‘రంగ్ దే’ ట్రైలర్: నితిన్‌ని తొక్కేసిన కీర్తిసురేష్
ABN , First Publish Date - 2021-03-20T01:02:13+05:30 IST
యూత్ స్టార్ నితిన్, 'మహానటి' కీర్తిసురేష్‌ల కాంబినేషన్‌లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించిన చిత్రం 'రంగ్ దే'. 'తొలిప్రేమ', 'మిస్టర్ మజ్ను' చిత్రాల సృష్టి కర్త వెంకీ అట్లూరి
యూత్ స్టార్ నితిన్, 'మహానటి' కీర్తిసురేష్‌ల కాంబినేషన్‌లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించిన చిత్రం 'రంగ్ దే'. 'తొలిప్రేమ', 'మిస్టర్ మజ్ను' చిత్రాల సృష్టి కర్త వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. పివిడి ప్రసాద్ సమర్పణలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుండటంతో.. చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. శుక్రవారం ఈ చిత్ర ట్రైలర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉండటమే కాకుండా.. సినిమాపై భారీగా అంచనాలను పెంచేదిగా ఉంది.
ట్రైలర్ విషయానికి వస్తే.. 'నువ్వేకావాలి' తరహాలో స్టార్టింగే కీర్తిసురేష్ డామినేషన్‌తో మొదలైన ఈ ట్రైలర్.. అడుగడుగునా నితిన్ జీవితాన్ని తొక్కేస్తూనే నడిచింది. సరదా సరదాగా.. సాగుతూ ఎంటర్‌టైన్‌మెంట్‌కి తిరుగులేదు అనుకునే లోపే.. ట్రైలర్ ఎమోషనల్‌గా మారిపోయింది. మధ్యలో నితిన్, కీర్తి రొమాన్స్.. ఫ్యామిలీ సెంటిమెంట్, 'ఖుషి' తరహాలో ఫైట్.. ఒక్కటేమిటి.. అన్ని రసాలు ఈ సినిమాలో మిక్స్ అయినట్లుగా ట్రైలర్‌లో చూపించారు. వెంకీ అట్లూరి 'మిస్టర్ మజ్ను' ఛాయలు కనిపిస్తున్నా.. ఈ చిత్రాన్ని ఓ డిఫరెంట్ స్టైల్‌లో, డిఫరెంట్ కథాంశంతో తెరకెక్కించారనేలా ట్రైలర్‌ని కట్ చేశారు. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు.. అనే తరహాలో.. 'ఈసారి గొడవ.. కలవడానికి చెయ్.. గెలవడానికి కాదు' అని లోతుగా తగిలే డైలాగ్, అంతకుముందు నువ్వు మగాడివిరా బుజ్జి అని కీర్తి సురేష్ నితిన్‌ని సర్టిఫై చేయడం.. వంటివి సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయి. ఓవరాల్‌గా.. ట్రైలర్ మాత్రం తొక్కేసేలా ఉంది.