తెలుగు సినిమాలో నా ట్రెండ్‌ వేరు!

ABN , First Publish Date - 2021-08-29T05:36:08+05:30 IST

చైతన్యం.. విప్లవం.. ఆయన సినిమాకు రెండు కళ్లు. సామాజిక చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన ఆ దర్శకుడే.. ఆర్‌. నారాయణమూర్తి. జయాపజయాలతో సంబంధం లేకుండా తక్కువ బడ్జెట్‌తో సినిమాలు తీయడంలో...

తెలుగు సినిమాలో నా ట్రెండ్‌ వేరు!

  • చైతన్యం.. విప్లవం.. ఆయన సినిమాకు రెండు కళ్లు. సామాజిక చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన ఆ దర్శకుడే.. ఆర్‌. నారాయణమూర్తి. జయాపజయాలతో సంబంధం లేకుండా తక్కువ బడ్జెట్‌తో సినిమాలు తీయడంలో ఈయనకు సాటిలేరెవ్వరూ. మూడు దశాబ్దాలకు పైబడినా ఎర్రదారి మార్చుకోని నటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత ఆయన. ఇటీవల ‘రైతన్న’ చిత్రం కొన్ని థియేటర్లలోనే విడుదలైంది. త్వరలో మరిన్ని థియేటర్లలో విడుదల చేయడానికి రెడీ అవుతున్న సందర్భంగా ఆర్‌. నారాయణమూర్తి తన ప్రయాణాన్ని, జీవితానుభవాలను ‘నవ్య’తో  పంచుకున్నారిలా... 


తూర్పు గోదావరి జిల్లాలోని రోతంపూడి మండలం, మల్లంపేట గ్రామం మాది. మూరుమూల పల్లె.  రైతు బిడ్డను. అమ్మ పేరు రెడ్డి చిట్టెమ్మ, నాన్న పేరు రెడ్డి చిన్నయ్య నాయుడు. మేం నలుగురం అన్నదమ్ములం, ముగ్గురు ఆడపిల్లలున్నారు.


రోతంపూడిలో ఐదోతరగతి వరకూ, శంఖవరం అనే ఊరిలో హైస్కూల్‌ చదివా. పెద్దాపురం ఎమ్‌.ఆర్‌. కాలేజీలో బి.ఏ పాసయ్యా. చిన్నప్పటి నుంచి సినిమా పిచ్చి ఉండేది. ఎన్టీఆర్‌, కాంతారావు పౌరాణిక, జానపద సినిమాలు చూసి కత్తి యుద్ధాలు చేసేవాళ్లం. బడిలో ఉన్నప్పుడే సామాజిక స్పృహ ఉండేది. ఎక్కడ సమస్య ఉన్నా నేనే ముందు ఉండేవాడిని. ఓ ఏడాది.. మా ఊర్లో వంక ఎండిపోయింది. నూతిలో నీరు తోడుకొనేందుకు దళితులొస్తే కొందరు అడ్డగించారు. వారి రక్తం, వారి స్వేదం చిందించి బావిని తవ్వితే.. వారికే నీళ్లు లేవా? అని బాధపడ్డా. ఆ నీటి ఉద్యమంలో పాల్గొన్నా. ఇదే విధంగా 1964లో జరిగిన  ‘విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు’ ఉద్యమంలో కూడా పాల్గొన్నా.


మహా కరుణామయి..

