నాని ఇంతుంటాడు.. ప్రభాస్‌కి క్లాప్స్.. అల్లు అర్జున్ తగ్గేదే లే!

ABN , First Publish Date - 2021-12-28T03:09:17+05:30 IST

మహానుభావుడు కె. విశ్వనాధ్‌గారు ‘శంకరాభరణం’ చిత్రం చూసి ప్రపంచ చలన చిత్ర పటం మీద తెలుగు సినిమా పరిశ్రమ గొప్పతనాన్ని నిలబెట్టారు. తర్వాత మన రాజమౌళిగారు ‘బాహుబలి’ తీసి.. ప్రపంచ చలన చిత్ర పటం మీద మరోసారి తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయి ఏంటో చూపించారు. ఆ దారిలో ఇప్పుడు అనేకమంది

నాని ఇంతుంటాడు.. ప్రభాస్‌కి క్లాప్స్.. అల్లు అర్జున్ తగ్గేదే లే!

ప్రభాస్, అల్లు అర్జున్, నానిలపై ఆర్. నారాయణ మూర్తి పొగడ్తల వర్షం

న్యాచురల్ స్టార్ నాని, సాయిపల్లవి, కృతిశెట్టి నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రం మంచి విజయం సాధించడంతో సోమవారం చిత్రయూనిట్ సక్సెస్ మీట్‌ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చిత్రయూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపించిన పీపుల్ స్టార్.. తెలుగు సినిమా స్థాయిని పెంచారంటూ ప్రభాస్, అల్లు అర్జున్, నానిలపై పొగడ్తలతో కొనియాడారు. 


ఆయన మాట్లాడుతూ.. ‘‘మన సౌత్ ఇండియాలో సంక్రాంతి పండగ జరుపుకుంటాం. నార్త్ ఇండియాలో దీపావళి పండగ చేసుకుంటారు. ఈస్టర్న్ స్టేట్స్‌లో నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటాం. ఇవాళ బెంగాల్‌లో నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఏ బెంగాల్‌లో ఈ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయో ఆ ఉత్సవాలను, ఆ గొప్పతనాన్ని, ఆ కలకత్తా కాళీ నాలుక మహోన్నత బీభత్సాన్ని ఈ సినిమా ద్వారా ప్రపంచానికి చూపించారు. నిర్మాత బోయనపల్లి వెంకట్‌గారు ఎంత మంచి వ్యక్తి. నాని గురించి మాట్లాడుతూ.. ఆయన గురించి నేను ఏమి చెప్పగలను అని అన్నారు. ఆయనకి నా సెల్యూట్. నిర్మాత అంటే అలా ఉండాలి. అలాగే ఈ చిత్రానికి బ్యాక్ బోన్‌గా నిలబడి అమోఘమైన సహాయ సహకారాలు అందించిన దిల్ రాజు గారికి నమస్కారాలు. సాయి పల్లవిని ఫస్ట్ టైం ఎక్కడ చూశానంటే.. రాజు గారి సినిమా ‘ఫిదా’లో చూశా. హీరోయిన్‌లా కాకుండా పక్కంటిపిల్లలా ఉండే అమ్మాయి సాయి పల్లవి. ఇది క్లాసిక్ కమర్షియల్ ఫిల్మ్. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు రాహుల్ సంకృత్యాన్‌గారిని నా సెల్యూట్. చాలా గ్యాప్ తర్వాత నేనొక అద్భుతమైన సినిమా చూశా. రాహుల్ సంకృత్యాన్ అని అతనికి పేరు పెట్టిన ఆ తల్లిదండ్రులు ధన్యులు. సాంకేతిక నిపుణులందరూ ప్రాణం పెట్టి చేశారు. వారందరికీ నా సెల్యూట్.


ఇక నాని గురించి చెప్పుకుంటే.. తెలుగు ఆమిర్ ఖాన్ అతను. పర్‌ఫెక్షన్ అద్భుతం. అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీఆర్, దిలీప్ కుమార్, శివాజీ గణేషన్.. ఒక్కరూ కాదు అందరూ గుర్తొచ్చారు. నాని బ్రదర్ నటనకి నా సెల్యూట్. చూస్తే ఇంతుంటాడు.. నటన మాత్రం అద్భుతం.. అందుకే సెల్యూట్. ఇంటర్వెల్ తర్వాత శ్యామ్ సింగరాయ్‌గా నాని మీసం తిప్పుతుంటే.. అబ్బ.. ఆ స్టయిల్ ఎంత బాగుందిరా.. అని అనిపించింది. ఆయన గెటప్ హైలెట్. ఆయనని చూసి గర్వపడుతున్నాను. 


