ప్రముఖ సినీ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ ఇకలేరు
ABN , First Publish Date - 2021-09-22T06:35:50+05:30 IST
ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ (84) ఇకలేరు. ఆయన చెన్నైలో మంగళవారం వేకువజామున 4 గంటల సమయంలో కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇటీవల నగరంలోని విజయా ఆస్పత్రిలో చికిత్స పొంది...
ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ (84) ఇకలేరు. ఆయన చెన్నైలో మంగళవారం వేకువజామున 4 గంటల సమయంలో కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇటీవల నగరంలోని విజయా ఆస్పత్రిలో చికిత్స పొంది రెండు రోజుల క్రితం క్షేమంగా ఇంటికి చేరారు. అయితే, సోమవారం ఉదయం నుంచి మళ్లీ అస్వస్థతకు గురికావడంతో పాటు రక్తపు వాంతులు చేసుకున్నారు. దీంతో కుటుంబీకులు ఆయన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కానీ అక్కడ చికిత్స ఫలించక మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయానికి బుధవారం ఉదయం 11 గంటల సమయంలో స్థానిక టి.నగర్‌లోని కన్నమ్మాపేట్ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబీకులు తెలిపారు. ఆయనకు భార్య వరలక్ష్మి, కుమారులు విజయ్, శశికుమార్, కుమార్తెలు వనజ, రేఖ. కుమారులిద్దరూ చెన్నైలో ఉండగా, కుమార్తెలు అమెరికాలో ఉన్నారు.
పాలకొల్లు నుంచి చెన్నపట్టణం వరకు...
ఈశ్వర్ స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు. ఆయన పూర్తి పేరు కొసనా ఈశ్వరరావు. ప్రసిద్ధ దర్శకుడు బాపు తెరకెక్కించిన ‘సాక్షి’ చిత్రం ద్వారా ఆయన పబ్లిసిటీ డిజైనర్‌గా ప్రయాణం మొదలుపెట్టారు. అక్కడ నుంచి మొదలైన ఆయన ప్రయాణం నాలుగు దశాబ్దాల పాటు నిర్విరామంగా కొనసాగింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో దాదాపుగా 2,500కి పైగా చిత్రాలకు ఆయన పబ్లిసిటీ డిజైనర్‌గా సేవలు అందించారు. ముఖ్యంగా విజయావాహిని, ఏవీఎం, జెమినీ, అన్నపూర్ణ, సురేష్ ప్రొడక్షన్స్ వంటి ఎన్నో నిర్మాణ సంస్థలకు ఆయన పబ్లిసిటీ డిజైనర్‌గా పనిచేశారు. ఆయన డిజైన్ చేసిన చివరి చిత్రం దేవుళ్ళు. ఈయన ‘సినిమా పోస్టర్’ అనే పుస్తకాన్ని కూడా రాశారు. ఈ పుస్తకానికి సినిమా గ్రంథ రచన విభాగంలో గత 2011లో ‘నంది పురస్కారం’ వరించింది. అంతేకాకుండా, సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గాను గత 2015లో ‘రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని’ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ, ఈ పురస్కారాన్ని ఇంతవరకు ఆయనకు ప్రదానం చేయకపోవడం బాధాకరం.
చెన్నై, ఆంధ్రజ్యోతి
ఇదీ ఈశ్వర్ మార్క్ క్రియేటివిటి

పని తప్పితే మరొకటి తెలియదు : అశ్వనీదత్
పబ్లిసిటీ ఆర్టిస్ట్ ఈశ్వర్ మరణం దిగ్ర్భాంతి కలిగించిందనీ, ఎన్నటికీ మరిచిపోలేని ఒక గొప్ప మహానుభావుడిని చిత్రపరిశ్రమ కోల్పోయిందని అగ్ర నిర్మాత అశ్వనీదత్ అన్నారు. ఈశ్వర్‌తో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ‘మా సంస్థ నిర్మించిన తొలి చిత్రం ‘ఎదురులేని మనిషి’ నుంచి ఈశ్వర్‌గారితోనే పబ్లిసిటీ వర్క్ చేయించేవాణ్ణి. చెప్పిన పనిని సకాలంలో పూర్తి చేసి ఈశ్వర్‌గారు నాకు ఎంతో సహకరించేవారు. మద్రాసులో ఉన్న రోజుల్లో ఆఖరి పోరాటం , జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రాల వరకూ మా సంస్థ ముఖ్య సాంకేతిక నిపుణుల్లో ఈశ్వర్‌గారు ఒకరు. ఆయన్ని ఎప్పుడు కలిసినా ముఖంలో పనికి సంబంధించిన మూడ్ తప్పితే మరొక ఎమోషన్ కనిపించేది కాదు. పని తప్పితే మరొకటి ఆయనకు తెలీదు’ అని చెప్పారు.

