సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న పవన్ సినిమా
ABN , First Publish Date - 2021-12-22T08:46:34+05:30 IST
పవన్ కల్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంది. పాన్ ఇండియా చిత్రాలైన ‘ఆర్.ఆర్.ఆర్’, ‘రాధే శ్యామ్’లకు చోటు ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో ‘భీమ్లా నాయక్’ నిర్మాత చినబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు...
పవన్ కల్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంది. పాన్ ఇండియా చిత్రాలైన ‘ఆర్.ఆర్.ఆర్’, ‘రాధే శ్యామ్’లకు చోటు ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో ‘భీమ్లా నాయక్’ నిర్మాత చినబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సంక్రాంతికి ‘ఆర్.ఆర్.ఆర్’, ‘రాధే శ్యామ్’లతో పాటు ‘భీమ్లా నాయక్’ కూడా విడుదల కావాల్సింది. అయితే... మూడు చిత్రాలూ ఒకేసారి వస్తే థియేటర్లకు ఇబ్బంది ఏర్పడుతుంది. అందుకే ప్రొడ్యూసర్స్ గిల్డ్ రంగంలోకి దిగి ‘భీమ్లా నాయక్’ బృందానికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించింది. ఆ చర్చలు సఫలీకృతమయ్యాయి. అందుకే జనవరి 12న రావాల్సిన ‘భీమ్లా నాయక్’... ఫిబ్రవరి 25కు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో మంగళవారం ప్రొడ్యూసర్ గిల్డ్ హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. దిల్ రాజు మాట్లాడుతూ ‘‘ఆర్.ఆర్.ఆర్, రాధే శ్యామ్ పాన్ ఇండియా చిత్రాలు. రెండు మూడేళ్లుగా చిత్రీకరణ జరుపుకొంటున్నాయి. ఈ సినిమాల వల్లే బాలీవుడ్ చిత్రాలు సైతం విడుదల తేదీలు మార్చుకుంటున్నాయి. ఇదే విషయాన్ని ‘భీమ్లా నాయక్’ నిర్మాతతో చర్చించాం. పవన్ కల్యాణ్, చినబాబు గార్లు మా పరిస్థితిని అర్థం చేసుకుని సానుకూలంగా స్పందించారు. అందుకే ‘భీమ్లా నాయక్’ చిత్రాన్ని వాయిదా వేశారు. అందుకు ‘భీమ్లా నాయక్’ బృందానికి కృతజ్ఞతలు. ఫిబ్రవరి 25న ‘భీమ్లా నాయక్’ విడుదల అవుతుంది. నిజానికి ఆ రోజున ‘ఎఫ్ 3’ విడుదల కావాలి. ఆ సినిమాని ఏప్రిల్ 29న విడుదల చేస్తాం. విడుదల తేదీలకు సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు, రిలీజ్ డేట్లు క్లాష్ అవుతున్నప్పుడు ప్రొడ్యూసర్స్ గిల్డ్ సర్దుబాటు చేసే ప్రయత్నాలు చేస్తోంది. భవిష్యత్తులోనూ ఇదే పంథాని కొనసాగిస్తామ’’న్నారు. ఈ సమావేఽశంలో డి.వి.వి దానయ్య, దామోదర్ ప్రసాద్, స్రవంతి రవికిషోర్, ప్రమోద్ పాల్గొన్నారు.
థ్యాంక్స్ చెప్పిన రాజమౌళి
‘ఆర్.ఆర్.ఆర్’ విడుదలకు దారి ఇచ్చిన చిత్రాలకు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి కృతజ్ఞతలు తెలిపారు. ‘‘సర్కారు వారి పాట’ పండగ సినిమానే అయినా, వేసవికి షిఫ్ట్ అయి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించిన మహేష్‌కి కృతజ్ఞతలు. తమ విడుదల తేదీ మార్చుకున్న ‘ఎఫ్ 3’ బృందానికీ, ‘భీమ్లా నాయక్’ విడుదల తేదీ వాయిదా వేసిన పవన్ కల్యాణ్, చినబాబు తీసుకున్న నిర్ణయం అభినందనీయం. టీమ్ అందరికీ శుభాకాంక్షలు’’ అని ట్వీట్ చేశారు.