ప్రముఖ నటి చిత్ర ఆత్మహత్యపై ఆర్డీవో ప్రకటన ఇదీ..

ABN , First Publish Date - 2021-01-01T15:46:35+05:30 IST

ప్రముఖ నటి చిత్ర ఆత్మహత్యపై ఆర్డీవో ప్రకటన ఇదీ..

ప్రముఖ నటి చిత్ర ఆత్మహత్యపై ఆర్డీవో ప్రకటన ఇదీ..

చెన్నై : టీవీ సీరియల్‌ నటి ‘ముల్లై’ చిత్ర ఆత్మహత్యకు కట్నం వేధింపులు కారణం కాదని శ్రీపెరుంబుదూరు ఆర్డీవో దివ్యశ్రీ ప్రకటించారు. నటి చిత్రకు, హేమనాథ్‌ అనే యువకుడితో పెళ్ళి నిశ్చితార్థం జరిగింది. వీరి వివాహం జనవరిలో జరగాల్సి ఉండగా ఇరువురూ కుటుంబ సభ్యులకు తెలియకుండా అక్టోబర్‌ 19న రిజిస్టర్‌ మేరేజీ చేసుకున్నారు. ఆ తర్వాత పూందమల్లి సమీపం ఈవీపీ ఫిలిమ్‌ సిటీలో సీరియల్‌ షూటింగ్‌లో పాల్గొన్న చిత్ర నజరత్‌పేటలోని హోటల్‌లో బసచేశారు. ఆమెతోపాటు భర్త హేమనాథ్‌ కూడా హోటల్‌లో వున్నాడు. ఆ నేపథ్యంలో ఈ నెల తొమ్మిదో తేదీ ఉదయం చిత్ర హోటల్‌ గదిలో ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకుంది.


రిజిస్టర్‌ మేరేజీ చేసుకున్న రెండు నెలలకే ఆమె మృతి చెందటంతో ఆర్డీవో దివ్యశ్రీ విచారణ చేపట్టారు. చిత్ర తల్లిదండ్రులు, హేమనాథ్‌ తల్లిదండ్రులు, ఆమెతోపాటు నటించిన నటీనటుల వద్ద ఆమె విచారణ జరిపారు. ఆ విచారణ పూర్తయిన మీదట ఆర్డీవో తన నివేదికను గురువారం ఉదయం పూందమల్లి అసిస్టెంట్‌ పోలీసు కమిషనర్‌ సుదర్శన్‌కు సమర్పించారు. ఆ నివేదికలో చిత్ర వరకట్న వేధింపులకు గురికాలేదని ప్రకటించినట్టు ఆర్డీవో దివ్యశ్రీ తెలిపారు. చిత్ర ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించాడనే నేరారోపణపై అరెస్టయిన హేమనాథ్‌ ప్రస్తుతం పుళల్‌ సెంట్రల్‌ జైలులో ఉన్నారు, నజరత్‌పేట పోలీసులు చిత్ర ఆత్మహత్య కేసుపై ఇంకా  విచారణ జరుపుతున్నారు.

Updated Date - 2021-01-01T15:46:35+05:30 IST