర్యం చేస్తారు. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడం వల్ల మన రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఈ ప్రక్రియలో భాగంగా అన్నీ థియేటర్స్ మూతపడ్డాయి. దాంతో కొబ్బరికాయ కొట్టిన సినిమాల దగ్గర్నుంచి గుమ్మడికాయ కొట్టిన సినిమాలవరకు అర్ధాంతరంగా ఆగిపోయాయి. సెన్సార్ పూర్తయిన సినిమాల పరిస్థితి ఏంటో తెలియక నిర్మాతలు అయోమయంలో పడ్డారు. అలాంటి సమయంలో చిత్రపరిశ్రమకు ఊరట లభించిందంటే ..చాలావరకు నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారంటే ఓటీటీల మూలంగానే. చిన్న సినిమా నుంచి పెద్ద బడ్జెట్ సినిమాల వరకు భాషతో సంబంధం లేకుండా మంచి డీల్ కుదుర్చుకొని ఓటీటీ ప్లాట్ ఫాంస్ ద్వారా ప్రేక్షకులకు అందించారు. దాంతో థియేటర్స్‌కు వెళ్ళి సినిమా చూడాలనే ఆలోచనను మార్చుకున్న అభిమానులు, ప్రేక్షకులు ఈ ఓటీటీలకు బాగా ఆకర్షితులయ్యారు. దాంతో చాలా సినిమాలు 2021లో డిజిటల్ ప్లాట్ ఫాంస్‌లో విడుదలై అలరించాయి. అలాంటి చిత్రాలను ఒకసారి పరిశీలిద్దాం.. 


టక్ జగదీష్: సెకండ్ వేవ్ లాక్‌డౌన్ కారణంగా ఈ ఏడాది మళ్ళీ థియేటర్స్ మూతపడిన సంగతి తెలిసిందే. అప్పటికే రెండు మూడు సార్లు పోస్ట్ పోన్ అయిన నాని టక్ జగదీష్ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. అంతకముందు నానితో దర్శకుడిగా మొదటి సినిమా నిన్ను కోరి తీసి హిట్  ఇచ్చిన శివ నిర్వాణ ఈ సినిమాను రూపొందించాడు. తెలుగమ్మాయి రూతూవర్మ హీరోయిన్‌గా.. ఐశ్వర్య రాజేశ్, జగపతిబాబు లాంటి వారు కీలక పాతల్లో నటించారు. షైన్‌ స్క్రీన్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మాతలు సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది నిర్మించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే, ఈ సినిమాతో నిర్మాతలు సేఫ్ అయ్యారని టాక్ వచ్చింది.


నారప్ప: 2019లో రూపొందించిన తమిళ చిత్రం అసురన్ సినిమాకు రీమేక్‌గా తెలుగులో నారప్ప చిత్రాన్ని రూపొందించారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విక్టరీ వెంకటేశ్, ప్రియమణి ప్రధాన పాత్రలు పోషించారు. పెళ్లి తర్వాత ప్రియమణి రీ ఎంట్రీ ఇస్తూ నటించిన మొదటి సినిమా ఇది. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ దాటుకొని ..థియేటర్స్ కోసం వెయిట్ చేయకుండా నిర్మాతలు ఓటీటీలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. ముందు కాస్త నెగిటివ్ టాక్ వినిపించినా కూడా వెంకీ మేకోవర్, ఊర మాస్ పర్ఫార్మెన్స్‌తో విపరీతంగా ఆకట్టుకున్నారు. జాతీయ అవార్డ్ దక్కించుకున్న ప్రియమణి, రాజీవ్ కనకాల సహా ఇతర పాత్రలు ప్రేక్షకులను అలరించాయి. అంచనాలకు తగ్గట్టుగానే నారప్ప మంచి విజయాన్ని అందుకుంది. రీమేక్ చిత్రాలతో ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్న వెంకటేశ్ ఖాతాలో ఇది కూడా చేరింది. తమ సినిమాలను ఓటీటీలలో రిలీజ్ చేసేయొచ్చు అనే ధైర్యాన్ని నిర్మాతలకు ఇచ్చిన సినిమా కూడా నారప్ప కావడం విశేషం. 


