ఆర్‌ఆర్‌ఆర్ కోసం రిలీజ్ డేట్ మార్చారు
ABN , First Publish Date - 2021-11-16T05:56:53+05:30 IST
అలియా భట్ ప్రధాన పాత్రను పోషించిన ‘గంగూబాయి కతియావాడి’ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 6న విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు సంజయ్ లీలా భన్సాలీ, జయంతీలాల్ గడ ఇంతకుముందు ప్రకటించారు...

అలియా భట్ ప్రధాన పాత్రను పోషించిన ‘గంగూబాయి కతియావాడి’ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 6న విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు సంజయ్ లీలా భన్సాలీ, జయంతీలాల్ గడ ఇంతకుముందు ప్రకటించారు. అయితే అదే రోజున జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా తన దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రాన్ని రిలీజ్ చేయాలని రాజమౌళి ప్లాన్ చేశారు. ఈ చిత్రంలో కూడా అలియా భట్ కథానాయికగా కాగా, అజయ్ దేవగణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. రెండు భారీ చిత్రాలు ఒకేరోజు ఉత్తరాదిన విడుదల అయితే ఇబ్బందే. అందుకే ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రానికి దారి ఇస్తూ ‘గంగూబాయి కతియావాడి’ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 18న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు సోమవారం ప్రకటించారు. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి ‘గంగూబాయి’ టీమ్‌ను ట్విట్టర్ ద్వారా అభినందించారు.
ఓ వేశ్య అందరినీ శాసించే నాయకురాలిగా ఎలా ఎదిగిందనే కథాంశంతో ‘గంగూబాయి కతియావాడి’ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలి. ప్రముఖ జర్నలిస్టు హుస్సేన్ జైదీ రాసిన ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై’ అనే పుస్తకం ఆధారంగా ఈ చిత్రం తయారవుతోంది.