బీహార్‌ వరద బాధితుల కోసం చందాలు వసూలు చేయడానికి పెద్దాపురంలోని దర్గానగర్‌కు మిత్రులతో కలిసి వెళ్లా. ఒకామే ఇంట్లో ఉండే బియ్యం సంచిని తెచ్చి ఇచ్చేసింది. ఆ తర్వాత బట్టలు ఇచ్చేసింది. మేము బయలుదేరి వెళ్లిపోతుంటే- ‘‘బాబూ.. డబ్బులు ఇవ్వలేకపోయా. ఈ రోజు రాత్రికి నాకు కచ్చితంగా బేరాలు వస్తాయి. వచ్చిందంతా రేప్పొద్దున మీకు ఇస్తా..’’ అంది. మర్నాడు అన్నట్లే డబ్బులు ఇచ్చింది. ఆమె వృత్తి ఏదైనా కావచ్చు. కానీ ఆమె దయాగుణం తలుచుకుంటే ఇప్పటికీ కన్నీళ్లొస్తాయి.  ఆదుకోవాలనే మనసున్న ఆమెను మించిన మహనీయులెవ్వరుంటారు?


కేరాఫ్‌ పాండీబజార్‌..

సినిమా పిచ్చితో ఇంటర్‌లో ఇంగ్లీష్‌లో తప్పా. మద్రాసు వెళ్తే రామారావు, నాగేశ్వరావులా హీరోనయిపోతాననే ఆశతో అమ్మ దగ్గర 70 రూపాయలు తీసుకొని..  మెయిలెక్కేసా. వారం రోజుల్లో డబ్బులు ఖర్చయిపోయాయి. తిండి లేదు. ఉండటానికి గూడు లేదు. పాండిబజార్‌ పార్కు నా కేరాఫ్‌ అడ్రస్సు. బాగా ఆకలేస్తే- హోటల్‌కు వెళ్లి.. ‘పని చేస్తా.. భోజనం పెడతారా?’ అని అడిగేవాడిని. ఒక రోజు ‘తాతా మనవడు’ షూటింగ్‌ లొకేషన్‌కు వెళ్లా. గురువుగారు దాసరిని తొలిసారి చూసింది అప్పుడే! ఆయన దగ్గరకు వెళ్లి వేషం అడిగా. రంగరావుగారిలా డైలాగ్స్‌ చెప్పి చూపించా. అప్పటికప్పుడు ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌ బొమ్మలు వేసి చూపించా! ఆయన ‘తమ్ముడు’ అని నా భుజం మీద చేయి వేశారు. ‘ఏదైనా వేషం ఇప్పించండి.. సారూ’ అని ఆయనను అభ్యర్థించా. ‘బి.ఏ’ చదివి వచ్చేయ్‌’ అన్నారు. ఇంటికి తిరిగి వెళ్లే లోపులో ఏదో ఒక వేషం వేయాలనేది నా కోరిక. ఆ సమయంలో శరభయ్య అనే జూనియర్‌ ఆర్టిస్ట్‌ సప్లైయర్‌ సాయంతో - ‘నేరము-శిక్ష’లో ఒక చిన్న వేషం వేశా. ఆ షూటింగ్‌ పూర్తయిన తర్వాత ఊరెళ్లిపోయా. రౌతంపూడిలోని వెంకటేశ్వర టాకీస్‌లో ఆ సినిమా విడుదలయింది. తెర మీద నేను కనబడగానే ‘అదిగోరా.. రెడ్డిబాబు’ (అది నా ముద్దు పేరు) అని చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు. జనం చూపించే ఆ ప్రేమతో నా మనసు నిండిపోయింది. సినిమాల్లోకి ఎలాగైనా వెళ్లాలనే బలమైన సంకల్పానికి ఆ చప్పట్లే పునాదని చెప్పాలి. చెప్పినట్లే డిగ్రీ పాస్‌ అయిన తర్వాత ‘నీడ’ అనే చిత్రంలో గురువుగారు అవకాశమిచ్చారు. ఆ సినిమాలో నాది రెండో హీరో వేషం. కృష్ణగారి అబ్బాయి రమేష్‌ ఆ సినిమాలో హీరో. ఒక సీన్‌లో టేక్‌లు మీద టేక్‌లు తీసుకుంటున్నా. గురువుగారికి కోపం వచ్చింది. కొట్టారు. నాకూ కోపం వచ్చింది. ‘నన్ను కొడతారు. కానీ రమేష్‌ సరిగ్గా చేయకపోతే ఏమి అనరేం..’ అని ఉక్రోషంతో ప్రశ్నించా.  ‘నాకు వేషం కావాలని నువ్వు వచ్చి నన్ను అడిగావని’ గుర్తుంచుకో పిచ్చాడా! చెప్పింది చేయ్‌..’ అని కసురుకున్నారు. 


