తలదించుకునే సినిమాలు తీయం: ‘ఎఫ్‌సీయూకే’ నిర్మాత
ABN , First Publish Date - 2021-01-19T01:02:06+05:30 IST
జగపతిబాబు ప్రధాన పాత్రధారిగా.. రామ్ కార్తీక్, అమ్ము అభిరామి యువ జంటగా ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ శ్రీ రంజిత్ మూవీస్ నిర్మిస్తోన్న 14వ చిత్రం

జగపతిబాబు ప్రధాన పాత్రధారిగా.. రామ్ కార్తీక్, అమ్ము అభిరామి యువ జంటగా ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ శ్రీ రంజిత్ మూవీస్ నిర్మిస్తోన్న 14వ చిత్రం 'ఫాదర్-చిట్టి-ఉమ- కార్తీక్'. టైటిల్‌లోని మరో ప్రధాన పాత్ర చిట్టిగా బేబి సహశ్రిత నటిస్తోంది. ఈ చిత్రానికి విద్యాసాగర్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. షార్ట్‌కట్‌లో ఈ సినిమా 'ఎఫ్‌సీయూకే'గా పాపులర్ అయ్యింది. ఇప్పటివరకూ నాలుగు ప్రధాన పాత్రలకు సంబంధించి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్‌తో పాటు రీసెంట్‌గా టీజర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని చిత్రయూనిట్ ప్రకటించింది. ఫిబ్రవరి 12న 'ఎఫ్‌సీయూకే'ను విడుదల కానుంది. ఈ విషయాన్ని తెలిపేందుకు సోమవారం రామానాయుడు స్టూడియోస్‌లో చిత్ర బృందం మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో ముందుగా సోమవారం మృతి చెందిన సుప్రసిద్ధ నిర్మాత, పంపిణీదారుడు వి. దొరస్వామిరాజుకు నివాళులర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.
ఈ కార్యక్రమంలో నిర్మాత దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. "ఉదయమే దొరస్వామిరాజుగారి మృతి వార్త విచారం కలిగించింది. ఆయనతో నాన్నగారి (రంజిత్ కుమార్)కి ఎంతో అనుబంధం ఉంది. కరోనా మహమ్మారి దెబ్బకు ఇండస్ట్రీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. అయితే సోలో బ్రతుకే సో బెటర్, క్రాక్, రెడ్, అల్లుడు అదుర్స్ సినిమాల నిర్మాతలు ధైర్యం చేసి, థియేటర్లలో వాటిని రిలీజ్ చేయడం, ప్రేక్షకులు అంతే ధైర్యంగా థియేటర్లకు వచ్చి వాటిని చూసి సక్సెస్ చేయడం ఇండస్ట్రీలోని వారందరికీ ధైర్యాన్నిచ్చింది. ఈ విషయంలో నిర్మాతలు, దర్శకులు, హీరోలకు, ప్రేక్షకులకు థాంక్స్ చెబుతున్నాను. 'ఎఫ్‌సీయూకే' టైటిల్ చూసి కొంతమంది వేరే అర్థం వస్తుందని అన్నారు. అందరికీ ఒక విషయం స్పష్టం చేయదలచుకున్నా. శ్రీ రంజిత్ మూవీస్ ఎప్పుడూ ఎవరూ తలదించుకొనే సినిమాలు తీయదు. సినిమా అనేది వ్యాపారమైనప్పటికీ కొన్ని విలువలతో సినిమాలు తీస్తూ వస్తున్నాను. 'ఎఫ్‌సీయూకే' కూడా అట్లాంటి సినిమానే. నిజానికి 2020 ఏప్రిల్‌లోనే ఈ సినిమాను తెద్దామనుకున్నాం. పాండమిక్ వల్ల వాయిదాపడి ఇప్పుడు రిలీజ్‌కు ప్లాన్ చేశాం. ఫిబ్రవరి 12న సినిమాని విడుదల చేస్తున్నాం. అలాగే మేం నిర్మించిన 'అలా మొదలైంది' చిత్రం విడుదలై జనవరి 21కి పదేళ్లు పూర్తి చేసుకుంటోంది. నా లైఫ్‌లో ఆ సినిమా ఓ ట్యాగ్‌లైన్‌లా మారిపోయింది. ఆ సినిమా అంత పెద్ద హిట్టవడానికి కారణం మీడియా.." అని అన్నారు.