పొట్టి వీరయ్య మృతి
ABN, First Publish Date - 2021-04-26T06:14:31+05:30
నటుడు పొట్టి వీరయ్య (70) ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ఆదివారం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు....
నటుడు పొట్టి వీరయ్య (70) ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ఆదివారం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన అసలు పేరు గట్టు వీరయ్య. ఆయన ఎత్తు రెండు అడుగులే. అందుకని, పొట్టి వీరయ్య అని పిలుస్తుంటారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం - నాలుగు దక్షిణాది భాషల్లో 500లకు పైగా చిత్రాలు, 100కు పైగా టీవీ కార్యక్రమాల్లో నటించిన వీరయ్య స్వస్థలం నల్గొండ జిల్లా సూర్యాపేట తాలూకాలోని ఫణిగిరి గ్రామం.
విఠలాచార్య ‘అగ్గిదొర’తో తెరంగేట్రం
వీరయ్యకు చిన్నతనం నుంచి నటన అంటే ఆసక్తి. స్కూల్లో నాటకాలు వేశారు. మఖ్యంగా ఆంజనేయుడు, బాలనాగమ్మ నాటకంలో మాయలఫకీరు సహాయకుడి పాత్ర ఆయనకు పేరు తెచ్చాయి. హెచ్.ఎస్.సి (1964-65) ఫెయిల్ అవ్వడంతో ఉద్యోగం కోసం నల్గొండ వెళ్లారు. ఎత్తును సాకుగా చూపించి ఉద్యోగం ఎవరిస్తారని హేళన చేయడంతో... సినిమా అవకాశాల కోసం అప్పటి మద్రాసు వెళ్లారు. తొలుత సినిమాలకు డెకరేషన్ చేసే పూలషాపులో 90 పైసల జీతానికి కొన్ని రోజులు పని చేశారు. తర్వాత శోభన్‌బాబు సలహాతో విఠలాచార్యను కలిశారు. రూ.500 అడ్వాన్స్ చేతిలో పెట్టారు. కాంతారావు హీరోగా రూపొందించిన జానపద చిత్రం ‘అగ్గిదొర’ (1967)లో అవకాశం ఇచ్చారు. నటుడిగా వీరయ్యను వెండితెరకు పరిచయం చేసిన విఠలాచార్య... తర్వాత తన ప్రతి చిత్రంలోనూ అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించారు. దర్శకుడిగా దాసరి నారాయణ రావు తొలి చిత్రం ‘తాతామనవడు’లో వీరయ్య నటించిన తొలి సాంఘిక చిత్రం. దాసరి ‘రాధమ్మపెళ్లి’ చిత్రంలో ఆయన హిజ్రాగా నటించారు. ‘బ్రహ్మపుత్రుడు’కి వీరయ్య తొలిసారి రూ.25 వేలు పారితోషికం అందుకున్నారు.
ఎన్టీఆర్ నుంచి చిరంజీవి వరకూ...
తెలుగులో ఎన్టీఆర్, ఎయన్నార్ నుంచి కృష్ణ, చిరంజీవి వరకూ... అగ్ర హీరోలు అందరితోనూ వీరయ్య నటించారు. తమిళంలో ఎంజీ రామచంద్రన్, శివాజీ గణేశన్, రజనీకాంత్, నంబియార్ తదితరులతో నటించారు. ‘‘వేళైకారన్’ చిత్రంలో రజనీకాంత్‌తో గోళీకాయలు ఆడే సన్నివేశంలో ఆయన నన్ను ‘అన్నా’ అని పిలవడం... నేను ‘ఒరేయ్’ అనడం బాగా రక్తికట్టింది’’ అని వీరయ్య చెప్పేవారు. ‘జగన్మోహిని’, ‘సుగుణ సుందరి కథ’, ‘టార్జాన్ సుందరి’, ‘రాధమ్మ పెళ్లి’ లాంటి చిత్రాలు నటుడుగా ఆయనకు గుర్తింపు తెచ్చాయి. మద్రాసు నుంచి తెలుగు చిత్రసీమ హైదరాబాద్ తరలి వచ్చినప్పుడు... పరిశ్రమతో పాటు వీరయ్య హైదరాబాద్ వచ్చారు. వయసు మీద పడిన తర్వాత అనారోగ్య సమస్యలకు తోడు అవకాశాలు తగ్గడంతో కొన్నాళ్లు ఎస్టీడీ బూత్ నడిపారు. ఆయనకు పెద్ద పేగు ఆపరేషన్ జరిగిన సందర్భంలో చిరంజీవి, దాసరి నారాయణరావు ఆర్థికంగా ఆదుకున్నారు. సోమవారం జూబ్లీ హిల్స్ మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.