స్వర సామ్రాట్ చక్రవర్తిని తలుచుకునే క్షణమిది

ABN , First Publish Date - 2021-02-03T03:34:49+05:30 IST

స్వరాభ్యాసం గురుముఖఃత లేకపోయినప్పటికీ.. సంగీతంలో ఘనాపాఠి అతడు. పాటను పరుగు పెట్టించడంలో ఒడుపు అతడికి తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు. నాటి స్టార్ హీరోల

స్వర సామ్రాట్ చక్రవర్తిని తలుచుకునే క్షణమిది

స్వరాభ్యాసం గురుముఖఃత లేకపోయినప్పటికీ.. సంగీతంలో ఘనాపాఠి అతడు. పాటను పరుగు పెట్టించడంలో ఒడుపు అతడికి తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు. నాటి స్టార్ హీరోల ఇమేజ్‌కు అతని బాణీలు ఇతోధికంగా తోడ్పడ్డాయి. ఆ స్వర సామ్రాట్ చక్రవర్తి వర్థంతి ఫిబ్రవరి 3. చక్రవర్తి అసలు పేరు కొమ్మినేని అప్పారావు. 'మూగప్రేమ' సినిమాతో మ్యూజిక్‌ డైరెక్టరయ్యారు అప్పారావు. అప్పట్నుంచి అప్పారావు కాస్తా చక్రవర్తి అయ్యారు. ఈ సినిమాలో కళావతి రాగంలో స్వరపరచిన ఈ సంధ్యలో కెంజాయలో అనే పాటను ఇప్పటికీ సంగీతాభిమానులు పదే పదే గుర్తు చేసుకుని మురిసిపోతుంటారు. ఇక.. శారద సినిమాతో విఖ్యాతి గడించారు చక్రవర్తి. మూడ్‌ అంటూ రావాలే కానీ.. చక్రవర్తి బాణీలు కట్టడం లెక్క కాదు. అయిదు నిమిషాల్లో ట్యూన్ చేసి.. గంటలో కంప్లీట్‌ చేయగలరు. 'ప్రేమాభిషేకం' సినిమాలోని 'తారలు దిగివచ్చిన వేళ', 'వందనం అభివందనం', 'కోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్నా', 'నా కళ్లు చెబుతున్నాయి' పాటలను కేవలం ఒకే ఒక్క రాత్రిలో కంపోజ్‌ చేశారట చక్రవర్తి.  ఇలాంటి ఫీట్లు చేయడం కేవలం చక్రవర్తికి మాత్రమే సాధ్యం. 


అవి 'మల్లెపువ్వు' మ్యూజిక్‌ సిట్టింగ్‌ నాటి రోజులు. పాట రచన కోసం వేటూరి.. స్వర రచన కోసం చక్రవర్తి తెగ ప్రయత్నిస్తున్నారు. అప్పటికీ పన్నెండు రోజులు గడిచాయి. ఓ పదిహేను పాటలను ప్రయత్నించి చూశారు. సందర్భానికి తగినట్టు ఒక్కకంటే ఒక్కటి కూడా రావడం లేదు. వేటూరికి విసుగొచ్చేసింది. ఛస్‌ ఒక్క చిన్నముక్క కూడా రావడం లేదు అని బాధపడ్డారు. అదే ముక్కని పేపర్‌ మీద పెట్టి చూడండి గురువుగారు అన్నారు చక్రవర్తి. చిన్న ముక్క చిన్న ముక్క అని రాసుకున్నారు వేటూరి. నిమిషం పాటు ఇద్దరు మొహాలు చూసుకున్నారు. ఇద్దరి మొహాల్లో చిరువదనం. వేటూరి వెంటనే దాన్ని మార్చి చిన్న మాట... ఒక చిన్నమాట అన్నారు. ఎగిరి గంతేశారు చక్రవర్తి. అంతే పాట తయారైంది. సరిగ్గా గంటలో ట్యూన్‌ కూడా అయింది. 