అందుకే దర్శకుడినయ్యా.. 

‘నీడ’ చిత్రం పెద్ద హిట్‌. వంద రోజుల సభ ఘనంగా జరిగింది. అందులో ఏఎన్నాఆర్‌ నాకు షీల్డ్‌ ఇవ్వటం నాకు ఇంకా గుర్తుంది. నేను నటించిన సినిమా హిట్‌ అయింది కానీ వేషాలేమి రాలేదు. చేతిలో డబ్బుల్లేవు. ఇంటి నుంచి డబ్బులు పంపమని అడగలేను. హీరో కావాలని వచ్చిన నేను జీరోగా మిగిలిపోతానా? అనే బాధ వెంటాడుతూ ఉండేది. నన్ను హీరోగా పెట్టి సినిమాలు ఎవరూ తీయరు. హీరో కావాలంటే నా సినిమాలు నేనే తీసుకోవాలి. అయితే చేతిలో చిల్లిగవ్వలేదు. అప్పుడు నా చిన్ననాటి స్నేహితులు ఆదుకున్నారు. వారి సహకారంతో ‘స్నేహచిత్ర’ బ్యానర్‌ ప్రారంభించా. ‘అర్ధరాత్రి స్వతంత్య్రం’ తీసాం. అప్పటినుంచీ ఆ బ్యానర్‌ మీద చిత్రాలు తీస్తూనే ఉన్నా. తాజాగా ‘రైతన్న’ కూడా తీసా.  కొన్ని థియేటర్లలోనే విడుదల చేశాం. చేసిన ప్రతి చోటా మంచి స్పందన వచ్చింది. ఈ నెలాఖరు నుంచి మరి కొన్ని ప్రాంతాల్లో విడుదల చేయబోతున్నా. మిగిలిన వాటితో పోలిస్తే- నా చిత్రాలలో సామాజిక సమస్యలే ప్రధానమైన పాత్ర పోషిస్తాయి. తెలుగు సినిమాల్లో నాదొక ట్రెండ్‌. ఉద్యమకారులు, ప్రజాకవులు, గాయకులు, రైతులు, ఉద్యోగులు- అందరూ ఏదో ఒక సమయంలో నా సినిమాలను ఆదరించినవారే! నా సినిమాలు బ్లాక్‌ బస్టర్లు కావటంతో- మిగిలిన హీరోలు కూడా ఆ ట్రెండ్‌ను ఫాలో అవటం మొదలుపెట్టారు. అన్నీ సామాజిక చిత్రాలు కావటంతో ప్రేక్షకులకు మోనాటనీ వచ్చింది. ఆదరించలేదు. పరాజయాలు వచ్చినా భయపడలేదు. ఒక విధంగా చెప్పాలంటే సముద్రానికి ఎదురీదుతున్నా. ప్రజల కోసం.. వారి సమస్యల పరిష్కారాలు చూపిస్తూ నేను సినిమాలు తీస్తున్నా. వాటిని ఆదరిస్తారనే నమ్మకం నాకు ఉంది. ఒక చిన్న పల్లె నుంచి వచ్చినవాడిని. కొన్ని కోట్ల మంది ప్రజల ఆదరణను పొందా. అంతకన్నా నాకేం కావాలి?


పెళ్లి తప్పనిసరి..

