ఒమైక్రాన్ ఎఫెక్ట్: మళ్లీ సినిమా ఇండస్ట్రీలో కలవరం

ABN , First Publish Date - 2021-12-29T00:38:36+05:30 IST

కరోనా సెకండ్ వేవ్ ముగిశాక తెరుచుకున్న థియేటర్ల వద్ద ఇప్పుడిప్పుడే కాస్త సందడి మొదలైంది. అయితే ఒమైక్రాన్ రూపంలో మళ్లీ కరోనా మహమ్మారి సినిమా ఇండస్ట్రీని వణికిస్తోంది. సెకండ్ వేవ్ తర్వాత నుండి సినిమాల పరంగా టాలీవుడ్ వరకు కాస్త

ఒమైక్రాన్ ఎఫెక్ట్: మళ్లీ సినిమా ఇండస్ట్రీలో కలవరం

కరోనా సెకండ్ వేవ్ ముగిశాక తెరుచుకున్న థియేటర్ల వద్ద ఇప్పుడిప్పుడే కాస్త సందడి మొదలైంది. అయితే ఒమైక్రాన్ రూపంలో మళ్లీ కరోనా మహమ్మారి సినిమా ఇండస్ట్రీని వణికిస్తోంది. సెకండ్ వేవ్ తర్వాత నుండి సినిమాల పరంగా టాలీవుడ్ వరకు కాస్త మంచి రోజులు నడిచినా.. బాలీవుడ్‌, కోలీవుడ్‌లో మాత్రం సెకండ్ వేవ్ తర్వాత కూడా చాలా రోజుల వరకు థియేటర్లు తెరుచుకోలేదు. దీంతో కొన్ని పెద్ద సినిమాలు కూడా ఓటీటీ బాట పట్టాయి. రీసెంట్‌గానే బాలీవుడ్‌, కోలీవుడ్‌లలో థియేటర్లు తెరుచుకున్నాయి. అయితే పెరుగుతున్న ఒమైక్రాన్ కేసుల దృష్ట్యా మరోసారి సినిమా ఇండస్ట్రీలో కలవరం మొదలైంది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో కర్ఫ్యూలు విధిస్తున్నారు. ఒమైక్రాన్ ఎఫెక్ట్‌తో ఇప్పుడు మళ్లీ లాక్‌డౌన్‌ దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది. జనసంచారం ఎక్కువగా ఉండే చోట ఆంక్షలు విధిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో మళ్లీ థియేటర్లు మూతపడే అవకాశం లేకపోలేదు. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే నైట్ షోలను నిలిపి వేశారు. దీంతో పాన్ ఇండియా సినిమాలే కాకుండా.. ప్రాంతీయ సినిమాల నిర్మాతలు కూడా ఆలోచనలో పడ్డారు. ఇటువంటి పరిస్థితుల్లో సినిమాని విడుదల చేయలేక మేకర్స్ తమ చిత్రాలను వాయిదా వేసుకుంటున్నారు. 


‘జెర్సీ’ హిందీ రీమేక్ వాయిదా

టాలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన ‘జెర్సీ’ చిత్రాన్ని బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. న్యాచురల్ స్టార్ నాని నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ హీరోగా నటించారు. బాలీవుడ్‌లోనూ గౌతమ్ తిన్ననూరినే డైరెక్ట్ చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 31న విడుదలకావాల్సి ఉండగా.. ఒమైక్రాన్ ఎఫెక్ట్‌తో ఇప్పుడీ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లుగా అధికారికంగా చిత్రయూనిట్ ప్రకటించింది. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. మరి డైరెక్ట్ బాలీవుడ్ చిత్ర పరిస్థితే ఇలా ఉంటే.. పాన్ ఇండియా చిత్రాల పరిస్థితి ఏమటన్నది ఇప్పుడు ఆశ్చర్యకరంగా మారింది.


ఎన్నో ఆశలు, అంచనాలతో ‘ఆర్ఆర్ఆర్’

తాజాగా ‘జెర్సీ’ బాలీవుడ్ రీమేక్ చిత్రం వాయిదా పడటంతో.. ఆ తర్వాత జనవరి 7వ తేదీన విడుదల కావాల్సిన పాన్ ఇండియా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపైనే అందరి కళ్లు ఉన్నాయి. ‘ఆర్ఆర్ఆర్’పై ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఎటువంటి అంచనాలు నెలకొని ఉన్నాయో తెలియంది కాదు. అలాగే మేకర్స్ ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఈ సినిమా కోసం టాలీవుడ్, బాలీవుడ్‌లలో సైతం కొన్ని సినిమాలను వాయిదా వేశారు. మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ చిత్రం జనవరి 7న విడుదలవుతుందా? అనే అనుమానాలు ఇప్పుడంతటా వ్యక్తమవుతున్నాయి. ఈ చిత్రం విడుదలకు ఇంకా 9 రోజుల టైమ్ ఉంది. ఈ 9 రోజులలో ఒమైక్రాన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాయో? వంటి అనుమానాల మధ్య ‘ఆర్ఆర్ఆర్’ విడుదల ఆధారపడి ఉంది. ఇప్పటికే ఢిల్లీలో సినిమా థియేటర్లు పూర్తి స్థాయిలో మూసేసినట్లుగా తెలుస్తోంది.


‘ఆర్ఆర్ఆర్’ తర్వాత విడుదల కావాల్సిన మరో పాన్ ఇండియా చిత్రం ‘రాధేశ్యామ్’. జనవరి 14న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ప్రకటన అయితే ఇచ్చారు కానీ.. పరిస్థితులు ఎలా ఉంటాయో అని ఈ చిత్ర మేకర్స్ కూడా ఆందోళన చెందుతున్నారు. ఇంకా జనవరిలో బాలీవుడ్‌లో విడుదల కావాల్సిన ‘పృథ్వీరాజ్’, ‘గెహ్రీయాన్’, ‘ద కాశ్మీర్ ఫైల్స్’, ‘అటాక్’ చిత్రాల విడుదల విషయంలో కూడా ఆయా చిత్రాల నిర్మాతలు ఆలోచనలో పడినట్లుగా తెలుస్తోంది.

Updated Date - 2021-12-29T00:38:36+05:30 IST