శాస్ర్తీయ సంగీతంలో కాకలు తీరకపోయినా రాగాలతో చక్రవర్తి చేసిన ప్రయోగాలు అనన్య సామాన్యాలు. చారుకేశి రాగాన్ని పాపులర్‌ చేసింది చక్రవర్తే. అసలు ఈ రాగాన్ని మాస్టర్‌ వేణుగారు తప్ప ఇంకో మ్యూజిక్‌ డైరెక్టర్‌ పెద్దగా పట్టించుకోలేదు. ఆ రాగాన్ని అంటుకోడానికి సాహసించలేదు. చక్రవర్తి చాలా పాటలను ఇందులో కంపోజ్‌ చేసి భేష్‌ అనిపించుకున్నారు. ఏటి ఒడ్డున నిలుచుంటే పాట ఒక్కటి చాలు.. చక్రవర్తికి చారుకేశి మీదున్న పట్టును తెలియచెప్పటానికి. యమగోలలో ఆడవే అందాల సురభామినీ కూడా చారుకేశీ రాగంలో కంపోజ్ చేసిందే.


నటులకు డబ్బింగ్ చెప్పడమే కాదు... తన నటనాపటిమతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నారు చక్రవర్తి. 'గోపాలరావుగారి అమ్మాయి'లో చెవిటి లాయర్‌గా... 'పక్కింటి అమ్మాయి'లో సంగీతం మాస్టారిగా....'ఆమెకథ'లో భీమా ఏజెంట్‌గా... 'అల్లరి బుల్లోడు'లో రేషన్‌ ఆఫీసర్‌గా.... 'సీతాపతి సంసారం' తిండిపోతు ఆఫీసర్‌గా...అతనికంటే ఘనుడులో మోటార్‌ షాపు యజమానిగా...'గజదొంగ'లో కానిస్టేబుల్‌గా చక్రవర్తి చక్కగా నటించారు. 


రాఘవేంద్రరావు సినిమాల్లోని పాటలు ఓ రకంగా వుంటే.. జంధ్యాల సినిమాల్లోని పాటలు మరో రకంగా వుండేవి. విశ్వనాథ్‌ సినిమా పాటలు ఇంకో రకంగా.. అలా సినిమా ఏదైనా.. దర్శకుడెవరైనా.. వారి అభిరుచికి తగ్గట్టు... ప్రేక్షకుల మనసు మెచ్చేట్టు సంగీతం అందించడంలో ఘనాపాటి చక్రవర్తి. వేటూరి గడుసరి పాట పిల్లకు సరైన మొగుడు చక్రవర్తే. దర్శకుడి ఆలోచనాసరళికి అనుగుణంగా ఆయన పాట రూపుదిద్దుకునేది. 


తెలుగులో 884 సినిమాలకు సంగీతం అందించిన చక్రవర్తి.. 60 కన్నడ చిత్రాలకు, 4 తమిళ చిత్రాలకు, 1 మలయాళ చిత్రానికి స్వరాలు సమకూర్చారు. అంతేకాదు.. గాయకుడిగా 400 పాటలు పాడటమే కాక.. లిరిక్ రైటర్ గా ఓ 16 పాటలు రాశారు కూడా. మ్యూజిక్ డైరెక్టర్ గా వెయ్యి సినిమాలు పూర్తి చేయాలని కోరుకున్న చక్రవర్తి.. మొత్తం 949 చిత్రాలకు సంగీతం అందించి.. ఆ కోరిక తీరకుండానే 2002, ఫిబ్రవరి 3న కన్నుమూశారు. భౌతికంగా ఆయన దూరమైనా.. ఆయన పాటలు పాతజ్ఞాపకాల్ని మన మనసుల్లో తట్టి లేపుతూనే ఉన్నాయి.

Updated Date - 2021-02-03T03:34:49+05:30 IST