కరోనా మహమ్మారితో యావత్ ప్రపంచం భయాందోళనలో మునిగిపోయి.. సినిమా ఇండస్ట్రీ అల్లకల్లోలం అవుతున్న దశలో.. సినిమా ఇండస్ట్రీకి ఇక ఓటీటీయే దిక్కా.. అని భయకంపితమైన దశలో.. సినిమా సినిమాయే.. థియేటర్ థియేటరే అని నిరూపించారు. ‘అఖండ’తో జనం గగ్గోలు పెట్టి మరీ బీభత్సంగా సినిమాని చూస్తున్నారు. కార్తీకమాసంలో ఎప్పుడైతే ‘అఖండ’ వచ్చిందో.. జనం నీరాజనాలు పడుతున్నారు. తర్వాత ‘పుష్ప’ . ఏం పుష్ప?. ఇప్పటికే ఇండియా వైడ్‌గా రూ. 250 కోట్లు వసూలు చేసింది. పుష్ప ర్యాంపేజ్ బీభత్సం. ఇప్పుడు ‘శ్యామ్ సింగరాయ్’.. మళ్లీ బీభత్సం. సినిమా థియేటర్లన్నీ ఎంత ఆహ్లాదకరంగా, ఆనందంగా మారిపోయాయో.. చూస్తుంటే.. మన తెలుగు సినిమా పరిశ్రమ అంతా గర్వించాలి. ఇది మన పండగ. మీరు గొప్ప చిత్రమిస్తే.. కరోనా, ఓమైక్రాన్ వంటి వాటిని కూడా లెక్క చేయకుండా.. మేము చూస్తామని నిరూపించిన ప్రేక్షకదేవుళ్లకు శిరసు వంచి నమస్కరిస్తున్నా. అందరికీ నేనొక విషయం చెప్పాలి. గత రోజుల్లో తమిళనాడు నుండి కానీ, ముంబై నుండి కానీ హీరోలు, దర్శకులు వస్తే.. వారు చెప్పే మాటల కోసం తెలుగు మీడియా వెంటపడేది. అలాంటి ఫాలోయింగ్, దశ మన తెలుగు వారికి ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూస్తున్న దశలో.. ఇవాళ యావత్ భారతదేశంలో నెంబర్ వన్ మన తెలుగు సినిమా ఇండస్ట్రీ.. తెలుగు రచయితలు, తెలుగు దర్శకులు... నిర్మాతలు, నటీనటులు. శభాష్. ఇప్పుడు మనం ప్రపంచ సినిమాతో పోటీ పడుతున్నాం. మనోడు ముంబై వెళితే మీడియా వస్తుంది. చెన్నై వెళితే మీడియా వస్తుంది.. ఎక్కడికి మనోడు వెళ్లినా మీడియా వస్తుంది. ఆ స్థాయికి మన చిత్ర పరిశ్రమ వచ్చింది. గర్వంగా ఉంది.. సెల్యూట్. 


మహానుభావుడు కె. విశ్వనాధ్‌గారు ‘శంకరాభరణం’ చిత్రం చూసి ప్రపంచ చలన చిత్ర పటం మీద తెలుగు సినిమా పరిశ్రమ గొప్పతనాన్ని నిలబెట్టారు. తర్వాత మన రాజమౌళిగారు ‘బాహుబలి’ తీసి.. ప్రపంచ చలన చిత్ర పటం మీద మరోసారి తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయి ఏంటో చూపించారు. ఆ దారిలో ఇప్పుడు అనేకమంది మహామహులు పయనిస్తున్నారు. ఇక్కడ ఇంకోటి గమనించాలి. ఆల్ ఓవర్ ఇండియాలో మన తెలుగు హీరోలెవరూ ఇంతవరకూ స్టాండ్ కాలేదు. ఇంతకు ముందు పైడి జయరాజ్ అనే అతనొక్కడే ఉండేవాడు. ఆయన తర్వాత హీరోయిన్లు చాలా మంది హిందీ ఫీల్డ్‌లో మంచి పేరు తెచ్చుకున్నారు కానీ.. హీరోలెవరూ నిలబడలేకపోయారు. ఇవాళ ‘బాహుబలి’, ‘సాహో’ దెబ్బకి మన ప్రభాస్ అక్కడ దుమ్ముదులుపుతున్నాడు. పాన్ ఇండియా హీరో అయ్యాడు. ఇది మనం గర్వపడే విషయం. ప్రభాస్ ఆ స్థాయికి వచ్చినందుకు సెల్యూట్ చేస్తున్నా. అమితాబ్, సల్మాన్, ఆమిర్‌లకు కాదు.. మన ప్రభాస్‌కి కొట్టాలి క్లాప్స్. సెకండ్ అల్లు అర్జున్. ఏం తమ్ముడసలతను. నేను కేరళ వెళ్లి.. ఒక చిన్న హోటల్‌లో దిగా. అక్కడ హోటల్‌లో పనిచేసే తమ్ముళ్లు నా దగ్గరకు వచ్చారు. వాళ్లని.. ఇక్కడ టాప్ యాక్టర్స్ ఎవరని అడిగా. మీరు నమ్ముతారో లేదో.. మోహన్ లాల్, మమ్ముట్టి, అల్లు అర్జున్ అని చెప్పారు. అరే అది మలయాళం. అక్కడ అల్లు అర్జున్ టాప్ హీరో. ఇంతకుముందు మనం ఏం సినిమా చూసినా.. ‘షోలే’లోని అరెవో సాంబా అనే డైలాగ్, అమితాబచ్చన్ డైలాగ్స్, రజినీకాంత్ భాషా సినిమా డైలాగ్స్ వినబడేవి. కానీ ఇవాళ.. అల్లు అర్జున్ చెప్పిన ‘తగ్గేదే లే’ అనే డైలాగ్ ప్రపంచమంతా ఇమిటేట్ చేస్తోంది. అది తెలుగు హీరోల, దర్శకుల, సినిమాల గొప్పతనం. ఇది చూసి ఈరోజు మేము పండగ చేసుకుంటున్నాం..’’ అని అన్నారు. Updated Date - 2021-12-28T03:09:17+05:30 IST