'పీనట్ డైమండ్' ట్రైలర్ ఎలా ఉందంటే..!
ABN , First Publish Date - 2021-03-20T22:52:20+05:30 IST
ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాల సందడి బాగా ఎక్కువైంది. పేరుకే చిన్న సినిమా అయినప్పటికీ మేకింగ్ పరంగా రిచ్‌నెస్ ఉండేలా నిర్మాతలు బాగానే ఖర్చు చేస్తున్నారు. క్వాలిటీ విషయంలో ఏమాత్రం కామ్రమైజ్ కాకుండా
ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాల సందడి బాగా ఎక్కువైంది. పేరుకే చిన్న సినిమా అయినప్పటికీ మేకింగ్ పరంగా రిచ్‌నెస్ ఉండేలా నిర్మాతలు బాగానే ఖర్చు చేస్తున్నారు. క్వాలిటీ విషయంలో ఏమాత్రం కామ్రమైజ్ కాకుండా నిర్మిస్తున్న మీడియం బడ్జెట్ సినిమాలే సంచలన విజయాలను అందుకుంటున్నాయి. అందుకు ఉదాహరణ పెళ్ళి చూపులు, కేరాఫ్ కంచెర పాలెం .. ఇటీవల వచ్చి దేశ విదేశాలలో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ళని రాబడుతున్న జాతి రత్నం లాంటి సినిమాలే. ప్రస్తుతం ప్రేక్షకుల మైండ్ సెట్ మారింది. కథ బావుంటే ఆ సినిమాలో స్టార్ లేరన్న విషయాన్ని కూడా పట్టించుకోవడం లేదు. రిపీటెడ్‌గా సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్నారు. అలాంటి సినిమా మరొకటి ప్రస్తుతం రూపొందుతోంది.
ఎఎస్‌పి మీడియా హౌస్, జివి ఐడియాస్ పతాకాలపై ప్రొడ క్షన్ నెం.1గా తెరకెక్కుతోంది 'పీనట్ డైమండ్'. వెంకటేష్ త్రిపర్ణ కథ, మాటలు, స్క్రీన్ ప్లే్‌తో పాటు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అభినవ్ సర్ధార్, రామ్ కార్తిక్, చాందిని తమిళ్‌రాసన్, శాని సాల్మాన్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. అభినవ్ సర్ధార్, వెంకటేష్ త్రిపర్ణ నిర్మాతలుగా రూపొందుతోన్న ఈ సినిమాకి బెంగాల్ టైగర్ ఫేమ్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. జె. ప్రభాకర రెడ్డి ఛాయాగ్రహకుడిగా వ్యవహరిస్తున్నారు. ఒక డిఫరెంట్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ట్రైలర్‌ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేశారు. తాజాగా రిలీజైన ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే యాక్షన్ సీక్వెన్స్ మేయిన్ హైలెట్ అనిపిస్తోంది.
'ఒక వ్యక్తి జీవితాన్ని మలుపు తిప్పే రెండు సంఘటనలు ఒకేరోజు చోటు చేసుకుంటే ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది.. ఎలాంటి పోరాటం చేయాల్సి ఉంటుందన్నది కథలో ఆసక్తికరంగా చూపించబోతున్నారని అర్థమవుతోంది. ఒక ఊరులోని చుట్టు ప్రక్కల గ్రామాలలోని వారందరూ వజ్రాల వేటకి బయలుదేరితే .. హీరో మాత్రం వేరే దారిలో వెళతాడు. ఎంతో జ్ఞానం ఉన్నప్పటికి అసుర లక్షణాలుండటం వల్ల జీవితంలో తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయని'... కథా నేపథాన్ని ట్రైలర్‌లో చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. మొత్తంగా సైన్స్ ఫిక్షన్ కథాంశానికి కమర్షియల్ అంశాలని జోడించి ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఆద్యంతం ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది.