నేను బ్రహ్మచారిని. పెళ్లి చేసుకోలేదు. దీని వెనక ఒక కారణముంది. అమ్మ,నాన్న చాలా మంచి వాళ్లు. కానీ కులం, మతం పట్టింపులు ఎక్కువ. ఒక అంటరాని వ్యక్తిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నానని.. మా నాన్న నన్ను తరిమి తరిమి కొట్టాడు. అప్పటి పరిస్థితులు అంత ఘోరంగా ఉండేవి. నేను నటుడిని అయిన తర్వాత- ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఇంట్లో అడిగా. వాళ్లకు ఇష్టం లేదు. వేరే వాళ్లను చేసుకోవటం నాకు ఇష్టం లేదు. దాంతో బ్రహ్మచారిగానే ఉండిపోయా. కానీ వయస్సు పెరుగుతున్న కొలది తోడు అవసరం. తోడు లేకపోతే ఒంటరితనం వేధిస్తూ ఉంటుంది. అందుకే పెళ్లి చేసుకోననే కుర్రాళ్లకు నేను పెళ్లిచేసుకొమ్మని సలహా ఇస్తూ ఉంటా. ఏ వయస్సులో జరిగే ముచ్చట ఆ వయస్సులో జరగాలి. లేకపోతే ఇబ్బందే!


కోట్లు సంపాదించా..

ఉద్యమ చిత్రాలతో నేను కోట్లు సంపాదించా. సంపాదించిందంతా తెలుగు రాష్ట్రాలలో విద్య, వైద్యం, రోడ్డువేయించడం-లాంటి కార్యక్రమాలకు ఖర్చు పెట్టా. నేను ఆస్తులు కూడబెట్టలేదు. కనీసం కారు కూడా కొనుక్కొలేదు. కేవలం సినిమానే జీవితంగా బతికా. నాకే కాదు.. మా అమ్మ,నాన్నలకు కూడా డబ్బుల యావ లేదు. నాన్న 95 ఏళ్లు బతికారు. నా విజయాలు, అపజయాలు చూశారు. అమ్మకు 90 ఏళ్లు. ఇప్పటికి కూడా నన్ను చూసి అమ్మ గర్వంగా ఫీలవుతుంది. ‘‘ప్రజలకు మేలు చేస్తున్నావు.. మంచి పనిచేస్తున్నావు.. అదే ముఖ్యమ’’ని ఆశీర్వదిస్తుంది. 


వెటకారమే దీవెన..

జూనియర్‌ ఆర్టిస్టుగా వేషాలు వేస్తున్నపుడు- సప్లయర్లు మమల్ని స్టూడియోలకు పంపేవారు. అక్కడ మమల్ని చూసే విధానమే భిన్నంగా ఉండేది. అందరినీ నేల మీద కూర్చోపెట్టి టిఫిన్లు పెట్టేవారు. నేను ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చినవాడిని. పైగా విద్యార్థి నాయకుడిని. నన్ను కూడా జూనియర్‌ ఆర్టిస్ట్‌ సప్లైయర్లు తక్కువగా చూస్తుంటే బాధ కలిగేది. కానీ ఎదురుతిరిగితే ఆ వేషం కూడా పోతుంది. ఒక రోజు వాహినీ స్టూడియోకి షూటింగ్‌కు వెళ్లాం. కార్మికుడి పాత్ర నాది. అందరికీ బట్టలు ఇస్తూ- నాకు ఒక జత ఇచ్చారు. ‘ఈ డ్రస్సు వాసన వేస్తోంది... వేరే డ్రస్సు ఇవ్వండి’ అని కాస్ట్యూమర్‌ని అడిగా. అతను వెటకారంగా- ‘ఇది ఎంజీఆర్‌ వేసుకున్న డ్రస్సు.. వేసుకో..’ అన్నాడు. కంపు కొడుతున్న ఆ డ్రస్సునే వేసుకున్నా. బహుశా అతని వెటకారమే - ఆశీర్వాదంగా మారి నన్ను హీరోని చేసి ఉంటుంది.


- సివిఎల్‌ఎన్‌

Updated Date - 2021-08-29T05:36:08+05:30 IST