ముగ్గురు మెరవంగా... తెర మురవంగా...
ABN , First Publish Date - 2021-06-17T10:38:39+05:30 IST
సంగీత ప్రధానమైన ఇతివృత్తంతో రూపొందుతున్న మహిళా ప్రాధాన్య చిత్రం ‘గమనం’. దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ విడుదలవనున్న ఈ చిత్రంలో...

ముగ్గురు హీరోలకు ముగ్గురు హీరోయిన్లు జంటగా నటించడం వాడేసిన ఫార్ములా. అవసరమైతే ఒకరు.. ఇద్దరు కాదు.. ముగ్గురు హీరోయిన్లను తీసుకుని కథను ఆసక్తికరంగా నడిపించడం నేటి ట్రెండ్. సినిమాలో మెయిన్ హీరోయిన్ ఒకరున్నా ప్రత్యేక పాత్రలంటూ ఒకరినో, మరొకరినో, ఇద్దరినో హీరోయిన్లను తీసుకుంటున్నారు. సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారంటే ఆడియన్స్‌కు కూడా కన్నులపంటే! ఇలా కలర్‌ఫుల్ కాంబినేషన్స్‌తో తయారువుతున్న చిత్రాలేమిటో చూద్దాం.
నానితో ఆ ముగ్గురు
హీరో నాని ఓ కొత్త తరహా పాత్రను పోషిస్తున్న చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. ఈ చిత్రానికి రాహుల్ సాంకృత్యాన్ దర్శకుడు. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ తర్వాత సాయిపల్లవి నానికి జోడీగా నటిస్తున్నారు. ‘ఉప్పెన’తో ఆకట్టుకున్న కృతీశెట్టి ఈ చిత్రంలో మరో హీరోయిన్‌గా నటిస్తున్నారు. . మలయాళ ‘ప్రేమమ్’తో వెండితెర ప్రవేశం చేసిన మడోన్నా సెబాస్టియన్ ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ముగ్గురు భామలతో నాని చేసే సందడి ఆసక్తికరంగా ఉంటుందని దర్శకుడు చెబుతున్నారు.
ముగ్గురు హీరోయిన్లా.. థాంక్యూ
ప్రేమకథా చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నాగచైతన్య నటిస్తోన్న తాజా చిత్రం ‘థాంక్యూ’. విక్రమ్ కుమార్ దర్శకుడు. కొత్తదనం నిండిన ప్రేమకథతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నాగచైతన్య ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేయనున్నారు. ఓ యువకుడి జీవితంలోకి వచ్చిన ముగ్గురమ్మాయిల వల్ల అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనే నేపథ్యంలో సినిమా సాగుతుందని సమాచారం. ఈ చిత్రంలో ఆయన సరసన . మాళవిక నాయర్, రాశీఖన్నా, అవికా గోర్ నటిస్తున్నారు.
మూడు దశల్లో ముగ్గురు
విష్వక్సేన్ కథానాయకుడుగా నటిస్తున్న ప్రేమకథా చిత్రం ‘పాగల్’. ఈ చిత్రంలో హీరోది ప్రేమికుడి పాత్ర . అతని జీవిత ప్రయాణంలోని వివిధ దశల్లో తారసపడే అమ్మాయిలతో పరిచయం, ప్రేమ అంశాలతో చిత్రం ఆసక్తికరంగా సాగుతుంది. ఈ సినిమాలో విష్వక్సేన్‌తో ప్రేమలో పడే యువతులుగా సిమ్రాన్ చౌదరి, మేఘలేఖ, నివేతా పేతురాజ్ నటిస్తున్నారు.
త్రీ ఇన్ ఒన్ హారర్
విష్వక్సేన్ హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘అక్టోబర్ 31 లేడీస్ నైట్’ తమిళ దర్శకుడు ఎ.ఎల్.విజయ్ రూపొందించిన చిత్రం ఇది. హారర్ నేపథ్యంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రంలో నివేదా పేతురాజ్, మంజిమా మోహన్, మేఘా ఆకాశ్, రెబా మోనికా జాన్ నటించారు. తెలుగు, తమిళ భాషల్లో మంచి ఆదరణ ఉండడంతో వీరిని ఎంపిక చేశారు.
ముగ్గురు మహిళల గమనం
సంగీత ప్రధానమైన ఇతివృత్తంతో రూపొందుతున్న మహిళా ప్రాధాన్య చిత్రం ‘గమనం’. దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ విడుదలవనున్న ఈ చిత్రంలో శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్ జంటగా నటిస్తున్నారు. శ్రియా, నిత్యామీనన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నిత్యామీనన్ గాయని పాత్రలో కనిపిస్తున్నారు. శ్రియా ఒక చిన్న బిడ్డకు తల్లి పాత్రను పోషిస్తున్నారు. గతేడాదే ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. కొవిడ్ నేపథ్యంలో నిర్మాణానంతర కార్యక్రమాల్లో జాప్యం జరిగి విడుదల ఆలస్యమయింది.