24 ఏళ్ళు పూర్తి చేసుకున్న ‘ఒసేయ్ రాములమ్మా’
ABN, First Publish Date - 2021-03-08T04:30:22+05:30
హీరోలే కాదు మేమూ స్టార్స్మే అని నిరూపించిన నటి ఎవరైనా ఉన్నారు అంటే.. అది ఖచ్చితంగా విజయశాంతే. ఆమె చేసిన కొన్ని చిత్రాలు స్టార్ హీరోల చిత్రాలను సైతం బీట్ చేసి
హీరోలే కాదు మేమూ స్టార్స్మే అని నిరూపించిన నటి ఎవరైనా ఉన్నారు అంటే.. అది ఖచ్చితంగా విజయశాంతే. ఆమె చేసిన కొన్ని చిత్రాలు స్టార్ హీరోల చిత్రాలను సైతం బీట్ చేసి వసూళ్లు రాబట్టాయి. అలాంటి చిత్రాల్లో ముందు వరసలో ఉండే పేరు 'ఒసేయ్ రాములమ్మా'. ఈ సినిమాతో విజయశాంతికి వచ్చిన పేరు, ప్రఖ్యాతలు అన్నీ ఇన్నీ కావు. అప్పటి నుంచి విజయశాంతి పేరుకి ముందు లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్ అంటూ బిరుదులు వచ్చి చేరాయి. ఇంకా చెప్పాలంటే.. ఆ సినిమా తర్వాత ఆమె పేరే మారిపోయింది. రాములమ్మే శాశ్వతం అయిపోయిందంటే అతిశయోక్తి ఉండదేమో. ఆ సినిమా క్రియేట్ చేసిన సంచలనం అలాంటిది. మార్చి 7తో విజయశాంతి నటించిన 'ఒసేయ్ రాములమ్మా' చిత్రం 24 సంవత్సరాలను కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భంగా 'ఒసేయ్ రాములమ్మా' చిత్రాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే..
లేడీ ఒరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా ముందు వరసలో ఉండే చిత్రం 'ఒసేయ్ రాములమ్మా'. దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. తెలంగాణలోని ఓ దళిత మహిళపై దొరలు ఎలా దౌర్జన్యం చేశారు? ఆ దొరలని ఆ దళిత మహిళ ఎలా ఎదురించింది అనే మెయిన్ కాన్సెఫ్ట్‌తో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సునామీని సృష్టించింది. అప్పట్లో రూ. 2.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి దాదాపు రూ. 12.5 కోట్ల రూపాయలను సాధించింది. 110 సెంటర్స్‌లో 50 రోజులు ఆడిన ఈ చిత్రం 34 సెంటర్స్‌లో 100 రోజులు, 8 సెంటర్స్‌లో 175 రోజులు ఆడింది. విజయశాంతికి ఉత్తమనటిగా నంది అవార్డు, ఫిల్మ్ ఫేర్ అవార్డులను ఈ చిత్రం అందించింది. ఇలా ఈ చిత్రం ఇంకెన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. ఈ చిత్రంలోని 'ఓ ముత్యాల రెమ్మా ఓ మురిపాల కొమ్మ ఓ పున్నామి బొమ్మ ఓ పుత్తడి గుమ్మ ఓ రాములమ్మా రాములమ్మా' అనే పాట ఇప్పటికీ వినబడుతూనే ఉంటుంది అంటే.. ఈ సినిమా ఇంపాక్ట్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ ఒక్క పాటే కాదు.. వందేమాతరం శ్రీనివాస్ అందించిన ఈ చిత్రంలోని ప్రతి పాటా అణిముత్యమే. అప్పట్లో ఆడియో క్యాసెట్స్ సేల్‌లో కూడా ఈ చిత్రం కనీవినీ ఎరుగని రికార్డ్‌ని క్రియేట్ చేసింది.