ఆయనది ఓ యుగం : శివనాగేశ్వరరావు
విజయనిర్మలగారి దగ్గర నేను ‘అంతంకాదిది ఆరంభం’ చిత్రానికి పనిచేస్తున్న రోజులనుంచీ నాకు ఈశ్వర్‌గారితో పరిచయం. ఆ తర్వాత నేను క్రాంతికుమార్‌గారి దగ్గర చేరాను. ఆయన నిర్మించిన అన్ని చిత్రాలకూ ఈశ్వర్‌గారే పబ్లిసిటీ డిజైనర్. అసిస్టెంట్ డైరెక్టర్‌కు, పబ్లిసిటీ డిజైనర్‌కు సంబంధమే ఉండదు. కానీ నేను పనిచేసే ప్రతి సినిమాకు డిజైనింగ్ వర్క్ జరుగుతున్నప్పుడు ఈశ్వర్‌గారి దగ్గరకు వెళ్లేవాడిని. కింద ఆఫీసు, పైన ఇల్లు ఈశ్వర్‌గారిది. సాయంత్రం నాలుగు గంటలు కాగానే ఆఫీసులో ఎంతమంది ఉంటే అంతమందికి ఆయన ఇంట్లోంచి టీలు వచ్చేవి. ఆయన ఇంటికి కరుణానిధిగారు, ఎమ్జీఆర్ వంటి తమిళ సినీ రాజకీయ ప్రముఖులతో పాటు తెలుగు హీరోలు వెళ్లేవారు. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలోని టాప్ హీరోలందరి క్యారీకేచర్స్ ఈశ్వర్‌గారు వేశారు. తను ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఏ రోజూ ఆయన విసుక్కోవడం నేను చూడలేదు. నవ్వుతూ మాట్లాడేవారు. ఆయన హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా, కలిసేవాణ్ణి. దర్శకుడు దేవీప్రసాద్ మంచి చిత్రకారుడు కూడా. ఒకసారి ఆయన్ని ఈశ్వర్‌గారి దగ్గరకు తీసుకెళ్లి పరిచయం చేశాను. తను గీసిన బొమ్మలు చూపించగానే మనస్పూర్తిగా మెచ్చుకున్నారు. ఎదుటి వ్యక్తిలోని ప్రతిభను మెచ్చుకునే గుణం ఆయనది.
ఆ రోజుల్లో పోస్టర్ ప్రింటింగ్ విజయవాడలోనే జరిగేది. ఈశ్వర్‌గారు తయారు చేసిన డిజైన్స్‌ను పీఆర్‌ఓ ప్రమోద్‌కుమార్ కలెక్ట్ చేసుకుని మద్రాసు నుంచి బయలుదేరే మెయిల్‌లో ఫస్ట్ క్లాస్ కూపెలో ఎవరుంటే వారిని రిక్వెస్ట్ చేసి, జాగ్రత్తగా విజయవాడ చేర్చేవారు.
ఈశ్వర్‌గారు కష్టజీవి. రాత్రిపగలు తేడా లేకుండా పనిచేసేవారు. ఆయనకు నిద్ర వస్తే పడుకొనేవారు. లేవగానే బొమ్మ వేయడం మొదలుపెట్టేవారు. ఆయన తమ్ముడు బ్రహ్మానందరావు. ఆయన లెటరింగ్‌లో స్పెషలిస్ట్. సినిమా టైటిల్ లోగో ఆయన ముందు రాసేవారు. రెండు మూడు రాసిన తర్వాత వాటిని నిర్మాతకు చూపించి ఓకే చేయించుకొనేవారు ఈశ్వర్‌గారు. ఆ తర్వాత తన పని మొదలుపెట్టేవారు.
ఆ రోజుల్లో ప్రముఖ నిర్మాతలు, దర్శకులు ఈశ్వర్‌గారి ఆఫీసు వచ్చి, దగ్గరుండి డిజైన్లు చేయించుకొనేవారు. ఇప్పుడైతే కంప్యూటర్‌మీద డిజైన్లు తయారువుతున్నాయి కానీ ఆ రోజుల్లో అంతా మాన్యువల్ వర్కే. పబ్లిసిటీ డిజైనర్స్‌లో ఈశ్వర్‌గారిది ఓ యుగం. ఒకసారి తమిళంలో ఆరు సినిమాలు రిలీజ్ అయితే, వాటన్నింటికీ ఆయనే వర్క్ చేశారు. తెలుగులో కూడా అత్యధిక చిత్రాలకు ఆయన పనిచేశారు. ఆయన ప్రత్యేకత ఏమిటంటే అన్ని డిజైన్లు చేసినా, అందులో ఏదో దాంట్లో ఆయన గీసిన బొమ్మ ఒకటి తప్పనిసరిగా ఉంటుంది.
అక్కినేని అన్నపూర్ణమ్మగారు చనిపోయిన తర్వాత ఈశ్వర్‌గారిని బతిమాలి ఆయనతో ఆవిడ బొమ్మ లేయించుకొన్నాను. చాలా అద్బుతంగా గీశారు. దాన్ని ప్రింట్లు తీయించి, అన్నపూర్ణమ్మ విగ్రహ ఆవిష్కరణ రోజున అక్కినేని కుటుంబ సభ్యులందరికీ ప్రజెంట్ చేశాను. నా బొమ్మ గీయండి అని ఈశ్వర్‌గారిని అడుగుదామనుకున్నాను. ఎందుకో అడగలేకపోయాను.
