విలన్‌ అనే పదానికే నిర్వచనం ఆయనే

ABN , First Publish Date - 2021-01-03T03:53:47+05:30 IST

విలన్‌ అనే పదానికే నిర్వచనంగా నిలిచిన మహా నటులలో రాజనాల ముందు వరుసలో నిలుస్తారు. దాదాపు నాలుగు దశాబ్దాలకుపైగా 400 పై చిలుకు చిత్రాల్లో

విలన్‌ అనే పదానికే నిర్వచనం ఆయనే

విలన్‌ అనే పదానికే నిర్వచనంగా నిలిచిన మహా నటులలో రాజనాల ముందు వరుసలో నిలుస్తారు. దాదాపు నాలుగు దశాబ్దాలకుపైగా 400 పై చిలుకు చిత్రాల్లో నటించిన రాజనాల జయంతి జనవరి 3. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతినాయక పాత్రల ప్రస్తావన రాగానే ముందుగా గుర్తొచ్చే పేరు రాజనాల. ఇంటిపేరుతోనే పాపులరైన రాజనాల అసలు పేరు కాళేశ్వరరావు. పౌరాణిక, జానపద, సాంఘిక ఇలా.. ఏ తరహా సినిమాయైనా తనదైన గాంభీర్య నటనతో ఆయా పాత్రలకు ఆయన వన్నె తెచ్చారు. మంచి శరీర సౌష్టవంతో కథానాయకులకు దీటుగా కనిపిస్తూ.. ప్రతినాయక పాత్రలలో క్రూరత్వాన్ని అద్భుతంగా పండించేవారు రాజనాల. దుష్ట పాత్రలలో రాజనాల నవ్వే నవ్వు చాలా ప్రసిద్ధి. వెండితెరపై కంసుడు, జరాసంధుడు, మాయాల ఫకీరు, భూకామందు, దొంగల నాయకుడు అనగానే ఆయా పాత్రలలో రాజనాలనే గుర్తు చేసుకుంటారు ప్రేక్షకులు. 


దాదాపు 45 ఏళ్ళు అత్యంత వైభవంగా బతికిన రాజనాల చివరి దశలో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. 1979లో భార్య మరణించడంతో ఆయన వైభవం తగ్గుతూ వచ్చింది. 1984లో ఆయన కుమారుడు కులవర్ధన్‌ మూర్ఛవ్యాధితో మృతి చెందగా, మరో కుమారుడు కాళీచరణ్‌ బొంబాయి వెళ్లి అదృశ్యమయ్యారు. దీంతో 1991లో మద్రాసులో ఉన్నవన్నీ అమ్మేసి మిత్రులు, శ్రేయోభిలాషుల సహాయంతో హైదరాబాద్‌ చేరుకున్నారు. 1995లో ‘తెలుగువీర లేవరా’ సినిమా షూటింగులో ఉండగా కాలికి దెబ్బ తగిలింది. అది ఇన్‌ ఫెక్షన్‌ కావడంతో 1995 డిసెంబరులో కాలు తీసేశారు. అభిమానుల సహాయంతో చివరి రోజుల్లో జ్యోతిష్యం, అష్టసాముద్రికం చెప్పుకుని జీవించారు. రాజనాల 1998 మే 21న హైదరాబాద్‌లో మృతి చెందారు. 

Updated Date - 2021-01-03T03:53:47+05:30 IST