దృశ్యం 2: తమిళ హిట్ సినిమా రీమేక్ నారప్పతో హిట్ అందుకున్న వెంకటేశ్ కొద్ది గ్యాప్‌లోనే మలయాళ సూపర్ హిట్ సిరీస్ దృశ్యం 2తో వచ్చారు. ఈ సినిమా కూడా ఓటీటీలో విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మలయాళ వెర్షన్ రెండు భాగాలలో మోహన్ లాల్, మీనా నటించారు. అలాగే, తెలుగు వెర్షన్ రెండు భాగాలలో కూడా వెంకటేశ్, మీనా నటించారు. అతికొద్ది రోజుల్లో షూటింగ్ పూర్తి చేసిన చిత్రబృందం..ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఓటీటీ ద్వారా ప్రేక్షకులకు అందించారు. రీమేక్ చిత్రాలు మన వెంకీకి బాగా కలిసొస్తాయి. ఆ విషయం ‘దృశ్యం 2’  సూపర్ హిట్ సాధించి మరోసారి నిరూపించింది. 


మాస్ట్రో: యూత్‌స్టార్ నితిన్ భీష్మ లాంటి మంచి కమర్షియల్ హిట్ తర్వాత వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెట్టాడు. వాటిలో ఈ ఏడాది ప్రారంభంలోనే ఒక నెల తేడాతో చెక్, రంగ్ దే చిత్రాలతో వచ్చాడు. చెక్ నితిన్‌ను తీవ్రంగా నిరాశపరచగా, రంగ్ దే మాత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటించింది. వెంకీ అట్లూరి తెరకెక్కించాడు. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ హిట్ సినిమా అంధాదున్ తెలుగు రీమేక్‌గా వచ్చింది మాస్ట్రో. ఇందులో నితిన్ అంధుడిగా నటించాడు. ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేశ్ హీరోయిన్‌గా, మిల్కీ బ్యూటీ తమన్నా కీలక పాత్రలో నటించారు. బాలీవుడ్ ఒరిజినల్ వెర్షన్‌లో నటించిన హీరో ఆయుష్మాన్ ఖురానాతో పాటు టబు, రాధిక ఆప్టేలకు వచ్చిన పేరు తెలుగులో మాత్రం రాలేదనే చెప్పాలి. ఛాలెంజింగ్ రోల్ చేసిన నితిన్ మాస్ట్రో సినిమాపై చాలా నమ్మకాలు పెట్టుకున్నాడు. కానీ, ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేపోయింది.


ఏక్ మినీ కథ: అగ్ర నిర్మాణ సంస్థలు యూవీ క్రియేషన్స్ సంస్థ అనుబంధ సంస్థ యువీ కాన్సెప్ట్ బ్యానర్‌లో మ్యాంగో మాస్ మీడియాతో కలిసి నిర్మించిన చిన్న బడ్జెట్ చిత్రమిది. ఇందులో సంతోష్‌ శోభన్, కావ్య థాపర్, శ్రద్ధా దాస్, బ్రహ్మాజీ, సుదర్శన్, హర్షవర్ధన్, సప్తగిరి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు కార్తీక్ రాపోలు దర్శకత్వం వహించాడు. చిన్న సినిమాగా వచ్చి ఓటీటీలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా సక్సెస్‌తో హీరో సంతోష్ శోభన్‌కు వరుస అవకాశాలు దక్కాయి. 


అద్భుతం -  ఆకాశవాణి: ఇదే క్రమంలో యంగ్ హీరో తేజ సజ్జా నటించిన అద్భుతం, ఆకాశవాణి చిత్రాలు వచ్చాయి. థియేటర్స్‌లో విడుదల చేయాలనుకున్న ఈ సినిమాలు కూడా కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఓటీటీ బాట పట్టాయి. వీటిలో ఆకాశవాణి చిత్రం సినీ ప్రముఖుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్‌పై పద్మనాభ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహించగా.. సముద్రఖని, వినయ్ వర్మ, తేజ కాకుమాను, ప్రశాంత్ ప్రధాన పాత్రల్లో నటించారు. 


జై భీమ్: తెలుగులో మాత్రమే కాదు తమిళ చిత్రాలలో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని అందుకున్న చిత్రం సూర్య సొంత బ్యానర్‌లో నిర్మించి నటించిన జై భీమ్. 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మించిన ఈ సినిమాకు కె.జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. రజిషా విజయన్‌, ప్రకాశ్‌రాజ్‌, రావు రమేష్, మణికందన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో.. నవంబరులో రిలీజై కమర్షియల్ హిట్ సాధించింది. సూర్య గత చిత్రం ఆకాశం నీ హద్దురా కూడా గత ఏడాది ఇలా ఓటీటీలో వచ్చి హిట్ సాధించింది. పెద్ద సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేసి కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చు..భారీ హిట్ సాధించవచ్చు.. అని ప్రూవ్ చేసింది సూర్యనే అని చెప్పాలి.


నెట్రికణ్: సౌత్ స్టార్ స్టార్ హీరోయిన్ నయనతార ప్రధాన పాత్రలో నటించిన నెట్రికన్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలైంది. తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటించిన అన్నాబెల్లె సేతుపతి, తుగ్లక్ దర్బార్, లాభం చిత్రాలు ఓటీటీ ద్వారానే విడుదలయ్యాయి. అయితే, నయనతార నటించిన నెట్రికణ్ హిట్ టాక్ తెచ్చుకోగా, విజయ్ సేతుపతి నటించిన మూడు చిత్రాలు మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేపోయాయి.  రాధే: హిందీలో కండల వీరుడు సల్మాన్ ఖాన్, క్రేజీ బ్యూటీ దిశా పటాని జంటగా.. ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందిన రాధే భారీ అంచనాల మధ్య ఒకేసారి థియేటర్స్‌తో పాటు ఓటీటీలోనూ రిలీజ్ చేశారు. ఓపెనింగ్స్ బావున్నా..పెద్ద కమర్షియల్ సక్సెస్ అని మొదట్లో టాక్ వినిపించినా ఫైనల్‌గా ఈ చిత్రం ఫ్లాప్ టాక్‌తో సరిపెట్టుకుంది. ఇదే వరుసలో ప్రముఖ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ నటించిన షేర్ని చిత్రం ఓటీటీలో వచ్చి ఆకట్టుకుంది. మరో స్టార్ హీరోయిన్ కృతి సనన్ నటించిన ప్రయోగాత్మక చిత్రం మిమి కూడా ఓటీటీలోనే రిలీజ్ చేశారు. అలాగే, ఈ ఏడాది మరికొన్ని హిందీ చిత్రాలు ఓటీటీలో వచ్చి ప్రేక్షకులను అలరించాయి. ఇక మలయాళ, కన్నడ చిత్రాలు కూడా ఈ ఏడాది ఓటీటీలో వచ్చి ఆకట్టుకున్నాయి. వీటిలో కొన్నిటిని తెలుగులో డబ్బింగ్ చేసి ఆహా ఓటీటీ ద్వారా రిలీజ్ చేశారు.  


ఇలా కరోనా కారణంగా 2021లో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషా చిత్రాలే కాకుండా విదేశీ చిత్రాలు కూడా ఓటీటీ ద్వారానే రిలీజై నిర్మాతలను చాలా వరకు ఆదుకున్నాయి. నిజంగా గత ఏడాది నుంచి కరోనా వేవ్స్ కారణంగా థియేటర్స్ మూతపడినప్పటికీ.. ఓటీటీలు చిత్రపరిశ్రమను చాలా వరకు బ్రతికించాయని చెప్పక తప్పదు. వీటివల్ల ఎంతోమంది నిర్మాతలు ఊపిరిపీల్చుకున్నారు. 

-గోవింద్ కుంచాల


Updated Date - 2021-12-28T19:14:06+05:30 IST